రండి బాబూ రండి ఇది వింత బజారు..అలసిస్తే చేజారు..ఆలోచిస్తే గుండె బేజారు
ఇక్కడ అన్నీ రెడీమేడ్ గా లభ్యమగును. సకలం సమస్తం తయారు చేయబడును-
ఊతప్పం కంటె ఊహల తయారు ఈజీ
కుర్చీలు..బెంచీలు..చెంచాలూ ప్లేట్లూ చేయడం సులువు
అభిప్రాయాలు మలచడం మరింత సులువు-
ఆవకాయ పట్టినంత కళాత్మకంగా ఆలోచనలు చెక్కబడతాయి
సినిమాలు తీసినంత సులభంగా..చిత్రాలు గీసినంత అచిత్రంగా నవ్వులు చిత్రించబడతాయి
పాటలు కట్టినంత చాకచక్యంగా కన్నీళ్ళు సృజించబడతాయి
బిల్డింగులు లేపినట్టు రోడ్లు వేసినట్టు కలలు కూడా నిర్మింపబడతాయి
ఏం బజారు..ఇది ఏం బజారు..మాయా బజారు కాదు, నిజం బజారు-
కూరగాయలు గంపలకెత్తడం కంటే సునాయాసం ఇక్కడ జనం గుంపులుగా నిలబెట్టబడటం-
కీ ఇస్తే జైకొట్టి..కీ ఇస్తే ఛీకొట్టే జనం
ఇక్కడ ఎక్కడబడితే అక్కడ కారు చవక-
ఇక్కడ ఉద్రేకాలు తయార్..ఉద్వేగాలూ తయార్
మనోభావాలు..మనోల్లాసాలు
ఎవ్విరిథింగ్.. ఎనీథింగ్.. ఎవర్రెడీ
దొరకంది లేదు..కావాల్సిన వారికి కావాల్సినంత అందుబాటులో
గుడికట్టడం కష్టమేమో .. మనుషులతో మడికట్టడం ఇక్కడి స్పెషాలిటీ
ఉత్సాహాలూ జనోత్సవాలూ అన్నీ అరక్షణంలో అందంగా తయారుచేయబడతాయి
తుపాకులూ తూటాలూ చేయడానిదేముంది?
నేరాలూ ఘోరాలూ తయారు చేయడం ఇక్కడి మహా మహిమాన్విత తమాషా-
నేరమూ తయార్..శిక్షా తయార్..బేడీలు తయార్..స్వేచ్ఛా తయార్
కోర్టుల సాక్షిగా..చట్టాల సాక్షిగా మీడియా విదూషకుడి కుప్పిగంతుల సాక్షిగా
అంతా తయార్..అన్నీ తయార్..
తయారుచేయు వాడెవడు? తయారు చేయించువాడెవడు? ఎవడు వాడు ఎచటి వాడు?
ప్రశ్నలడక్కు..బుర్ర గోక్కోకు..కళ్ళూ నోరూ మూయకుండా అలా అవాక్కయిపోకు
నాది నాది అనుకున్నది నీది కాదురా..నీ లోలోపలి చలనాలూ నీవి కావురా
అరే భాయ్ జర దేఖ్ఖే చలో
ఇదొక మార్మిక ధార్మిక కర్మాగారం..
అత్యున్నత ప్రజాస్వామ్య సూపర్ మార్కెట్
డా.ప్రసాదమూర్తి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ