సన్నాసి రాజ్యం చూడర బాబూ!

దిబ్బా దిరుగుండాలను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న పోతురాజు స్వగ్రామం కొత్వాలుకోట అని తమకు గతంలోనే మనవి చేసుకున్నా! పోతురాజు మహారాజు కాగానే ఆ వూళ్ళో  పిన్నాపెద్దా -ముఖ్యంగా ఆడవాళ్లు –  తెగబోలెడు ఆనందించారు. “హమ్మయ్యా! రేపణ్ణుంచి ఈ దయిద్రుడి మొగం చూడనక్కర్లేదు కదా!” అన్న ఆలోచన వాళ్ళ ఆనందానికి మూలం.
వాళ్లంతగా “ఆనందించడానికి” పెద్దకారణమే ఉంది మరి. అక్కడి మొగవాళ్ళు -మిగతా దిబ్బటూళ్ళ  మొగాళ్ళ మాదిరే- రోజుకి 23 గంటలు మందు మీదే ఉండే వాళ్ళు. మిగతా గంటలో కొందరు కోడిని కోయడం- ఈకలు పీకడం- కాల్చి , కూరకి సిద్ధం చెయ్యడం లాంటి నిర్మాణాత్మకమైన పనులు చేసేవారు. మరికొందరు,  గాలాలు-వలలు పట్టుకెళ్లి చేపలు పట్టడం, పొలుసులు ఊడేదాకా కడగడం, చక్కగా కోసి పులుసుకి సిద్ధం చెయ్యడం లాంటి (తమకు) పనికొచ్చే  పనులు చేసేవారు.
కొత్వాలుకోట మొగాళ్ళు అందరూ క్రమం తప్పకుండా చేసే పని ఒకటుంది- మందుకొట్టి ఇంటికి రాగానే, పెళ్ళాలకు రేవెట్టేయడమే ఆ “పని.” కొత్వాలుకోటలో అనూచానంగా(!) వస్తున్న ఆచారం అది!
అప్పట్లో పోతురాజు ఆ ఊళ్ళోనే పనీపంగూ లేకుండా రికామీగా తిరుగుతూ ఉండేవాడు. అదిచూసి, ఇతగాడేదో పెద్దమనిషనుకుని ఆ వూళ్ళో వుండే స్త్రీలందరూ పోతురాజును కలిసి తమ మొగాళ్ళ వ్యవహారం శ్రుతి మించి పోతోందని మొర పెట్టుకున్నారు.
అదే వాళ్ళు చేసిన నేరం- అలా మొగుళ్లమీద పితూరీ చెప్పిన ప్రతి పెళ్ళాన్నీపొలిమేరల దాకా తరిమితరిమి కొట్టేవాడు పోతురాజు. పుండు మీద కారం జల్లినట్లు, దెబ్బలు తిని మొత్తుకునే ఆడవాళ్లకి పతివ్రతా ధర్మాలు భోధించేవాడు కూడా! అలాంటివాడు ఏదో కారణంచేత కళ్ళముందునుంచి విరగడైపోతే సంతోషించని ఆడకూతురు ఉంటుందా?
అయితే- అంత తేలిగ్గా కొత్వాలు కోట ఆడకూతుళ్ళు సంతోషించడానికి అవకాశం ఇస్తాడా పోతురాజు? అందుకే, అక్కడ తన ఎడమచేతి చిటికెన  వేలు లాంటి సన్యాసి రాజును  “కటక పాలుడు”గా నియమించి మరీ కదిలాడు.
ఈ సన్నాసి ఆ పోతును మించిన పోటుగాడని కొత్వాలుకోట ప్రజలంతా ఒక్క వారంలోనే గ్రహించారు. ఎవరైనా స్త్రీ  రత్నం భర్తపై పితూరీ చెప్తే చాలు- కటక పాలకుడు సన్నాసి వాళ్ళిద్దరినీ రచ్చబండ దగ్గిరకి ఈడ్పించే వాడు. భార్యా రత్నం చేతికి చీపురుకట్ట ఇచ్చి భర్తారత్నాన్ని చావగొట్టించే వాడు. అక్కడితో కథ అయిపోలేదు! తదనంతరం ఒక్కసారి “శ్రీమద్రమారమణ గోవిందో హారి!” అని చుట్టూ ఉండే వాళ్ళచేత అరి(ని)పించి అప్పుడు భర్తారత్నం చేతికి దుడ్డుకర్ర ఇప్పించేవాడు. అసలే మందుమీద వున్న సదరు భర్త ఏంచేసి ఉంటాడో ఎవరైనా ఊహించుకోవచ్చు! ఆ విధంగా భార్యా భర్తల గొడవలు రచ్చ (బండ)కు ఎక్కకుండా అత్యంత సమర్థంగా నివారించాడు సన్నాసి!
ఈ వి(ష)జయం గురించి విన్న వెంటనే పోతురాజు తన అరిగిపోయిన చెప్పుల జతను సన్నాసికి ప్రేమగా బహూకరించాడు. (కన్నుమూసి తెరిచేలోగా ఖజానా ఖాళీ చేసిన పోతురాజు ఇచ్చే కానుకలు అలాగే ఉండేవి!) వాటిని పూజామందిరంలో పెట్టుకుని ఏటేటా  పాదుకా పట్టాభిషేక మహోత్సవం జరిపించేవాడు సన్నాసి.
అంతా బాగానే వుంది గానీ ఆ వూళ్ళో రెండు (ఆ)స్థానిక పత్రికలు ఉండేవి. ఒకదాని పేరు “పుకారు”, మరోదాన్ని పేరు “వదంతి”. సన్నాసి తమ్ముడు ఓ పత్రికను పెట్టించగా, సన్నాసి బామ్మర్ది మరోదాన్ని పెట్టించాడు. అంతే తేడా! ఈ రెండు పత్రికలూ నూటికి తొంభై వార్తలు అబద్ధాలే రాసినా ఒక్క పది ఐటమ్స్ మాత్రం నిఖార్సైన నిజాలే రాస్తూండేవి. లేపోతే మిగతా అబద్ధాలు నమ్మరేమో అన్నది ఆ పత్రికా సంపాదకుల అనుమానం. అయితే, కొత్వాలుకోట పాఠక మహాజనం ఏది నిజమో ఏది కాదో ఇట్టే పట్టేసేవారు! ఏదేమైనప్పటికీ, అలా పత్రికల్లో నిజాలు రాసే దురాచారం సన్నాసికి నచ్చలేదు. వాళ్ళిద్దరిమీదా పోటీకి “గుసగుసలు” అనే పత్రిక తానే పెట్టి కుడి చేతా ఎడం చేతా వార్తా కథనాలు రాస్తూండేవాడు. అవన్నీ పోతురాజు, సన్నాసి రాజుల అపార మేధా సంపన్నతకు “అద్దం” పట్టే విశేష కథనాలే కావడం కేవలం కాకతాళీయం!
కానీ కొత్వాలుకోట ప్రజలు మహాముదుర్లు! తొలిసంచిక చూస్తూనే దాని సంపాతకుడెవరో వాసన పట్టేశారు వాళ్ళు. ఆ తర్వాత అందులో వచ్చే విశేష కథనాలు చదువుకుని నవ్వుకోని పాఠకుడు లేడంటే ఒట్టు. ఆ దశలో తన ప్రత్యర్థి పత్రికల పీకలు పిసికేయాలని సన్నాసి రాజు తీర్మానించుకున్నాడు!
మరుసటి రోజే “పెంటపాడు పాక బడిలో అన్నంలో సున్నం నీళ్లు” అనే “ష్టోరీ” పుకారు పత్రికలో వచ్చింది. అంతే కాదు- సాక్షాత్తూ, సన్నాసి మేనల్లుడు, పెంటపాడు పాక బడి  కిచెన్లో అన్నం మీద సున్నపు నీళ్లు పోస్తున్న దృశ్యాన్ని తన దగ్గిరున్న చైనీస్ ఫోన్లో వీడియో తీసేసాడు “పుకారు” సంపాతకుడు. సున్నం నీళ్లు ఎలా తయారు చేసుకోవాలో, ఏ నిష్పత్తిలో ఆ సున్నపు తేటను అన్నపు రాశిపై చల్లాలో ఆ వివరాలన్నీ కూడా సదరు వీడియోలో “రికార్డ్” చేసాడు మన సంపాతకుడు. దాన్ని ఓ (ఆ)స్థానిక టీవీ ఛానెల్ రోజంతా ప్రసారం చేసింది కూడా. మర్నాటి నుంచీ, ఆ ఊళ్లోని కుర్రాళ్లంతా  పెంటపాడు పాకబడి గుమ్మం తొక్కడం మానేసి వీధుల్లో గూటీబిళ్ళ ఆడుకుంటూ హాయిగా కాలక్షేపం మొదలెట్టారు!
ఇది చూసి నిప్పుతొక్కిన కోతిలా ఇద్దరు గంతులేశారు. మొదటివాడు, సరే మన సన్నాసి రాజు. రెండో వాడు “వదంతి”సంపాతకుడు. ఒక ఎడిటర్ దేన్నైనా క్షమిస్తాడు కానీ పోటీ పత్రిక మన మీద “స్కోరు” చేయడాన్ని మాత్రం సహించడు, భరించడు! హుటాహుటిన “ఫీల్డ్”లోకి దిగి “వదంతి” సంపాదకుడు మరో “ఎక్స్ క్లూజివ్ ష్టోరీ” కొట్ బజాయించాడు!
పాచిపెంట గ్రామంలోని బాలికల పాఠశాలలో మరుగుదొడ్డి లేనందువల్ల ఎవరికైనా టాయిలెట్కి వెళ్ళవలసి వస్తే మిగతా విద్యార్థినులు అందరి కళ్ళకూ గంతలు కట్టే సంప్రదాయం అక్కడి ప్రిన్సిపాలిక ప్రవేశపెట్టింది. ఈ మరుగు మురుగు “ష్టోరీ”ని వదంతిలో అచ్చువేస్తూ సంపాతకుడు ప్రిన్సిపాలికతో ఇంటర్యూ కూడా ప్రచురించాడు. విద్యార్థినుల కళ్ళకు గంతలు కట్టే నిమిత్తం మరింత నాణ్యత కలిగిన బట్టను సరఫరా చెయ్యాలని ఆమె జిల్లా విద్యాధికారిని “డిమాండ్” చేశారు కూడా! పదేళ్లు నిరుద్యోగిగా ఉండి, ఈ మధ్యనే బట్టలకొట్టు పెట్టిన తన మరిదిగారి షాపులో నాణ్యమైన సదరు గుడ్డ దొరుకుతుందని కూడా ఆమె సూచించారు. ఆమె ఇంటర్యూ వరకూ తన జాపానీ ఫోనులో రికార్డు చేశాడు “వదంతి”  సంపాతకుడు. దాన్ని మరో (ఆ)స్థానిక టీవీ ఛానెల్ రోజంతా ప్రసారం చేసింది కూడా.
ఈ “ష్టోరీ”ని చూసి మళ్ళీ  ఇద్దరు కల్లు తాగి, నిప్పుతొక్కిన కోతుల్లా గంతులేశారు. ఒకడు సరే మన సన్నాసి కాగా మరొహడు దిబ్బరాజ్యాధినేత పోతురాజు! ఇద్దరూ కొత్వాలుకోట రచ్చబండ మీదకి “పుకారు” సంపాతకుణ్ణీ “వదంతి” ఎడిటర్నీ పిలిపించి వాళ్లపై రాజద్రోహం కేసు పెట్టారు ఇద్దరు రాజులు. చైనీస్, జాపనీస్ ఫోన్లలో సదర్ “ష్టోరీ”లను రికార్డ్ చెయ్యడం ద్వారా సంపాతకులు ఇద్దరూ రాజద్రోహానికి ఒడిగట్టారని పోతురాజు, సన్నాసిరాజూ ఏకగ్రీవంగా తీర్మానించారు.
“పోటీపడి కాటులాట”లో తలమునకలుగా ఉండే సదరు సంపాతకుల ఆచూకీ నాటికీ నేటికీ ఎవరికీ తెలియలేదు! సన్నాసి రాజ్యమా? మజాకా??
వాళ్ళిద్దరినీ ఎవరో ఈమధ్యనే ఉత్తర ప్రదేశ్ లో చూశారని  వదంతులూ పుకార్లూ కొత్వాలుకోటలో షికార్లు చేస్తున్నాయి.

-మందలపర్తి కిషోర్