YS Sharmila: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సమస్యను పురస్కరించుకుని కేసిఆర్ సర్కార్ పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ప్రైవేటు ఆస్పత్రుల టీకా దందా” పేరుతో ఓ దినపత్రికలో వార్తను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేటుకు ఎలా దొరుకుతున్నాయని కేసిఆర్ ను ప్రశ్నించారు. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? అని నిలదీశారు షర్మిల. కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూతకండ్ల పాలన అంటూ సెటైర్ వేశారు.

“తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్రభుత్వాస్పత్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్నయ్. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి” అంటూ ట్విట్ చేశారు.
Read More: Anandaiah Medicine: ఆ టీడీపీ మాజీ మంత్రి పైనా కేసు నమోదు..!!
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో డోసుకు రూ.1,250ల నుండి రూ.1,600 వరకూ తీసుకుంటున్నారనీ, అయిదు రోజుల్లో రూ.21 కోట్ల వ్యాపారం చేశారని ఓ పేపర్ ల వచ్చిన కథనంపై షర్మిల ష్పందించారు. దీనిపై పూర్తిగా తెలంగాణ యాశలో కేసిఆర్ ను విమర్శిస్తూ షర్మిల ట్వీట్ చేయడం గమనార్హం.
ఇప్పటికే వైఎస్ షర్మిల ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ జరిగిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టీపీ) గా ఎన్నికల సంఘం గుర్తించింది. గత కొద్ది రోజులుగా షర్మిల పార్టీ ప్రతినిధులు వైఎస్ఆర్ టీమ్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో షర్మిల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. వివిధ పత్రికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ వర్గాలు, ప్రజా సమస్యలపై వస్తున్న కథనాలపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.