వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య లడాయి! జగన్ ఒక చూపు చూడాలోయి!!

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది.ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు మధ్య పొసగడం లేదు.వారు ఒకరినొకరు బాహాటంగా విమర్శించుకునేంత వరకు పరిస్థితి వెళ్లింది.అందరి కన్నా ముందుగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టగా ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధపడ్డారు.దీంతో రఘురామకృష్ణంరాజు జాగ్రత్తపడి ఢిల్లీలోనే కాలం వెళ్లబుచ్చుతూ రచ్చబండ అంటూ జగన్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ యాగీ చేస్తున్నారు.ఇక మొన్న విశాఖపట్నం జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డికి ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ అమర్ నాథ్ ల మధ్య వాగ్యుద్ధం జరగడం ,దానిమీద ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయి పంచాయితీ పెట్టడం తెలిసిందే.

ఇదిలా ఉండగానే తాజాగా కాకినాడ లో మరో వివాదం చోటు చేసుకుంది.అక్కడ కూడా జిల్లా అభివృద్ధి సంక్షేమ మండలి సమావేశంలోనే ఈ గొడవ జరగడం విశేషం.ఆ సమావేశంలో కాకినాడ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని అంశాలపై వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు ,మాజీ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మీద వైసిపి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాలు దువ్వారు. నోరు కూడా పారేసుకున్నారు.సుభాష్ చంద్రబోస్ కు వార్నింగ్ ఇచ్చినట్లు ఆయన మాట్లాడారు.ఇదంతా మీడియాలో ప్రముఖంగా వచ్చినా ఇప్పటివరకు సీఎం పరంగా ఎటువంటి స్పందన లేకపోవటం గమనార్హం.వీరనే కాదు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలకు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని కి మధ్య పోరు సాగుతోంది.

అలాగే బాపట్ల ఎంపీ నందిగం సురేష్బాబు తో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి పొసగడం లేదు.ఇంకా బయటపడలేదు కానీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఆయన లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరిగిపోతోంది.సీనియర్ ఎంపీ అయినప్పటికీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి వైసిపి ఎమ్మెల్యేలు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అలాగే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కి ఆ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇక్బాల్ కి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి.పరిస్థితులు చేజారకముందే జగన్ ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సఖ్యతకు చర్యలు తీసుకోవటం తక్షణావసరమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.