కొన్నాళ్ళు నిద్రపోయి ఉండొచ్చు –
మరి కొన్నాళ్ళు మూర్ఛపోయి ఉండొచ్చు –
ఇంకొన్నాళ్ళు మైకంలో ములిగిపోయి ఉండొచ్చు –
కొన్నాళ్ళు తమకంతో తడిసిపోయి ఉండొచ్చు –
లేదంటే, పరధ్యానంలో పడిపోయి ఉండొచ్చు –
ఎదో పారవశ్యంలో తనను తాను మర్చిపోయి ఉండొచ్చు –
కానీ నా జాతి కన్నుమూయలేదు!
ఆలస్యంగానైనా మేలుకొంది, అదే పదివేలు!!
అమ్మయ్య! నా జాతి మేల్కొనే వుంది!!
***
మొత్తం కూడితే వాళ్ళు 49 మంది మాత్రమే!
అటునుంచి ఇటు లెక్కపెట్టినా అంతే –
ఇటునుంచి అటు లెక్కపెట్టినా అంతే-
అర్ధశతకానికి ఒకటి తక్కువే – అయితే ఏం?
వయస్సు మళ్ళిన వాళ్లేమో కానీ,
ఎముకలు కుళ్ళిన వాళ్ళు మాత్రం కారు!
నెత్తురుమండే వాళ్ళేమో కానీ,
కత్తులు విసిరే వాళ్ళు మాత్రం కారు!!
కళలతోనూ, కలలతోనూ,
కలాలతోనూ కాయితాలతోనూ కలిసి బతికే వాళ్ళు –
కానీ వాళ్ళ కళ్ళు ఎన్నడూ మూసుకుపోలేదు!
వాళ్ళ కాళ్ళు నేలను విడిచి సాము చెయ్యనూ లేదు!!
***
నా జాతి ఇంకా బతికే ఉందని రుజువు చెయ్యడానికే
వాళ్లలో కొందరు
ఆ మహాబధిరుడి ముందు శంఖారావం చేశారు!
నిద్ర నటిస్తున్నవాణ్ణి లేపేందుకు
కొందరు ఘంటారావం చేశారు –
కుండబద్దలు కొట్టి మరీ నిజం మాట్లాడారు!
అది కూడా
ఏ మసక చాటు నుంచో, మబ్బు మాటు నుంచో కాదు-
బహిరంగంగానే చేశారా పని!!
ఆరిన గుండెల్లో ఆరని ప్రమిదలు వెలిగించారు –
పడమటి పొద్దున ఉదయపు వెలుగులు వెదజల్లారు!!
అదే రాజద్రోహం అయితే జాతి మొత్తం ఆ పనే చేద్దాం పదండి!!
***
ఓజస్సూ, తేజస్సూ ఉడిగిపోయి,
చెట్టుకింద ప్రాక్టీసు చెట్టెక్కిపోయి,
పాపం, ఆ పెద్దమనిషికి పొద్దుపోవడం లేదట!
తేరగా తిన్న సొమ్ము అరిగి చావడం లేదట!!
వాడి జుట్టూ వీడి జుట్టూ ముడిపెట్టి,
దారేపోయే దానయ్యలపై తొడగొట్టి,
తల బొప్పికట్టించుకున్నా,
తలనొప్పి తెప్పించుకున్నా, బుద్ధి మాత్రం రాలేదట!
సామెత చెప్పినట్టు, కట్టె ఒంకర పొయ్యే తీర్చాలి!!
పనీ పాటూ లేని పెద్దమనిషి,
జాతికి మేల్కొలుపులు పాడుతున్న వైతాళికుల జోలికి పోయాడు-
భగ్గుమన్న జనాగ్రహంలో కాళ్ళూ చేతులూ కాల్చుకున్నాడు!
తోక ముడిచి, కేసు మడిచి, పరారైపోయాడు!
వినగలిగితే మహా బధిరుడికి ఇక్కడో పాఠం ఉంది!
నిద్ర నటించడం మానేస్తే నిజం కళ్లెదుటే కనిపిస్తుంది!!
కాదని మొండికెత్తితే కాలం మొండి కత్తి ఉండనే ఉంది!!
-మందలపర్తి కిషోర్
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ