విజయవాడ, మార్చి 4 : ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాజ ద్రోహం కేసు పెట్టాలని వైసిపి నేత,మాజీ మంత్రి పార్థసారధి డిమాండ్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని చంద్రబాబు, లోకేశ్ కుట్రల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.
ప్రజల అకౌంట్ల నుంచి డబ్బులు దొంగిలించినా ఏమీ చేయలేని దుస్థితి ఏపీలో నెలకొందని పార్ధసారధి విమర్శించారు. గుమ్మడి కాయల దొంగలా చంద్రబాబు భుజాలు తడుముకుంటున్నారని పార్ధసారధి ఎద్దేవా చేశారు.
విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని పార్ధసారధి ప్రశ్నించారు. వైసిపి అన్ని ఆధారాలతో సహా ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసిందనీ,వాటిపై చర్యలు తీసుకోవాలని పార్ధసారధి డిమాండ్ చేశారు.
వెన్నుపోటు పార్టీ ప్రజలను వెన్నుపోటు పొడవడం తప్ప రాష్ట్రానికి ఏమీ చేయలేదని పార్థసారధి విమర్శించారు . గతంలో పవన్‌ను టార్గెట్ చేసిన చంద్రబాబు…ఇప్పుడు మోది, కేసిఆర్, జగన్‌ను తిడుతున్నారని పార్ధసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్, చంద్రబాబు మధ్య ఏమైనా ఒప్పందం కుదిరిందా అని పార్ధసారధి ప్రశ్నించారు. ప్రజలకు చేసిన పనుల ద్వారా ఓట్లు అడగాలి, అంతేగానీ ఓట్ల తొలగింపుతో అధికారంలోకి రావాలనుకోవడం దిగజారుడుతనమని పార్థసారధి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా జగన్‌ను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.