పిల్లి వైఖరి వైస్సార్సీపీకు సంకటం? : తూర్పుగోదావరి రాజకీయాలు మారబోతున్నాయా ?

Share

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి )

తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు అన్ని పార్టీలకు కీలకం. 19 అసెంబ్లీ సీట్లు ఉన్న అతిపెద్ద జిల్లాగా, ఎక్కడ ఏ పార్టీ ఆధిక్యత లో కొనసాగితే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అంతా బలంగా నమ్ముతారు. అలాంటి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు అధికార వైఎస్ఆర్సీపీలో నిప్పు రాజుకుంటోంది. మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అధికార పార్టీ మీద నిప్పులు చెరుగుతున్నారు. బహిరంగంగానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాకినాడ లో జరిగిన జిల్లా స్థాయి డిఆర్సి సమావేశంలో కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడికి, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మధ్య తీవ్రస్థాయి వాదోపవాదాలు జరిగాయి. టిడికో పథకం ఇళ్ల కేటాయింపులో అంతులేని అవినీతి జరిగిందని పిల్లి ఆరోపించారు. అంతేకాకుండా కాకినాడ నగరం ముంపుకు గురయ్యే ఒక వంతెన నిర్మాణాన్ని ఆపివేయాలని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు అంతులేని అవినీతి చేశారని ఆయన సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్.

 

ఉండలేరా??

పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీసీ వర్గం నేత. 2004 వైస్సార్ హయాంలో రామచంద్రపురం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన ఆయనను వైయస్ రాజశేఖర్ రెడ్డి సమయంలో బాగా ప్రోత్సహించేవారు. ఆయన కేబినెట్ లో చోటు ఇచ్చారు. తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో ఆయనకి ప్రాధాన్యం దక్కింది. వైస్సార్ మరణం తర్వాత ఏ మాత్రం ఆలోచించకుండా ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ పార్టీ పెట్టడంతో వెంటనే చేరిపోయారు. మొదటి నుంచి జగన్కు వెన్నుదన్నుగా నిలిచారు. అయితే 2019 ఎన్నికల్లో బోస్కు సొంత నియోజకవర్గం నుంచి జగన్ టికెట్ ఇవ్వకపోవడం సంచలనం అయ్యింది. బలమైన నేతగా, జగన్ వెన్నంటే నడిచిన పిల్లి సుభాష్ కు టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచర వర్గం అంత తిరుగుబావుటా ఎగురవేశారు. ఆయనను కాదని బీసీ వర్గం నేత చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణకు టికెట్ ఇచ్చి బోస్ కు ఎమ్మెల్సీ హామీ మేరకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో బోస్ వర్గంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే జగన్ శాసన మండలి రద్దు విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో దానిలో భాగంగా ఎమ్మెల్సీలుగా మంత్రివర్గంలో కొనసాగుతున్న పిల్లి సుభాష్ మోపిదేవి వెంకటరమణలను మంత్రులుగా రాజీనామా చేయించారు. వారికి గవెర్నెర్ కోటాలో రాజ్యసభకు అవకాశం ఇచ్చారు. ఈ పరిణామం బోస్కు ఇబ్బందిగా మారింది. దీనిపై ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్లు అనుచరగణం చెబుతారు. జగన్కు మొదటి నుంచి అండదండగా ఉన్న ఇలాంటి బీసీ వర్గం నేత, ఆయన అనుభవాన్ని జగన్ అవమాన పరిచారని ఉప ముఖ్యమంత్రి పదవిని సైతం ఏడాదిపాటు అవకాశం ఇచ్చి రాజీనామా చేయించారాని, అదే నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వేణుగోపాల్ కు అవకాశం ఇవ్వడం ద్వారా బోస్ ను అవమానించారని ఆయన అనుచరగణం కోపం మీద ఉన్నారు.

మండలి  రద్దు ఏది??

శాసన మండలి రద్దు విషయంలో జగన్ వెనక్కి తగ్గినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని శాసన మండలి రద్దు విషయం అంత చిన్న విషయం కాదని ఢిల్లీ వర్గాలు ముఖ్యమంత్రికి స్పష్టం చేశాయి. దీనిపై జగన్ పునరాలోచనలో పడ్డారు. కొందరు నేతలకు ఎమ్మెల్సీ హామీలు అప్పుడే ఇస్తున్నారు. అంటే మండలి రద్దు కు జగన్ పూర్తిగా వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మరో ఏడాదిలో మండలిలో వైకాపా బలం పెరుగుతుంది. అప్పుడు మండలి ఎలాంటి బిల్లును అడ్డుకోవడానికి వీలుండదు. దీంతో మరింత మంది నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి చల్లబరచవచ్చు. దీంతో జగన్ మండలి రద్దు విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారని తెలుస్తోంది. మండలి రద్దు అంశంపై నిర్ణయం తీసుకుంటామని కోణంలోనే పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణను మంత్రివర్గం నుంచి తప్పించారు. ఇప్పుడు మండలి రద్దుపై ప్రభుత్వం సిద్దంగా లేదు. మరి అలాంటప్పుడు తమను ఎమ్మెల్సీలుగా వెంటనే ఎందుకు రాజీనామాలు చేయించారు అనేది ఇరువురు నేతల ప్రశ్న. ఈ విషయంలో పిల్లి సుభాష్ దూకుడు మీద ఉన్నారు. తనను కావాలనే జగన్ అవమానించారని ఆయన భావిస్తున్నారు. దీంతోనే ఆయన సొంత పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఆయనకు రాజకీయ వైరం ఉన్న నేతలను ఆయన టార్గెట్ చేస్తున్నారు. దీనిపై తూర్పుగోదావరి జిల్లా నేతలు జగన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆయన వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ సీపీని వీడుతున్నట్లు అని తూర్పుగోదావరి జిల్లాలో అప్పుడే ప్రచారం వేడెక్కింది. సొంత పార్టీ నాయకులే ఆయనను నిందిస్తూ అవమానిస్తూన్న పార్టీలో కొనసాగే కన్నా వైయస్సార్సీపిని వీడటం మేలని బోస్ తో పాటు ఆయన అనుచర గణం బలంగా భావిస్తోంది. ఇదే జరిగితే తూర్పుగోదావరి జిల్లా రాజకీయ ముఖచిత్రం మారడం ఖాయం.


Share

Related posts

మేము “ఆప”ము అంటున్న కేజ్రీవాల్..! అదేమిటో చూడండి..!!

somaraju sharma

KCR : కేసీఆర్ పుట్టిన రోజు… చిరు, మ‌హేష్‌, రోజా స్పెష‌ల్ గెస్టులు

sridhar

Riythvika Latest Photos In Saree

Gallery Desk