YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన వైఎస్ భాస్కరరెడ్డి సీబీఐ కోర్టులో మరో సారి ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్ పై ఇవేళ విచారణ జరిపిన సీబీఐ కోర్టు మరో సారి ఎస్కార్ట్ బెయిల్ పొడిగించింది. అనారోగ్య కారణాలతో గత నెలలో బెయిల్ కోసం వైఎస్ భాస్కరరెడ్డి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన సీబీఐ కోర్టు తొలుత 12 రోజులు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ వదిలివెళ్లకూడదని కండిషన్ పెట్టింది.

ఈ నెల 3వ తేదీన ఎస్కార్ట్ బెయిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఎస్కార్ట్ బెయిల్ పొడిగించాలని కోరుతూ ఆయిన సీబీఐ కోర్టును ఆశ్రయించారు. కంటికి కాటరాక్ట్ శస్త్ర చేయించుకున్నాననీ, వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని తెలిపినట్లుగా పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన సీబీఐ కోర్టు ఈ నెల పదవ తేదీ వరకూ ఎస్కార్ట్ బెయిల్ ను పొడిగించింది. పదవ తేదీ సాయంత్రం 5 గంటలకు చంచల్ గూడ జైల్ సూపర్నిటెండెంట్ ముందు లొంగిపోవాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే నేటితో ఎస్కార్ట్ బెయిల్ గడువు ముగుస్తుండంటో మరో సారి ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపునకు సీబీఐ కోర్టును భాస్కరరెడ్డి అభ్యర్ధించారు. వైద్యుల సూచన, తదుపరి చికిత్సల కోసం రెండు నెలల పాటు ఎస్కార్ట్ బెయిల్ పొడిగించాలని పిటిషన్ లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు నవంబర్ 1 వరకూ ఎస్కార్ట్ బెయిల్ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ నిందితుడుగా చేర్చిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటే ఉన్నారు. వైఎస్ భాస్కరరెడ్డిని మాత్రం సీబీఐ అరెస్టు చేసి చంచల్ గూడ జైల్ కు తరలించింది. ఆయన పలు పర్యాయాలు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందారు భాస్కరరెడ్డి.