NewsOrbit
వ్యాఖ్య

హైటెక్ “మోత” – రోబో వాత!

ఈ వారమంతా బడ్జెట్ “మోత”తో మార్మోగిపోయింది! ముఖ్యంగా బడ్జెట్ దెబ్బకు మీడియా దద్దరిల్లిపోయింది. తెలుగింటి ఆడపడుచయిన మన ఆర్ధిక మంత్రి మహోదయ –  జె.యెన్.యూ ప్రోడక్ట్ – నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన బడ్జెట్లో లేని అందాలు చూసి, మనకు చూపించేందుకు కొందరు మేధావులు పడ్డ పాట్లు కడుపుబ్బ నవ్వించిన మాట నిజమే కానీ – ఎంత చెడ్డా బడ్జెట్ అంత నవ్వులాట వ్యవహారం కాదు కదా! అందులోనూ, దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి వేగం కుంటుపడిందని సాక్షాత్తూ ఆర్ధిక మంత్రి మహోదయ అంగీకరించిన నేపథ్యంలో, ఆర్ధిక వ్యవస్థ  అభివృద్ధి వేగం పెంచేందుకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతాయేమో అని ఆశించిన దురాశాజీవులకు ఎదురుదెబ్బ తగిలింది.
పులిమీద పుట్రలా ఇప్పుడు, పాశ్చాత్య  ఆర్థికవేత్తలు సరికొత్త ప్రశ్నల్ని మనమీదికి ఉసిగొల్పుతున్నారు. బడ్జెట్లూ- లాభనష్టాల ఖాతాలూ గణించుకుని, గుణించుకునే రోజులు కావివి అంటున్నారు ఈ పడమటి మేధావులు. అసలు పెట్టుబడిదారీ వ్యవస్థ ఎన్నాళ్ళు  మనుగడ సాగిస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది చూసుకోండమ్మా, అయ్యా అంటూ ఈ పడమటి మేధావులు ఆక్రందనలు చేస్తున్నారు. ఈ మాట వినీ వినడంతోనే ముందూ వెనకా ఆలోచించుకోకుండా వీధికెక్కి చంకలు గుద్దుకోవడంలో అంత ఔచిత్యం లేదనిపిస్తుంది- ఎందుకంటే, పెట్టుబడిదారీ విధానానికి విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం ఏదీ రూపొందని ప్రస్తుత దశలో, ఉన్నది కాస్తా పోతే, వచ్చేది-రాబోయేది ఎలావుంటుందో విచారించుకోవాలి ముందు. ఏడెనిమిది దశాబ్దాలు ఎదురులేని వ్యవస్థగా మనగలిగిన సోవియట్ సోషలిజం, సామాన్య  వినియోగదారుల అసంతృప్తి తుపానులో పూచికపుల్లలా కొట్టుకుపోయి పాతిక సంవత్సరాలు మాత్రమే అయింది. ఇక చైనా సోషలిజం అదే సామాన్య  వినియోగదారుల అసంతృప్తి తుపానును నివారించే నిమిత్తం, ఊసరవెల్లి పెద్దత్త గారిలా రంగుమార్చి నాలుగు దశాబ్దాలు కావస్తోంది. మన ఆర్ధిక వ్యవస్థ మిశ్రమ ఆర్ధిక విధానం వేషం విప్పేసి యాభై ఏళ్ళు అవుతోంది. ఈ నేపథ్యంలో, “అసలు పెట్టుబడికి ఇప్పుడంతగా ములిగిపోయిన పుట్టి ఏమి”టా అనే ప్రశ్న మనలో తలెత్తడం ఎక్కువ అర్థవంతమనిపించుకుంటుంది!
వినడానికి వింతగా ఉండొచ్చు గానీ నిజంగానే పెట్టుబడిదారీ విధానానికి  వచ్చిపడిందంటున్న ఈ తాజా ప్రమాదం బయటినుంచి సంక్రమించిన వైరస్ కాదంటున్నారు  నిపుణులు. పెట్టుబడిదారీ విధానం అనే చట్రం లోపల సామర్థ్యం పెంచుకునే ప్రయత్నం నిరంతరాయంగా సాగుతుంది. “విజ్ఞాన శాస్త్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంగా అభివృద్ధిచేసే నిరంతర క్రమం” గురించి స్వయంగా మార్క్స్  “పెట్టుబడి-మొదటి సంపుటం”లో వ్యాఖ్యానించారు. అయితే, అది ఆ చట్రం పరిధికి మించకుండా ఉన్నంతకాలం పెట్టుబడి దాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఆ పరిధికి మించే ప్రమాదం ఏర్పడితే పెట్టుబడి దేన్నీ సహించదు- సాంకేతిక పరిజ్ఞానమైనా సరే, విజ్ఞాన శాస్త్రమైనా సరే…. ప్రస్తుత అభివృద్ధి క్రమంలో పెట్టుబడికీ,  సాంకేతిక పరిజ్ఞానానికీ మధ్య తలెత్తిన అంతర్గత వైరుధ్యం గురించి నిపుణులు చాలాకాలంగానే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోబోటిక్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కేంద్రకంగా సదరు అంతర్గత వైరుధ్యం రూపురేఖలు ఎలా వుండబోతున్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం. ఉదాహరణకి ఒక్క విషయం చూద్దాం- ప్రస్తుతం కార్మిక శక్తిగా ఉన్న వాళ్లలో 90 శాతం మందిని తొలగించి వాళ్ళ స్థానంలో మరమనుషుల్ని నియమించుకోవడం ఇప్పుడు -తార్కికంగా- సాధ్యమేనని ఈ నిపుణులు అంటున్నారు. ఒకప్పుడిది కేవలం సైద్ధాంతికంగానే సాధ్యమని అనుకునేవారు. కానీ రోబోటిక్స్ సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత దశలో ఇది కేవలం సిద్ధాంత ప్రతిపాదన మాత్రమే కాదు. కచ్చితంగా అంతకన్నా ఎక్కువే! ఇంతకీ మనుషుల స్థానంలో మరమనుషుల చేత పని చేయించుకోవడం పెట్టుబడిదారీ విధానం భవిష్యత్తుకు ఎలా హానికరం కాగలదన్నది అసలు ప్రశ్న! అదేమిటో వివరంగా చూద్దాం పదండి!!
ఉదాహరణకి ఇప్పుడు అనేక దేశాలు కార్ డ్రైవర్లుగా మనుషుల్ని తొలగించి మరమనుషుల్ని నియమించుకోవాలని ఆలోచనలో ఉన్నాయి. “మానవ పరిమితుల” కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, ట్రాఫిక్ రంగంలో సామర్థ్యం పెంచుకోవడానికి ఇది ఉత్తమ ప్రత్యామ్నాయమని అనేక పాశ్చాత్య దేశాల నిపుణులు అంటున్నారు. మనదేశం లాంటి దేశంలో స్త్రీలపై అత్యాచారాలు పెరుగుతున్న దశలో, డ్రైవింగ్ వృత్తిలో మగమనుషుల కన్నా మరమనుషులు ఉండడమే క్షేమమని సామాజిక శాస్త్రవేత్తలు గట్టిగా  సూచిస్తున్నారు. కిందటి సంవత్సరం అక్టోబర్లో ఎకనామిక్ టైమ్స్ పత్రిక ప్రకటించిన ఒకానొక సర్వే మేరకు భారత దేశంలో మొత్తం మీద 15 కోట్లమంది కారు డ్రైవర్లు ఉన్నారు. వాళ్లలో నూటికి 99 మంది మగపురుషులే. సామాజిక శాస్త్రవేత్తల సలహా విని దేశంలోని మగడ్రైవర్లు అందర్నీ ఉద్యోగాల్లోంచి తీసిపారేస్తే ఒక్కదెబ్బకి 15 కోట్లమంది కారుడ్రైవర్లు రోడ్డున పడతారు! అసలే అభివృద్ధి వేగం కుంటుపడివున్న భారత దేశంలాంటి దేశంలో ఒకేసారి 15 కోట్లమంది కారుడ్రైవర్లు నిరుద్యోగులుగా మారడమే జరిగితే అది ఎటువంటి సామాజిక-ఆర్ధిక పర్యవసానాలకు దారితీస్తుందో ఊహించుకోండి!
ఇది మన దేశానికే పరిమితమై ఉండిపోయే సమస్య కూడా కాదు. పైపెచ్చు కేవలం ఆర్ధిక సమస్య మాత్రమే కాదు కూడా! ఉదాహరణకి అమెరికాలో ట్రక్ రవాణా వ్యవస్థను తీసుకోండి. ఆ దేశంలో 35 లక్షల మంది ట్రక్ డ్రైవర్లు ఉన్నారన్నది మూడేళ్ళ కిందట సేకరించిన సమాచారం. వాళ్ళ సంఖ్య మరో లక్ష పెరిగివుండొచ్చు ఈ మూడేళ్ళలో మరమనుషులు నడిపే ట్రక్కులు రోడ్డుమీదికి వచ్చిన పక్షంలో ఒక్క దెబ్బకి 36 లక్షల ఉద్యోగాలు ఊడిపోతాయి. వినడానికి విడ్డూరంగా వుండొచ్చునేమో గానీ, మన 15 కోట్ల మంది కారుడ్రైవర్లు విసిరే సవాలు కన్నా, 36 లక్షల మంది అమెరికన్ ట్రక్ డ్రైవర్లు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు విసిరే సవాలు చాలా పెద్దది. వాళ్ళు అక్కడి ట్రక్ రవాణా వ్యవస్థను కొన్నిగంటలు స్తంభింప చేయగలిగితే అది ఎన్నో దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోవడానికి దారితీసినా ఆశ్చర్యపోనవసరం  లేదు! రాజకీయ అర్థశాస్త్రంలో ఓనమాలు తెలిసిన వాళ్లకి ఇది వివరించి చెప్పవలసిన పనిలేదు.
అంతే కాదు, అమెరికాలోనూ, మనదేశంలోనూ కలిపి దాదాపు రెండుకోట్ల మంది డ్రైవర్లు రాత్రికి రాత్రి నిరుద్యోగులుగా మారిపోవడమంటే మార్కెట్ల ఆరోగ్యం ఒకేసారి ఎంతగా క్షీణించి పోతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. కొనుగోలుదారుల ఆర్ధిక సామర్థ్యం క్రమంగా క్షీణించడమే ఆర్ధిక మాంద్యానికి దారితీస్తుంది. అదే అకస్మాత్తుగా జరిగితే ఆ పరిణామం మరెంత భయానకంగా ఉంటుందో? అన్నిటికీ మించి ఈ పరిణామం ప్రత్యక్ష ఆర్ధిక పరిణామాల పర్యవసానంగా జరగబోయే చర్య కాదు- సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చే “విప్లవాత్మక”  పరిణామాల కారణంగానే ఈ పర్యవసానం సంభవించే ప్రమాదం ఉందని ఆర్ధిక వేత్తల హెచ్చరిక.
అయ్యా, ఇదీ మరమనుషుల నుంచి పెట్టుబడిదారీ విధానం భవిష్యత్తుకు ఎదురవుతున్న సవాలు. పెట్టుబడి దారీ విధానం తన సమాధిని తవ్వేవాళ్లను తానే సృష్టించుకుంటుందని మార్క్స్-ఎంగెల్స్ అన్నమాట చివరికి ఇలా నిజమవుతోందేమో!

మందలపర్తి కిషోర్

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment