YS Sharmila : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న అంశం రాజకీయంగా సంచలనం అవుతోంది.

తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది? రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయి? ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఆమెకు తెలంగాణలో మద్దతు ఇచ్చేదెవరు? వంటి ప్రశ్నలపై పార్టీలకతీతంగా ఆసక్తి వ్యక్తమవుతోంది.
YS Sharmila : అప్పటి పాదయాత్రే ఇప్పుడు పునాది!
కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధపడుతున్న వైఎస్ షర్మిల.. గతంలో తెలంగాణతో పాదయాత్ర చేసిన అంశం ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి తెలంగాణలోనూ పెద్దఎత్తున అభిమానులు ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమల్లోకి తెచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ సహా పలు పథకాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ప్రధానంగా ఇక్కడి రెడ్డి సామాజిక వర్గంతోపాటు, ప్రత్యేకించి కొన్ని వర్గాలు వైఎ్‌సను సొంత మనిషిగా భావించాయి. ఈక్రమంలోనే తెలంగాణకు చెందిన పలువురు నేతలు వైఎస్ వీర విధేయులుగా ముద్ర వేయించుకున్నారు. 2009 సెప్టెంబరు 2న రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన తనయుడు జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి, వైసీపీని స్థాపించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్లారు. అదే సమయంలో జగన్ చెల్లెలు షర్మిల చేపట్టిన పాదయాత్ర తెలంగాణలోనూ సాగింది. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న తదుపరి 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోనూ వైసీపీ పోటీ చేసింది. ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానాన్ని గెల్చుకుంది. అనంతరం రాష్ట్ర విభజన జరగటం, జగన్ ఏపీ రాజకీయాలకే పరిమితం కావడంతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ… టీఆర్ఎస్ కండువాలు కప్పుకొన్నారు. ఆ తర్వాత 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదు. 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. జగన్ ఆ రాష్ట్ర సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టనున్నారన్న వార్త.. ప్రత్యేకించి వైఎస్ అభిమానుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది.
YS Sharmila : షర్మిల పార్టీకి వైఎస్ అభిమానులు వలస?
2014 తర్వాత తెలంగాణలో వైసీపీ కార్యకలాపాలు లేకపోవడంతో మొదట వైఎస్, ఆ తర్వాత జగన్ వెంట నడిచిన చాలా మంది నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల్లో సర్దుకుపోయారు. వారంతా వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడితే ఆయా పార్టీల నుంచి బయటికి వస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమవుతోంది. గడిచిన ఆరున్నరేళ్లలో ఇతర పార్టీల్లో కుదురుకున్నప్పటికీ, వైఎస్ కుటుంబానికి సన్నిహితులు, విధేయులైన వారు మాత్రం షర్మిల వెంట నడిచే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీలో కొనసాగుతున్నారు. షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడితే, వారంతా క్రియాశీలకంగా మారి.. ఆమెకు అండగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఉమ్మడి ఏపీ సీఎంగా వైఎస్ తీసుకొచ్చిన పథకాల లబ్ధిదారులు కూడా షర్మిల పార్టీకి బాసటగా నిలుస్తారని అంటున్నారు.
షర్మిల కు బీజేపీ స్నేహ హస్తం?
తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిల ఇక్కడ పెట్టబోయే పార్టీకి బీజేపీ వ్యూహాత్మకంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈమధ్య తెలంగాణలో పుంజుకుంటున్నప్పటికీ, బీజేపీకి సామాజిక వర్గాల వారీగా ఓటు బ్యాంకు లేదని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ‘‘కమల నాథులు మొదటి నుంచీ ఆర్‌ఎ్‌సఎస్ కార్యకర్తలు, సానుభూతిపరులు, జాతీయవాదంపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా హిందూత్వాన్ని రాజేసి రాజకీయ ప్రయోజనం పొందుతున్నారు. ప్రత్యేకించి కులాల వారీ ఓటు బ్యాంకు ఆ పార్టీకి లేదు’’ అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల పెట్టబోయే పార్టీని ప్రోత్సహిస్తే తమకు రాజకీయంగా కొంత సానుకూలమవుతుందని, కొత్త ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవచ్చని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో షర్మిల పార్టీకి మద్దతు ఇస్తే… ఆర్‌ఎ్‌సఎస్ మూలాలు, జాతీయ వాదానికితోడు రెడ్డి సామాజిక వర్గం, సెటిలర్లు అండగా నిలుస్తారని అంచనా వేస్తున్నారు.కాగా షర్మిల కనుక కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తే ముందుగా కాంగ్రెస్ ఆ తర్వాత టీఆర్ఎస్ దెబ్బతింటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.