అమ్మా గావుకేక పెట్టేడు మా మనవడు
ఏవిటా కేకలు కొంపలు ములిగిపోయినట్టు
ములగడానికి నీకు నాకు కొంపలేవి లేవుకాని కూర్చో
నువ్వు అందరినీ దులిపేస్తావుకదా అందుకని
నీకు మంచి టాపిక్ చెప్తాను
ఒరే అబ్బీ ఇల్లు బూజు పడితే దులుపుతాము కానీ బుర్ర బూజు దులపలేవు
కంప్యూటర్కి వైరస్ పడుతుంది
మన బుర్రలకు పట్టిన వైరస్ డబ్బు ఇది దులప లేవు ఇంతకీ చెప్పు
మాఫ్రెండ్ రాజు లేడూ వాడికి ఓ నాలుగేళ్ళ కూతురు ఉంది
ఇన్నాళ్లు వాళ్ళ కాలనిలో ఉన్న ప్లే స్కూల్లో వేసేరు
అక్కడే నర్సరీ ఎల్కేజీ చదివింది ఇప్పుడు యూకేజీలో వెయ్యాలి
ఏవుందీ అన్ని పబ్లిక్ స్కూళ్ళు తిరిగేరు
ఓ స్కూల్లో అడ్మిషన్ ఫీజు యెంత అనుకున్నావు వింటే గుండె ఆగి చస్తావు
ఐదు లక్షలు
మరో స్కూల్లో మూడు
తిరగ్గా తిరగ్గా ఓస్కూల్లో లక్ష ఉంది అది మినిమం
ఆ స్కూళ్లలో ఫీజు ఏడాదికి ఓసారి తీసుకుంటారు
యూనిఫారంలు పుస్తకాలూ బ్యాగులు అన్ని వాళ్ళదగ్గరే కొనాలి
బస్సు ఛార్జ్ వెరసి రెండున్నర లక్షలు
అమ్మ నాన్నకి ఇంటర్వ్యూలు ఇద్దరు జాబ్ చేస్తున్నారా జీతం యెంత పే స్లిప్ చూపించండి
బుద్ధి ఉందాలేదా నాలుగేళ్ళ పిల్లకి అంత ఖర్చు అవసరవా యీ ఆడిట్ యేవిఁటి
అయినా వాళ్ళని అనడం ఎందుకు మనకి బుద్ధి లేకపోయేక
వాళ్ళది పక్కా వ్యాపారం ఇప్పుడు విద్య వైద్యం వ్యాపారం ఐపోయేయి కదా
మనకేమో గొప్పలు కావాలి యెంత ఎక్కువ ఖర్చు పెడితే అంత గొప్ప
మాపాపని ఇన్నిలక్షలు పెట్టి యూకేజీ లో చేర్చేమ్ అని గొప్పగా చెప్పుకునే తల్లులని ఏంచేస్తే పాపం ఉంది
ఇలాటి వాళ్ళకోసమే ఫైవ్ స్టార్ స్కూళ్ళు వెలిసేయి
అంత చిన్నపిల్లలు ఏవిటి చదువుతారు
ఏ స్కూల్లో చెప్పినా అవే జానీ జానీ అవే పుస్సికేట్లు
బంగారం బోర్డు మీద వెండి సుద్దముక్కతో రాస్తారా
అక్కడ టీచర్లు ఆక్సఫర్డ్లో చదివేరా
ఆమధ్య ఓ రష్యన్ ఆవిడ నన్ను ఏవడిగిందో తెలుసా
పిల్లల చదువు విషయంలో మీకు బుద్ది ఉందా అని అడిగింది
లేదని ఒప్పేసుకున్నాను
వాళ్ళ దేశంలో ఆరేళ్ల వరకు స్కూల్లో చేర్చుకోరుట తరవాత కూడా పుస్తకాలు ఉండవుట
నోటితోనే చెప్తారట బావుందికాదు మనం సిగ్గు పడాలి
వింటున్నారా తల్లులూ
మీ ఆర్థిక స్వాతంత్య్రం కోసం పసిగుడ్డుని కేర్ సెంటర్లో పడేస్తున్నారు
వాళ్ళు పాలు పడతారు కానీ తల్లి ప్రేమ ఇవ్వలేరు
మంచి చెడు చెప్పరు
మనకి మొదటి గురువు తల్లి ఆవిడ దగ్గరే మనం ఎన్నో నేర్చుకుంటాం
ఇప్పుడు తల్లి పిల్ల అనుబంధం పోతోంది
అయ్యా విద్యాశాఖవారూ ఒక చిన్న చట్టం చెయ్యండి
ఐదేళ్లు నిండేవరకు పిల్లల్ని స్కూల్లో చేర్చుకోవద్దని
మనం పిల్లలకి మంచి గుణాలు నేర్పడం లేదు
మంచి అలవాట్లు నేర్పడం లేదు
కనీసం మంచి బాల్యం ఐనా ఇవ్వండి
నాకున్నదంతా ఇచ్చేస్తాను నాబాల్యం నాకు ఇవ్వండి అన్నాడు ఒకాయన
బాల్యం శాపం కాకూడదు
అది మన చేతిలోనే ఉంది
ఆలోచించండి
బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ