అమరావతి: పోలీస్ విచారణకు హజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్న టివి 9 మాజీ సిఇఒ రవిప్రకాష్‌పై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్దం పరారైపోయిందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ‘విచారణకు రండి అని పోలీసులు చాలా మర్యాదగా రవిప్రకాష్ ఇంటికి నోటీసులు అంటిస్తుంటే రాత్రికి రాత్రి దొడ్డిదారిలో గోడ దూకేసి బోర్డర్ దాటేశాడు. రేపో మాపో మాల్యాతో సెల్ఫీ దిగుతూ కనిపించి పట్టుకోండి చూద్దాం అంటాడేమో!’ అంటూ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు.
‘పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్ చేయవన్న భ్రమలో ఉన్నాడు.బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్. ఇక ఈ ‘మీడియా నయాం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి అంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు.