Ys Jagan: కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ కు సీఎం జగన్ ఫోన్ చేశారు.. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకురావడంపై కేంద్ర మంత్రి తో జగన్ సంభాషించారు. వారిని క్షేమంగా ఇంటికి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలను వివరంగా అడిగి తెలుసుకొన్నారు..

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను పక్క దేశాలకు తరలించి అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జయశంకర్ ముఖ్యమంత్రికి తెలిపారు. ఇప్పటికే ఉన్న తెలుగు వారిని క్షేమంగా తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రికి సీఎం జగన్ లేఖ రాశారు. మరోసారి ఫోన్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా తీసుకురావడంపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు వారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా.. ఆ విషయాన్ని వెంటనే విదేశాంగ శాఖ అధికారులకు చేరవేయాలని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపులో రాష్ట్రం నుంచి తగిన సహకారం అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కాగా ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో భారత పౌరులు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. భారత్ కు చెందిన సుమారు 18వేల మంది ఉక్రెయిన్ లో ఉండగా, ఏపికి చెందిన విద్యార్ధులు 1800 మంది వరకూ ఉన్నారని సమాచారం. ఉక్రెయిన్ రాజధాని బాంబుల మోతతో దద్దరిల్లుతున్న నేపథ్యంలో అధికారుల ఆదేశాల మేరకు అక్కడ బంకర్లలో, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. కొందరు విద్యార్ధులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాము బంకర్ లో తలదాచుకున్నట్లు వివరించారు.