ఎంత చెట్టుకు అంత గాలి!

దిబ్బ రాజ్యాధినేత పోతురాజు విచిత్రమైన మనిషి(!)
చాలామంది అతన్ని “మెత్తనిపులి” అనేవాళ్ళు.
వ్యవహారం విషయానికి వస్తే భార్యాబిడ్డలతో కూడా నిక్కచ్చిగా ఉండేవాడు.
ఇక బయటివాళ్ల విషయం చెప్పాలా?
పోతురాజు పెద్దగా చదువుకోలేదనే రహస్యం దిబ్బరాజ్యంలో అందరికీ తెలుసు.
అతనిలాగానే పొదుపుగా చదువుకున్నవాడే గుర్రాజు.
వాళ్లిద్దరూ పాక బళ్ళో మూడు క్లాసులు కలిసి చదువుకున్నారు.
గుర్రాజుకు చేతకాని పని లేదు- అలాగని ఫలానా పన్లో గుర్రాజు దిట్ట అనడానికి కూడా వీలులేదు!
అయితే మాట తీరు బావుండేది- దాన్ని అడ్డంపెట్టుకుని గుర్రాజు బతుకుబండి నడిపించేవాడు.
సదరు గుర్రాజుకు ఒక్కడే కొడుకు-వీర్రాజు.
వీర్రాజు చదువుకున్న వాడే కానీ, తలబిరుసు జాస్తి.
విరిగిన వేలిమీద ఉమ్ముకూడా వెయ్యని సత్పురుషుడు వీర్రాజు.
అంచేతనే ప్రభుత్వ ఉద్యోగంలో కూడా తెగ హైరానా పడిపోయేవాడు.
అటు పైవాళ్ళకీ, ఇటుకిందివాళ్ళకీ కూడా వీర్రాజు పేరెత్తితేనే మండిపోయేది.
దిబ్బరాజు పోతురాజు బాల్యమిత్రుడి కొడుకు కదా వీడితో పెట్టుకుంటే మనం ఏమైపోతామో అనే భయంతో అటు పై వాళ్ళూ , ఇటు కిందివాళ్లూ కూడా వీర్రాజు జోలికి వచ్చేవాళ్ళు కారు.
ఆ విధంగా వీర్రాజు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతూ వచ్చింది.
***
అంతలో వీర్రాజు ఆఫీసులో ఓ ఖాళీ ఏర్పడింది.
ఆ సీటులో కూర్చునేవాడికి ప్రతి రోజూ నెలజీతం వస్తుందని చెప్పుకునేవాళ్ళు.
సదరు సీటులో తనకు పోస్టింగ్ వేయించమని వీర్రాజు సహోద్యోగి ఒకతను అడిగాడు.
వీర్రాజు బుద్ధి మనకి తెలుసుగా!
అందుకే, “అర్రెర్రే! ఆ పోస్ట్ కి నేను నిన్ననే అప్లై చేసుకున్నా గురూ!” అని అబద్ధం ఆడేశాడు.
సహోద్యోగికి నిజం తెలిసినా నోరుమూసుకుని వెళ్ళిపోయాడు.
తర్వాత వీర్రాజు బుర్రలో ఓ ఆలోచన మెదిలింది.
ఇంటికెళ్లిందగ్గిర్నుంచీ తండ్రి గుర్రాజును కురుపు సలిపినట్లు సలపడం మొదలెట్టాడు.
“చూడు నాన్నా, పోతురాజు ఎలాంటి మనిషో నీకు తెలీదు- నాకు బాగా తెలుసు!
నువ్వడిగిన పోస్టింగ్ వేయించమని మనం అడిగితే, వాడు ఎంతడుగుతాడో తెలుసా?
మన ఇల్లు అమ్మినా అంత సొమ్ము రాదు.
అంచేత నోర్మూసుకుని వున్నా ఉద్యోగం చక్కగా చేసుకో!” అన్నాడు గుర్రాజు.
అయినా వీర్రాజు పట్టువదల్లేదు.
దాంతో నిజంగానే ఉన్న ఇల్లు అమ్ముకుని ఆ సొమ్ము జేబులో పెట్టుకుని పోతురాజును కలిశాడు గుర్రాజు.
దాంతో వీర్రాజు ముచ్చట తీరింది.
***
కొత్త సీట్లో కూర్చున్న ముచ్చటే తీరింది కానీ ప్రతిరోజూ నెల జీతం ఇంటికి పట్టుకెళ్ళాలనే ముచ్చట మాత్రం తీరలేదు వీర్రాజుకు.
ప్రతిరోజూ ఎవడో ఒకడు పోతురాజు సిఫారసు తీసుకుని రావడం –
వీర్రాజు చేత ఉచితంగా పనిచేయించుకు పోవడం జరుగుతూ వచ్చింది.
నెలాఖరు రోజున మాత్రమే వీర్రాజుకు నెలజీతం దక్కింది.
మర్నాడు తన సెక్షన్ ఆఫీసర్ దగ్గిర తన గోడు వెళ్లబోసుకున్నారు వీర్రాజు.
“చూడు వీర్రాజు ఇంత అమాయకత్వంతో ఆ సీట్లో ఎలా నెగ్గుకొస్తావయ్యా? రాజుగారి సిఫారసు అంటే వణికి ఛస్తే ఎలా? సిఫార్సు సిఫార్సే, మామూలు మామ్మూలే! అనేసెయ్. ఏమన్నా తేడా వస్తే నేను చూసుకుంటా!” అన్నాడు ఆఫీసరు.
అతగాడు ఓ పెద్ద కుట్రదారు- ఆ విషయం వీర్రాజుకి బాగా తెలుసు కూడా.
కానీ తన చెవులకు కమ్మగా అనిపించే విషయం చెప్పేసరికి బుట్టలో పడిపోయాడు.
వీర్రాజు ద్విగుణీకృత ఉత్సాహంతో పని మొదలెట్టాడు.
***
ఆ రోజు ఓ పెద్దమనిషి పొద్దున్నే వీర్రాజు సీటు దగ్గిరికి వచ్చాడు.
వంగివంగి నమస్కారం చేశాడు- దొంగ నవ్వు నవ్వాడు.
గజం బద్ద మింగేసినవాళ్ళా తలఊపి ఊరుకున్నాడు వీర్రాజు.
తర్వాత, ఆ పెద్దమనిషి విషయం బయటపెట్టాడు.
“కొత్వాలు కోటలో పెద్దాయన ఇల్లు కట్టిస్తున్నారు, తమకు తెలుసుగా? ఆ ఇంటికి మంచినీళ్ల కనెక్షనూ, కరెంటు కనెక్షనూ, బోరేసుకోడానికి పర్మిషనూ – అవన్నీ ఈ ఫైల్ లో ఉన్నాయి. కాస్త దస్కాటు గొలికేస్తే నేను సెలవు పుచ్చుకుంటా!” అన్నాడా పెద్దమనిషి.
“అలాగే చేద్దాం- అంతకన్నానా? అయితే మా ఆఫీసర్ దగ్గిరకెళ్ళి అడిగితే నా నెల జీతం ఎంతో చెప్తాడు.
అది ఇక్కడ పెట్టి, మీ ఫైల్ మీరు తీసుకెళ్లండి. అవతల బోల్డు పనులు చూసుకోవాలి కదా!”
అన్నాడు వీర్రాజు లౌక్యంగా మాట్లాడాననుకుని.
పెద్దమనిషి సదరు ఫైల్ “పెద్దాయన” తాలూకని మళ్ళీ చెప్పాడు.
ఎవరి తాలూకయినా, మరెవరి జిల్లా అయినా అదే మాటన్నాడు వీర్రాజు.
పెద్దమనిషి రుసరుసలాడుతూ అతనడిగిన సొమ్మిచ్చుకుని ఫైల్ తీసుకుని వెళ్ళిపోయాడు.
వీర్రాజు ఆ రోజు ఆఫీసులో అందరికీ పార్టీ ఇచ్చాడు.
***
మర్నాడు పొద్దున్నే వీర్రాజు ఆఫీసుకి వెళ్ళేటప్పటికి అతని సీట్లో మరెవరో కూర్చుని ఉన్నారు.
విషయం అర్థం కాక తిన్నగా ఆఫీసర్ దగ్గిరకెళ్ళాడు వీర్రాజు.
“పోతురాజు గారి ఇంటికి వాటర్ కనెక్షన్ కరెంటు కనెక్షన్ ఇవ్వడానికి నెలజీతం మామూలడిగావట కదా? దాని ఫలితం ఇది!” అన్నాడు ఆఫీసరు.
వీర్రాజుకు బుర్ర తిరిగింది- లీవ్ పెట్టి ఇంటికెళ్లి తండ్రి బుర్ర తినేశాడు.
అతని బాధ భరించలేక గుర్రాజు మళ్ళీ పోతురాజు గడప తొక్కాడు.
“కాలవ కింద ఉన్న నీ పొలం అమ్మి పట్టుకురా! మళ్ళీ మీవాడికి ఆ పోస్టింగ్ వేసేద్దాం!” అన్నాడు పోతురాజు.
ఎంత చెడ్డా వ్యవహర్త వ్యవహర్తె మరి!
కానీ గుర్రాజు పొలం అమ్మడానికి ఒప్పుకోకపోవడం తో వీర్రాజు టప్పాల్ క్లార్క్ పదవిలో రిటైర్ కావలసి వచ్చింది.

    – మందలపర్తి కిషోర్