NewsOrbit
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ఏ విలువలకు వీరు ప్రతినిధులు!?

గత శతాబ్దంలో పెద్ద చర్చనీయాంశమైన ఆయారాం గయారాం వ్యవహారం దగ్గరనుంచీ చూస్తే ఇండియాలో ఫిరాయింపుల ప్రహసనం చాలా దూరం ప్రయాణించింది. మధ్యలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది. అయితే ఆ చట్టం ఫిరాయింపులను నిరోధించడానికి కాకుండా వాటికి దారి సుగమం చేసేదిగా మారిపోయింది. ఒక పార్టీనుంచి ఇంకో పార్టీలోకి గంపగుత్తగా ఫిరాయింపులూ, లెజిస్లేచర్ పార్టీల విలీనాలూ మామూలయిపోయాయి. 1985లో చట్టం వచ్చిననాటి నుంచీ గత 34 ఏళ్లలో దేశం సాధించిన పురోగతి ఇది.

తాజాగా 2019 ఎన్నికల తర్వాత దేశంలో ఫిరాయిపుల పర్వం సరికొత్త పుంతలు తొక్కుతోంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల విలువలకు ఏకైక ప్రతినిధులమని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం దశలోనే ఫిరాయింపుల శంఖం పూరించారు.ఎన్నికల ద్వారా సాధించలేని చోట ఫిరాయింపుల ద్వారా సాధిస్తామని చెప్పకనే చెప్పారు. ఆయన అన్నట్లుగానే పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులు మొదలయ్యాయి. రాజ్యసభలో బలం పెరగాలి, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని నైతికంగా దెబ్బతియ్యాలి అన్న రెండు పిట్టలను ఒక్క దెబ్బతో కొట్టడం కోసం నలుగురు టిడిపి రాజ్యసభ ఎంపిలను బిజెపిలో చేర్చుకున్నారు. ఏకంగా రాజ్యసభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ బిజెపిలో విలీనం అయినట్లు ప్రకటించారు. ముందు పార్టీ విలీనం అయితే తప్ప పార్లమెంటరీ విభాగం విలీనం చెల్లదని చెబుతున్న ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను విలీనం అవుతున్న వారూ పట్టించుకోవడం లేదు, వీలీనం చేసుకుంటున్న వారూ ఖాతరు చేయడం లేదు.

ఈ పరిణామాల నేపధ్యంలో రెండుమూడు అంశాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఒకటేమిటంటే మిగతా పార్టీలకు పూర్తి భిన్నం అని జనాన్ని నమ్మించేందుకు ఇన్నాళ్లూ ప్రయత్నించిన బిజెపి ఆ కాసిని వలువలు కూడా విప్పి అవతల పారేసింది. ఇంకొకటేమిటంటే రకరకాల కారణాలతో ఇన్నాళ్లూ బిజెపిలోకి ఫిరాయించేందుకు సిద్ధంగా లేని ఇతర పార్టీల నాయకులు సంకోచాన్ని పక్కనబెట్టి గీత దాటుతున్నారు.

ఆవుని పూజించే సంస్కృతి వేళ్లూనుకున్న హిందీ రాష్ట్రాలకు బిజెపి విస్తరణ ఇంతకాలం పరిమితమయింది. ఇటీవలి కాలంలో ఆ పార్టీ ఈశాన్య రాష్ట్రాలలో పాగా వేయగలిగింది. తాజా ఎన్నికలలో పశ్చిమ బెంగాల్‌లో 18 సీట్లు సాధించగలిగింది. దక్షిణాదిన బిజెపి విస్తరణ ఇంతకాలం సాధ్యం కాలేదన్న దానికి కర్నాటక ఒక్కటే మినహాయింపు. మొన్నటి ఎన్నికలలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రజలు బిజెపిని పూర్తిగా తిరస్కరించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అధికారానికి పోటీ పడవచ్చన్న ఆశతో ముందున్న వైఖరి మార్చుకుని ఆంధ్రప్రదేశ్ విభజనలో పాలు పంచుకున్న బిజెపికి తెలంగాణలో రెండవసారి ఎన్నికలలో కూడా నిరాశ తప్పలేదు. నాలుగు సీట్లకు పరిమితం కావాల్సివచ్చింది. ఇక ఆంధ్రలో సొంతంగా పోటీ చేసేసరికి డిపాజిట్లు కూడా దక్కలేదు.

కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉనికి అవసరమన్న తొందర బిజెపిలో హెచ్చింది. తమ లక్ష్యసాధనకు 2024లోనూ ఆపైనా కూడా అధికారపీఠంపై కొనసాగాలంటే దక్షిణాదిన కూడా ఒక శక్తిగా ఎదిగితే తప్ప కుదరదని వారు భావిస్తున్నారు. పైగా దేశాన్ని అప్రతిహతంగా పాలించే పార్టీకి దక్షిణాదిన చిరునామా లేదంటే ఎంత చిన్నతనం!

ఫిరాయింపులకు తలుపులు బార్లా తెరిచి దక్షిణాదిన విస్తరణకు దారులు వేసుకోవాలన్న బిజెపి వ్యూహాన్ని ఈ కోణం నుంచి చూడాలి. చేర్చుకునే  వారు ఆ విధంగా ఆలోచిస్తున్నారు సరే, మరి చేరేవారో? వారికి ఇంతకాలం తామున్న పార్టీలు – కాంగ్రెస్, టిడిపి వగైరా – బిజెపి ఒకటేనా? మధ్యేవాద పార్టీలనూ, మితవాద పార్టీనీ ఒకే గాటన కట్టడం సాధ్యమేనా? సాధ్యమేనని చెబుతున్న ప్రస్తుత ఫిరాయింపుల పరిణామాలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. ప్రాధమికంగా ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు చేస్తాయి. బిజెపిలోకి ఫిరాయింపులు మరింత చేటు చేస్తాయి.

భారతీయ జనతా పార్టీ మితవాద రాజకీయపక్షం. మెజారిటీ మతం తరపున రాజకీయాలు నడుపుతుంది. అఖండ హిందూరాష్ట్రం ఏర్పాటు తమ లక్ష్యం అని అధికారికంగా, బహిరంగంగా చెప్పుకునే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ పార్లమెంటరీ విభాగమే బిజెపి. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలోనూ, బిజెపి ఏలుబడి కింద ఉన్న రాష్ట్రాలలోనూ ప్రధానమంత్రి మొదలుకొని మంత్రులు, ముఖ్యమంత్రుల వరకూ దాదాపుగా అందరూ ఆరెస్సెస్ నేపధ్యం నుంచి వచ్చినవారే. ఆ మాటకొస్తే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా ఆరెస్సెస్ నేపధ్యం ఉన్నవారే.

అలాంటి పార్టీలోకి మధ్యేవాద పార్టీల నుంచి ఫిరాయింపులు ఎలా సాధ్యం? అభివృద్ధి కోసం అన్న సుజనా చౌదరి ప్రభృతుల సమర్ధింపు (ఆ వాదనలో ఉన్న డొల్లతనాన్ని కాస్సేపు పక్కన పెడదాం) చెల్లుబాటవుతుందా? చెల్లుబాటు చేసిన వారు ఇంతకుముందు లేకపోలేదు. అలాంటి వారిని ఒకసారి పరామర్శించదలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో ఈ ధోరణికి దారి చూపింది దగ్గుబాటి పురందేశ్వరి అని చెప్పవచ్చు. విద్యాధికురాలైన ఈ ఎన్‌టి రామారావు కుమార్తె 2004లో అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరి బాపట్ల నుంచి ఎంపీగా గెలిచారు. 2009లో విశాఖ నుంచి విజయం సాధించిన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈమెకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కాంగ్రెస్ పార్టీలో పురందేశ్వరికి దక్కిన గౌరవం, మర్యాద చాలా కొద్దిమందికి దక్కిందని చెప్పవచ్చు. రాష్ట్ర విభజన పరిణామాల నేపధ్యంలో 2014 ఎన్నికల ముందు ఆమె బిజెపిలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కట్టుబడిన విలువలకూ – కనీసం కట్టుబడినట్లు చెప్పుకునే విలువలు – బిజెపి కట్టుబడిన విలువలకూ – బయటకు చెప్పుకోకపోయినా కట్టుబడే విలువలు – మధ్య పురందేశ్వరికి ఎలాంటి వ్యత్యాసం కనబడలేదా?

తెలంగాణలో మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి నేడోరేపో కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరనున్నారు. ఆయన కూడా విద్యాధికుడే. ఇంజినీరింగ్ చదివారు. కాంట్రాక్టుల వ్యాపారంలో కాలుపెట్టారు. బాగా సంపాదించారు. 2009లో కాంగ్రెస్‌లో చేరి భువనగిరి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో ఓడిపోయి, అనంతరం ఎమ్మెల్సీగా గెలిచి మొన్నటి ఎన్నికలలో మునుగోడు నుంచి శాసనసభకు వెళ్లారు. వందల వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేసేవారికి చేతిలో ఎప్పుడూ పనులు ఉండాలి. బిజెపి రెండవసారి కేంద్రంలో అధికారం చేపట్టింది. మెజారిటీ రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీనే అధికారంలో ఉంది. మరి రాజగోపాల రెడ్డి ఆ పార్టీ పంచన చేరాలనుకోవడంలో ఆశ్చర్యం ఏముంది!

పురందేశ్వరి, రాజగోపాల రెడ్డి ప్రజాక్షేత్రం నుంచో, సామాజిక సేవారంగం నుంచో రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు. వారు రాజకీయాల్లోకి రావాలని గానీ, ఫలానా పని చేసి ఫలానా వారిని ఉద్ధరించాలని కానీ ఎవరూ ప్రాధేయపడలేదు. తమకు ఉన్న నేపధ్యం ప్రాతిపదికగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ సంపాదించి, ఆపై గెలిచి రాజకీయాల్లో కొనసాగుతున్నవారు. పరాజయం పాలయిన కాంగ్రెస్‌లో కొనసాగితే అధికారానికీ, ఆర్జనకూ దూరంగా ఉండాలన్న భావనతో బట్టలు మార్చినంత సులువుగా పార్టీ మార్చగలిగిన వారు.

ఈ ఇద్దరూ మొదట ఏ విలువలు చూసి కాంగ్రెస్‌లో చేరారు? ఏ విలువలు చూసి బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు, పుచ్చుకోబోతున్నారు? మతం ప్రాతిపదికన సమాజాన్ని నిట్టనిలువునా చీల్చి ఎన్నికలలో గెలుస్తున్న పార్టీ వారికి ఎలా మింగుడు పడింది? 2019 ఎన్నికలలో బిజెపి తరపున విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టిన 303 మంది ఎంపీలలో ఒక్కరంటే ఒక్కరు కూడా ముస్లింలు  లేకపోవడం ఈ ఇద్దరు రాజకీయవేత్తలకూ ఏ రకమైన సందేశం ఇవ్వడం లేదా? గోసంరక్షక దళాల పేరుతో అమాయకులను కొట్టి చంపడాలు వీరికి నాగరీకంగా కనబడుతున్నాయా? ఈ విధానాలను ప్రశ్నించే రచయితలు, జర్నలిస్టులు, మేధావులపై రకరకాల పద్ధతుల్లో దాడి జరగడం వీరికి సమ్మతించదగ్గ విషయంగా కనబడుతోందా? తమ దారికి రానివారందరిపై దేశద్రోహులన్న ముద్ర వేయడం ఫాసిస్టు లక్షణమని ఈ విద్యాధికులకు తెలియదా?

పురందేశ్వరి, రాజగోపాల రెడ్డి రాజకీయాల్లోకి రావాలనుకున్నపుడే వారికి బిజెపి కనబడినట్లయితే ఈ ప్రశ్నలకు తావు లేదు. బిజెపి సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరినవారితో ఎవరికీ ఈ రకమైన పేచీ ఉండదు. పదేళ్లకు పైగా కాంగ్రెస్ వంటి మధ్యేవాద పార్టీలో కొనసాగి తర్వాత బిజెపిలో చేరినవారితోనే పేచీ. కనీసం వారు తమకు హిందుత్వ రాజకీయాలు నచ్చాయని చెప్పాలి. వాస్తవం అది కాదు కాబట్టి, ఆ మాట అంటే అసలుకు మోసం వస్తుంది కాబట్టి అలా అనలేరు. అక్కడ కూడా నిజాయితీ లేదు.

దానాదీనా చెప్పేదేమిటంటే భారతదేశంలో ప్రజాస్వామ్య రాజకీయాలకు భయంకరమైన జాడ్యం పట్టింది. దగ్గుబాటి పురందేశ్వరి, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి వంటి వారు ఆ జాడ్యం ప్రతినిధులు. బిజెపి వంటి మతతత్వ పార్టీకి లెజిటమసీ ఇచ్చేందుకు ఉపయోగపడే ఇలాంటివారు ఇకమీదట ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఎంతైనా కనబడుతోంది.

ఆలపాటి సురేశ్ కుమార్

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

Leave a Comment