‘మని’షి కోసం పరుగు…

Share

మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అంటూ ఓ కవి… నేటి సమాజంలో పాదుకుంటున్న పెడ ధోరణిలను అద్దం పట్టేలా తన పాట ద్వారా చూపాడు. కొన్ని సంఘటనలు చూస్తే.. ఈ మాటలు అక్షర సత్యాలు అని చెప్పక మానదు. తాజాగా అమృత్‌సర్‌లో దసరా ఉత్సవాల సందర్భంగా రావణ దహనం జరుగుతున్న సమయంలో రైలు పట్టాలపై నిల్చుని ఆ దృశ్యాలను వీక్షిస్తున్న వారిపై రైలు దూసుకురావడంతో వారిలో 62 మంది విగత జీవులయ్యారు. పలువురు తీవ్ర గాయాల పాలైయ్యారు.

ఆ క్రమంలో పలువురి కాళ్లు తెగిపడ్డాయి. మరికొందరి చేతులు విరిగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మారు మ్రోగింది. అయితే ఇక్కడే ఆ ప్రాంతంలోని ప్రజలు తమ మానవత్వాన్ని చాటాలి. కానీ వారి అందుకు విరుద్ధంగా వ్యవహరించి… మానవత్వానికే మచ్చ తెచ్చారు. మృతుల జేబుల నుంచి నగదు, బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు దొంగిలించారు. అంతేకాదు.. ఈ ఘటనలో గాయపడి కదల లేని స్థితిలో ఉన్న క్షతగాత్రుల వస్తువులను దోచుకుపోయారు…అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఈ తరహా ఘటనలు మనకు కొత్తేం కాదు…ఉదాహరణకు 1980 దశకంలో విజయవాడ నడిబోడ్డున ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేని దారుణంగా నరికి చంపారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆ నగరం దద్దరిల్లింది. హింస రచన.. ధ్వంస రచన … ధ్యేయంగా నాడు సాగిన మారణ హోంతో ఎంతో మంది మృత్యువాత పడ్డారు. ఇళ్లు, దుకాణాలు దారుణంగా లూటీ చేశారు. అక్కడితో ఆగలేదు. ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు.

అలాగే భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దారుణ హత్య కావింపబడినప్పుడు హస్తినలోని సిక్కులపై దాడులు జరిపారు. ఊచకోతలు కోశారు. ఈ ఘటనలలో అనేక మంది మరణించారు. దేశంలో ఎక్కడ ఏ మూల హింస చెలరేగినా …. గృహదహనాలు… లూటిలు మాత్రం సర్వసాధారణమై పోయాయి.

తాజాగా ఓ వ్యక్తి ఆపదలో ఉంటే.. సాటి మనిషిగా అతడిని రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలు అన్వేషించాల్సింది పోయి… అతడు రక్తపు మడుగులో పడి ఉంటే సెల్ఫీలు తీసుకుంటు వికృతానందం పొందుతున్నారు. అందుకు తాజాగా హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రేమ పెళ్లి చేసుకుందని ఓ కూతురుపై ఆమె తండ్రి మనోహరాచారి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తనను రక్షించాలంటూ ఆమె రహదారిపై వెళ్తున్న వారిని ప్రాధేయపడినా

.. ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ఎప్పటికో కాని.. వారిని ఆసుపత్రికి తరలించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అలాగే దేశంలో ఆపదలో ఉన్న వారికి సాయం చేసే వారు లేరా అంటే ఉన్నారు. ఉదాహరణకు కేరళలో వరద బీభత్సం సృష్టించిన నష్టం అంతా ఇంతా కాదు. దీనిపై మానవతతో అనేకులు స్పందించారు. కేరళ రాష్ట్రం కోలుకోవాలని.. అందుకు మేము సైతం … అంటూ వివిధ రకాలుగా సాయం అందించేందుకు ముందుకు వచ్చిన వారెందరో ఉన్నారు. కానీ పలు సందర్భాల్లో ఇలాంటివారి కంటే కూడా విధ్వంసం, లూటీలు, గృహదహనాలకు పాల్పడే వారి శాతమే అధికంగా ఉండడం దురదృష్టకరం.

రానున్న రోజుల్లో మనిషికి మనిషి సాయం చేయాల్సింది పోయి… మనిషి… కేవలం మనీ కోసమే మనుగడ సాగించే మనిషిలా మారే రోజులు దాపురించేలావున్నాయి. అదే విధంగా భూకంపాలు వచ్చినా… సునామీలు వచ్చినా… వాటి బారిన పడిన వారు అటు షెల్టర్లు… ఇటు ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటే.. పలువురు ఇళ్ల మీద పడి అందిన కాడికి దోచుకుని పోతున్నారు. అంతేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యం అని తెలిసిన తర్వాత.. 2013 అక్టోబర్‌లో ఉత్తరాంధ్రలోని కీలక జిల్లాలో అల్లరి మూకలు విజృంభించాయి.

మద్యం దుకాణాలపై కొందరు దాడులు చేసి.. అందినకాడికి దోచుకుపోయారు. అదికూడా కరెంట్ సరఫరా నిలిపివేసి… పక్కా పథక రచనతో దోపిడీలు సాగించారు. అలాగే ప్రపంచంలో ఎక్కడ.. ఎలాంటి….. సంఘటనలు చోటు చేసుకున్నా.. ఓ మనిషి మరో మనిషిని దోచుకునే ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తన సౌఖ్యం చూసుకోవడమే తప్ప సాటి మనుషుల పట్ల, తోటి మనుషుల పట్ల సంవేదనతో వ్యవహరిస్తున్న సందర్భాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ ధోరణి ఇంకా ఇలాగే కొనసాగితే మనిషిలో మనిషి పూర్తిగా మాయమైపోతాడనేదే సమాజ హితైషుల ఆవేదన.


Share

Related posts

కరోనాకి.. కులానికి ఏంటా లింకు…?

Srinivas Manem

మన తరం తుగ్లక్ కథ మనమే రాసుకోవాలి

Siva Prasad

Poll : జస్టిస్ రమణ సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తి కానున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ చిక్కుల్లో పడినట్టేనా..!?

siddhu

Leave a Comment