‘బిజెపి’ ‘కోడి కత్తి‘, రెండూ ఒకటే : చంద్రబాబు

అమరావతి, జనవరి 6: బిజెపి, కోడి కత్తి పార్టీ రెండు ఒకటేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పునాదిపాడు గ్రామంలో ఆదివారం ఆయన ఆరవ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘కోడి కత్తి’కి నాకు ఏమైనా సంబంధం ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ విషయంలో తనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఈ కేసు ఎన్ఐఎకు ఇవ్వడం అధికార దుర్వినియోగమేనని ఆయన పేర్కొన్నారు.
కేంద్రం పూర్తిగా సహకరించడంలేదనీ, పైగా రాష్ర్టం హక్కులను కాలరాస్తున్నారని సిఎం ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎదురు మాట్లాడిన వారిని అణిచివేసేందుకు కేంద్ర సంస్థలతో దాడులు చేయించి, కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.
ముస్లింల పట్ల బిజెపి వ్యతిరేకభావంతో వ్వహరిస్తోందనీ. ట్రిపుల్ తలాక్ ను క్రిమినల్ నేరం చేయాలని చూూడడం అందులో భాగమేననీ ఆయన అన్నారు. అందుకే ఆ ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించిందని ఆయన పేర్కొన్నారు. మరోపక్క కేరళలో అదే పార్టీ సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా గందరగోళం సృష్టిస్తున్నదని ఆయన అన్నారు. రఫేల్ కుంభకోణం, విజయమాల్య, నీరవ్ మోదీ పరారీ వంటి వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వ అవినీతి, అసమర్ధతలను తెలియజేస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు.
విభజన తర్వాత పోలవరం ముంపు మండలాలుగా గుర్తించిన ఏడు మండలాలు రాష్ట్రానికి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి సాధించామని ఆయన పేర్కొన్నారు. ఆ ఏడు మండలాలు రాకపోతే ప్రాజెక్టు కట్టగలిగేవారం కాదని ఆయన చెప్పారు. పోలవరం రాక మునుపే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టి కృష్ణా డెల్టాను కాపాడామని తెలిపారు. దేశంలో నాణ్యంగా, వేగంగా నిర్మాణమవుతున్న ప్రాజెక్టుగా పోలవరానికి అవార్డు కూడా లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు
ప్రపంచంలో ఎవరూ వేయనంత కాంక్రీట్ ఒకే రోజులోనే వేయడం మనందరికీ గర్వకారణమని సిఎం తెలిపారు. నదుల అనుసంధానం సంకల్పించి రాష్ర్టంలో 62 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామనీ, వీటిలో 17 పూర్తి కాగా మరో ఆరు ప్రాజెక్టులు దాదాపుగా పూర్తయ్యాయని ఆయన తెలిపారు. వ్యవసాయంలో 11 శాతం అభివృద్ధి సాధించామనీ, దీనికి రాష్ర్ట ప్రభుత్వం అవలంబించిన విధానాలే కారణమని ముఖ్యమంత్రి చెప్పారు.