అమ్మ…డబ్బు..ఏది ఎక్కువ!

బీనానాదం

అప్పుడప్పుడు మనం టివి లోనో రేడియోలోనో వింటూవుంటాం ఇప్పుడే అందిన వార్త అని.

అలాగ ఇవాళ నేను ఓ వార్త చదివేను.

ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగింది.

నిజానికి నేనెప్పుడు పేపర్ చదవను.

కేవలం తిరగేస్తాను అంతే. అయితే హత్యలు, ఆత్మహతలు అప్పుడప్పుడు
చదువుతాను.

దానికి కారణం వెతుకుతాను. అన్నిటికి మూడు కారణాలు. వైన్, వెల్త్, వుమన్.

తల్లికి జబ్బు చేసింది. హాస్పిటల్కి డబ్బు కట్టాలి.

ఖర్మకాలి ఆవిడకి ఇద్దరు సుపుత్రులు.

నువ్వు కట్టు అంటే నువ్వు కట్టు అని తన్నుకున్నారు.

చెరో సగం కట్టవచ్చు. అది ఎప్పటికి తేలలేదు.

ఇంట్లో రోజు గోలే. వాళ్ళు పెళ్ళాం పిల్లల గురించి ఆలోచించలేదు.

ఒకడి పెళ్ళాం మనశ్సాంతి లేక ఆత్మహత్య చేసుకుంది.

పిచ్చిది. కొన్నాళ్ళు పుట్టింటికి పోవచ్చు. లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరకి పోవచ్చు.
కానీ ఆవేశానికి ఆలోచన ఉండదు.

ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళగురించి ఆలోచించలేదు.

ఇప్పుడు వాళ్ళ గతి ఏవిటి. తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు.

వాడికేం మొగాడు. మళ్లీ పెళ్లి చేసుకుంటాడు.
ఆ వచ్చేది  ఈ పిల్లల్ని ఎందుకు చూస్తుంది.

వాళ్ళు అనాధలుగానే పెరుగుతారు.

హాస్పిటల్లో ఉన్న ఆ తల్లికి ఇవన్నీ తెలిస్తే ఏవనిపిస్తుంది.

ఇలాంటి పిల్లల్ని నేను కన్నాను అని ఏడుస్తుంది.

తల్లి కంటతడి పెడితే పిల్లలకి శుభం కాదు.

అసలు మీరు పుట్టగానే ఇంతవాళ్ళు  అయ్యారా.

ఆవిడ ఎన్ని బాధలు పడితే మీరు ఇంతవాళ్ళు అయ్యేరు.

తల్లి ఋణం తీర్చలేనిది.

ఆవిడ నీ పునాది.

పునాది గట్టిగా లేకపోతే నువ్వు ఎంత పెద్ద బంగాళా కట్టినా కూలిపోతూంది.

నేను మళ్ళీ మొదటికే వస్తున్నాను. అన్నిటికీ మూల కారణం డబ్బు.

డబ్బు మనిషిలొని మానవత్వాన్ని చంపేస్తుంది.

డబ్బులేని రోజుల్లో అందరు సుఖంగా బతికేరు.

డబ్బు కోసం అభిమానాల్ని అనుబంధాల్ని వదులుకోకండి.

ఈవిడకి పని పాటు లేదా, ఎందుకిలా తింటోంది అంటే నా జవాబు ఒకటే.

రచయతలకి సమాజంమీద బాధ్యత ఉంది.

ఫ్రెంచ్ విప్లవానికి రచయితల పాత్ర ఉంది.

ఇంగ్లాడులో సంస్కరణలకు డికెన్స్ రచనలే కారణం.

చెప్పగా చెప్పగా చెవిటివాడికి కూడా వినిపిస్తుంది.

అందుకే ఈ బాధ

బీనాదేవి