ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం భారతదేశ జనాభా చైనా జనాభాను దాటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారనున్నది. చైనా జనాభా లో 2022 లో క్షీణత నమోదు అయ్యింది. 2021 సంవత్సరంతో పోలిస్తే గత ఏడాదిజ జనాభా 8,50,000 తగ్గింది. చైనాలో జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టడం 1961 సంవత్సరం తర్వాత ఇదే తొలి సారి. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజాగా లెక్కల ప్రకారం 2022 ఏడాదిలో చైనా జనాభా 141.18 కోట్లు అని తేలింది. జననాల వృద్ధి రేటు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది. ఇది ఇలాగే కొనసాగితే ఐక్యరాజ్య సమితి అంచనా వేసిన దానికంటే ముందుగానే చైనాను దాటేసి భారత్ ప్రపంచంలోనే అత్యంత అధిక జనాబా గల దేశంగా అవతరించనున్నది.
చైనా ఆర్ధిక వృద్ధి రేటు దాదాపు మూడు శాతం నమోదు అయిన ఈ తరుణంలో జన సంఖ్య సైతం వెనుకడుగు వేస్తొంది. గత అయిదు దశాబ్దాల్లో చైనాలో ఇంతటి అత్యల్ప వృద్ధిరేటు నమోదు అవ్వడం ఇది రెండో సారి. ఐక్యరాజ్యసమితి ఆర్ధిక, సామాజిక, జనాభా విభాగం 2022 అంచనాల ప్రకారం ఈ సంవత్సరం లోనే చైనాను భారత్ జనసంఖ్యలో అధిగమించనున్నది. 2050 నాటికి భారత్ 166.8 కోట్ల మందితో కిటకిటలాడనున్నది. 131.5 కోట్లతో చైనా రెండో స్థానానికి పడిపోనున్నది.
చైనా అధికారికంగా 2016లోనే ఒకే బిడ్డ విధానానికి స్వస్తి పలికింది. ఇద్దరు, కావాలంటే ముగ్గురికి కూడా జన్మనివ్వాలని ప్రోత్సహించింది. అయినప్పటికీ ఇది పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు. పోషణ భారంగా మారడంతో చైనా ప్రజలు ఇంకా ఒన్ చైల్డ్ పాలనీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల గత కొన్ని సంవత్సరాలుగా జనాభా వృద్ధి రేటు భారీ క్షీణత నమోదు అవుతూ వస్తున్నది. ప్రపంచంలో అత్యధిక జనాభా కల్గిన దేశంగా చైనా సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్నది. త్వరలోనే భారత్ ఆ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
చైనాలో 2022 లో 95.6 లక్షల మంది జన్మించారు. అంతకు ముందు 2021లో 1,062 కోట్ల మంది జన్మించారు. 2021 లో 7.52 శాతం ఉన్న జననాల రేటు 2022 లో 6,77 శాతంకు పడిపోయింది. 72.20 కోట్ల మంది పురుషులు, 68.96 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 16 – 59 వయసు మధ్య గల వారు 87,56 కోట్ల మంది ఉన్నారు. 62 శాతం సీనియర్ సిటిజన్ లు ఉన్నారు. 60 సంవత్సరాల పైబడిన వృద్ధుల సంఖ్య 28 కోట్లు దాటింది. జనాభాలో వీరు 19.8 శాతం.
ఇక ఆర్ధిక వృద్ధి రేటు విషయానికి వస్తే గత సంవత్సరం మూడు శాతానికి పరిమితమైనట్లు చైనా జాతీయ గణాంక బ్యూరో వెల్లడించింది. ఇది ఆదునిక చైనా చరిత్రలో రెండో కనిష్ట స్థాయి. కరోనా కట్టడి చర్యలు, స్థిరాస్థి రంగ కుదేలు కావడం మూలంగా ఆర్ధిక వ్యవస్థ తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. 2021 లో 8.1 శాతం వృద్ధి రేటు నమోదు అయ్యింది. దానితో పోలిస్తే ఈ సారి వృద్ధి రేటు సగానికిపైగా తగ్గింది. అయిదు దశాబ్దాల తర్వాత 2020లో తొలి సారిగా చైనా ఆర్ధిక వృద్ధి రేటు 2.4 శాతం వద్ద అత్యంత కనిష్ట స్థాయికి చేరింది.