‘కవిత’మ్మ పండగకి కాస్త విరామం!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందంటే… టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరామ్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణ జాగృతి, తెలంగాణ సమాజం, ఇతర రాజకీయ పార్టీలు కలసి కట్టుగా పోరాటం చేశాయి. ఆ క్రమంలోనే తెలంగాణ ప్రజల కల సాకారమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే… తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తనయ తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కె. కవిత ప్రజలను బతుకమ్మ పండగ ద్వారా సంస్కృతికంగా చైతన్యం చేశారనే చెప్పాలి.

తెలంగాణ ఉద్యమంలో ఈ పండగ కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండగగా కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ప్రతి ఏడాది శరన్నవరాత్రుల సమయంలో ఈ పండగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాక.. ప్రపంచం నలుమూల ఉన్న తెలంగాణ ప్రజలు సైతం ఈ పండగ జరుకోవడం అనవాయితీగా వస్తుంది. విదేశాల్లో నిర్వహించే ఈ పండగకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ అయితేనేమీ… వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నేతలు అయితేనేమీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు… అవుతున్నారు.

అదే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అయితే… ట్యాంక్ బండపై ఈ పండగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అదీ కవిత ఆధ్వర్యంలో. కానీ ఈ పండగకు కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ. 10 కోట్లు కేటాయిస్తున్నదంటూ విపక్షాలు నానా యాగీ చేసి పారేశాయి. అయినా గత నాలుగేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తునే ఉంది. కవితమ్మ.. బతుకమ్మ ఆడుతూనే ఉంది. దీంతో బతుకమ్మ పండగ కాస్తా.. కవితమ్మ పండగగా మరిపోయిందంటూ విపక్షాలు సెటైర్లు వేస్తూ వచ్చాయి.

అయితే తాజాగా తెలంగాణలో ముందుస్తు ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో ఈ సారి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం లేదని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికలు దూసుకొస్తున్న వేళ.. వాటిపై దృష్టి సారించడం అనివార్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కవిత అంటున్నారు. తెలంగాణ మహిళలందరూ ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు.