బతికున్నంతకాలం వై ఎస్ చేద్దాం అనుకున్నది జగన్ రాత్రికి రాత్రి చేసేశాడు !

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ప‌రిపాల‌న‌లో మ‌రో సంచ‌ల‌న ముద్ర వేసుకున్నారు. రైత‌న్నల జీవితం మార్చివేసే నిర్ణ‌యం తీసుకున్నారు.

రైతులకు ఉచితంగా బోర్లు వేయించే వైఎస్‌ఆర్‌ జలకళ  కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్పరెన్స్‌ ద్వారా సీఎం వైయస్ జగన్  ప్రారంభించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్,  మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, అనిల్‌ కుమార్, గుమ్మనూరి జయరాం, సీదిరి అప్పలరాజు, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, గ్రామీణాభివృద్ది, పంచాయతిరాజ్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఇతర  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

జ‌గ‌న్ ఏమ‌న్నారో తెలుసా?

ఈ సంద‌ర్భంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ, రైతు కోసం మన ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది, ఎన్నికల్లో ఇచ్చిన మరో మాట నిలబెట్టుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించారు. “3648 కి.మీ పాదయాత్రలో రైతుల కష్టాలు స్వయంగా చూశాను. వారికి తోడు ఉంటానని మాట ఇచ్చాను. నాడు ఇచ్చిన మాట ప్రకారం 144 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్‌ నియోజకవర్గాలు ఉండగా, మొత్తం 163 బోరు యంత్రాలు ఇవాళ ప్రారంభిస్తున్నాం. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లనే సాధ్యం. అందుకు ఎంతో సంతోషంగా ఉంది.“ అని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

1600 కోట్ల‌తో…

త‌మ‌పై ప్ర‌జ‌లు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేవుడి దయతో ఇంత గొప్ప కార్యక్రమం అమలు చేస్తున్నామ‌ని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. “రాష్ట్రంలోని అన్ని నియోజకవర్లాలో దాదాపు 2 లక్షల బోర్లు తవ్వడమే కాకుండా, కేసింగ్‌ పైపులు కూడా వేస్తాం.– ఈ పథకంపై వచ్చే 4 ఏళ్లలో రూ.2340 కోట్లు ఖర్చు చేస్తామని గర్వంగా చెబుతున్నాం. చిన్న, సన్నకారు రైతులకు బోర్లు వేయించడమే కాదు, వాటికి మోటర్లు కూడా బిగిస్తాము. ఎన్నికల ప్రణాళికలో బోర్లు వేయిస్తామని చెప్పా, కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా మోటరు కూడా ఇవ్వబోతున్నాం. ఇందుకు దాదాపు మరో రూ.1600 కోట్లు వ్యయం అవుతుందని అంచనా అయినా వెనకడుగు వేయకుండా అమలు చేస్తున్నాం.“ అని ప్ర‌క‌టించారు.

రైతుల కోసం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌….

ప్రతి నియోజకవర్గంలో ఒక బోరు యంత్రం అందుబాటులో ఉంటుందని సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. “రైతులు ఆన్‌లైన్‌ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవచ్చు. లేదా వలంటీర్ల సహాయంతో దరఖాస్తు చేసుకోవచ్చు. హైడ్రో జియాలాజికల్, జియో ఫిజికల్‌ సర్వే ద్వారా ఎక్కడ బోరు తవ్వాలన్నది శాస్త్రీయంగా నిర్ణయిస్తారు. ఆ తర్వాతే బోరు బావి తవ్వుతారు. ఆ సర్వే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు ఎవరికైనా బోరు విఫలమైతే, మరో బోరు కూడా వేస్తాము. ఆ మేరకు ఆదేశాలు జారీ చేశాము. ఒక్కోసారి ఎంత సర్వే చేసినా నీరు పడకపోవచ్చు, అందుకే రెండో సారి కూడా  బోరు  వేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే ఉన్న బోరు ఒక వేళ ఫెయిల్‌ అయితే, అక్కడ కూడా రైతులకు బోరు వేయిస్తాము.వారు దరఖాస్తు చేసుకుంటే చాలు.“ అని సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

వైఎస్ సంచ‌ల‌న పథ‌కం త‌ర్వాత‌…

“నాడు 2004లో నాన్నగారు రైతుల కోసం ఉచిత విద్యుత్‌ ఇచ్చారు.ఇవాళ మరో అడుగు ముందుకు వేస్తూ, రైతులకు ఉచితంగా బోరు బావి తవ్విస్తున్నాము. ఒక బోరు రైతుల జీవితాలు ఎలా మారుస్తాయి అన్నది.. అందరికి అవగాహన ఉండదు. ఈ బోరు ద్వారా రైతుల జీవితాలు మారుతాయి. రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మోటర్లు ఉన్నాయి. వాటి సగటు సామర్థ్యం 7.5 హెచ్‌పీ. అంటే గంటకు 5 యూనిట్లు. రోజుకు 9 గంటల సరఫరా అంటే 45 యూనిట్లు. ఇవాళ ఒక్కో యూనిట్‌ ధర రూ.6.87. ఆ విధంగా నెలకు ఒక్కో రైతుకు బోరు ద్వారా రూ.9274 మేర ప్రయోజనం కలుగుతుంది. ఆ పథకానికి మరింత మెరుగుదిద్దుతూ, ఉచితంగా బోర్లు వేయిస్తున్నాము. వాటి వల్ల లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. లక్షలాది రైతులకు మేలు జరుగుతుంది. మెట్ట ప్రాంతాల్లో వలసలు తగ్గడంలోనూ ఇది ఉపయోగపడుతుంది.“ అని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

బాబు చేసింది ఏంటో చెప్పేసిన జ‌గ‌న్

త‌మ‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి, ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.8655 కోట్లు బకాయిలు ఉన్నాయని పేర్కొన్న వైఎస్ జ‌గ‌న్ చంద్రబాబు ప్రభుత్వం ఇంత భారీ బకాయి పెట్టిందని తెలిపారు. “ఆ మొత్తాన్ని చిరునవ్వుతో చెల్లించాం. రైతులకు పగలే ఉచితంగా విద్యుత్‌ 9 గంటలు ఇవ్వాలని సంకల్పించాం. కానీ అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 58 శాతం ఫీడర్లలోనే ఆ సదుపాయం ఉంది. ఎందుకంటే ఆ దిశలో గత ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచన చేయలేదు. అందుకు ఫీడర్‌ కెపాసిటీ, తగిన మౌలిక వసతుల కోసం గత 16 నెలలుగా రూ.1700 కోట్లు ఖర్చు చేశాం. దాంతో ఇవాళ 85 శాతం ఫీడర్ల కెపాసిటీ పెంచాం. రానున్న కొన్ని రోజుల్లో మిగిలిన 15 శాతం ఫీడర్ల సామర్థ్యం కూడా పెంచుతాం. ఉచిత విద్యుత్‌కు మీటర్ల ఏర్పాటుపై రకరకాలుగా విచిత్ర వాదనలు చేస్తున్నారు. లోడు తెలుసుకుని మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలి పోకుండా జాగ్రత్త  పడడం కోసమే మీటర్లు బిగించాలన్న నిర్ణయం.అంతేకాదు దాని వల్ల లోడు ఎంత అన్నది కూడా తెలుస్తుంది. ఇంకా ఎంత వోల్జేజీతో విద్యుత్‌ సరఫరా జరగుతుంది అన్నది కూడా తెలుస్తుంది, అలా తెలిసినప్పుడు ఫీడర్ల కెపాసిటీ పెంచి, నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వడం సాధ్యమవుతుంది. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఒక హక్కుగా ఇస్తాం.“ అని సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.