మన శరీరానికి నిత్యం అవసరం అయ్యే పోషకాల్లో జింక్ కూడా ఒకటి. కానీ చాలా మంది దీని గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ నిజానికి ఈ పోషక పదార్థం కూడా నిత్యం మనకు అవసరమే. దీని వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం, వెంట్రుకలు సంరక్షింపబడతాయి. అయితే మనం నిత్యం జింక్ ఉన్న పదార్థాలను తీసుకోకపోతే జింక్ లోపం ఏర్పడుతుంది. దీంతో పలు సమస్యలు వస్తాయి.
జింక్ లోపిస్తే శరీర బరువు అనూహ్యంగా తగ్గుతుంది. రుచి, వాసన చూసే శక్తి తగ్గుతుంది. గాయాలు చాలా ఆలస్యంగా మానుతాయి. తరచూ నీళ్ల విరేచనాలు అవుతుంటాయి. ఆకలి తగ్గుతుంది. మొటిమలు బాగా వస్తాయి. చర్మంపై దద్దుర్లు వస్తాయి. కొన్ని సార్లు అది గజ్జికి దారి తీసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వెంట్రుకలు బాగా రాలిపోతుంటాయి. ఈ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే వారు ఆలస్యం చేయకుండా వెంటనే జింక్ ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలి.
స్త్రీలకు నిత్యం 8 మిల్లీగ్రాముల మోతాదులో జింక్ సరిపోతుంది. పురుషులకు నిత్యం 11 మిల్లీగ్రాముల జింక్ అవసరం. మటన్, ఆల్చిప్పలు, బీన్స్, శనగలు, పప్పు దినుసులు, అవిసె గింజెలు, గుమ్మడికాయ విత్తనాలు, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులు, తృణ ధాన్యాలు, జీడిపప్పు, బాదంపప్పులలో జింక్ ఎక్కువగా ఉంటుంది. నిత్యం ఈ పదార్థాలను తీసుకున్నట్లయితే జింక్ సరిగ్గా అందుతుంది. దీంతో జింక్ లోపం రాకుండా, తద్వారా పైన తెలిపిన సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.