NewsOrbit
బిగ్ స్టోరీ వ్యాఖ్య

చట్టాలతో చెలగాటమా!?

తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లో నలుగురి ప్రాణం తీసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆకాశానికెత్తారు. కాల్చి చంపింది పోలీసులయితే ముఖ్యమంత్రికి హాట్సాఫ్ చెప్పడం ఏమిటి? ఎందుకంటే అది బూటకపు ఎన్‌కౌంటర్ కాబట్టి. ఇలాంటి  విషయాలలో రాజకీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలుసు కాబట్టి. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా నిర్ణయం తీసుకుని పోలీసులను  ఆదేశించినందువల్లనే ఆ నలుగురు నిందితులను పోలీసులు తీసుకువెళ్లి కాల్చిచంపారని జగన్ పరోక్షంగా చెప్పారు.

చట్టబద్ధ పాలన చేస్తానని రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఇలా పోలీసులు చేసే హత్యలను సమర్ధించవచ్చునా? ఈ ప్రశ్న వేసుకోగానే అసలా ఎన్‌కౌంటర్‌కు ఆదేశించిన వ్యక్తి కూడా చట్టబద్ధ పాలనకు రాజ్యాంగబద్ధంగా పూచీ పడిన వ్యక్తే కదా అన్న ప్రశ్న కూడా వస్తుంది. కెసిఆర్‌ను సమర్ధించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ‘దిశ’ వంటి సంఘటన జరిగిఉంటే తాను కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవాల్సివచ్చేదని కూడా జగన్ అన్నారు.

ఈ పరిణామాలు వ్యవస్థల పతనాన్ని సూచిస్తున్నాయి. ముందు దిగ్భ్రాంతికి గురిచేసి తర్వాత హృదయాలను మెలిపెట్టే ‘దిశ’ వంటి సంఘటనలు జరిగినపుడు సామాన్యులు ప్రతీకారం కోరడాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు. తమ ఇంటిలోని వారికే అలా జరిగుంటే అన్న ఊహ అందరికీ వస్తుంది. ఆ ఊహ కలిగించే భయోత్పాతం నుంచి తక్షణ న్యాయం డిమాండ్లు పుడతాయి. అయితే ఇలాంటి మూక డిమాండ్లు వచ్చినపుడు పాలనా వ్యవస్థ  స్పందించే తీరు ఆ సమాజంలోని ప్రజాస్వామికతకు అద్దం పడుతుంది. ఈ గీటురాయిపై అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అధపాతాళంలో ఉన్నాయి.

దీని కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ (సిఆర్‌పిసి)కు కొన్ని సవరణలు ప్రతిపాదించారు. ‘ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం’ పేరుతో ప్రతిపాదించే ఆ సవరణ బిల్లును మంత్రిమండలి ఆమోదించిందనీ, ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే దీనిని ప్రవేశపెడతారనీ మీడియా తెలిపింది. మహిళలపై అత్యాచారానికి మరణశిక్ష విధించేలా సిఆర్‌పిసిని సవరించడం ఇందులో ముఖ్యమైన ప్రతిపాదన. నేరం జరిగిన 21 రోజుల్లోగా విచారణ పూర్తయి నిందితులకు శిక్ష విధించడం మరో ప్రతిపాదన.

అసలు ఎలాంటి నేరానికయినా మరణశిక్ష కూడదన్న వాదనను సమర్ధించే దిశగా ప్రపంచం నడుస్తోంది. మరణశిక్షను పూర్తిగా రద్దు చేసిన దేశాల సంఖ్యే ఎక్కువ. ఆ సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతానికి ఆ వాదన జోలికి  వెళ్లకుండా అత్యాచారం నేరం సంగతికే పరిమితమవుదాం. అత్యాచారానికి మరణశిక్ష ఉండాలన్న వాదన కొత్తదేమీ కాదు. ఈ వాదనను గట్టిగా వ్యతిరేకించే వారు చెప్పేదేమంటే మానభంగం చేసిన వారు తాము పట్టుబడితే మరణశిక్ష తప్పదన్న భయంతో మానభంగం తర్వాత హత్యకు కూడా పాల్పడతారని. ఈ వాదనలో వాస్తవం లేకపోలేదు.

నిర్భయ తర్వాత  మానభంగం నేరం విషయంలో చర్చ తీరుతెన్నులు మారిపోయాయి. నేరస్థులను తయారుచేసే సమాజంలో మార్పులు తీసుకురాకుండా తీవ్రమైన శిక్షలు విధించినంత మాత్రాన నేరాలు తగ్గవన్న వాదన వెనకబడిపోయింది. తీవ్రమైన శిక్షలు ఉండాలన్న వాదన నోరు పెద్దదయింది. ఫలితంగా నిర్భయ చట్టం అవతరించింది. ఆ చట్టం కూడా మానభంగం తర్వాత బాధితురాలి ప్రాణం పోయినపుడు, లేక జీవచ్ఛవంలా మారిన సందర్భాలలో మాత్రమే మరణశిక్ష విధించవచ్చని నిర్దేశిస్తున్నది.

దీనికి ముందు నిర్భయ ఉదంతం దరిమిలా కేంద్రప్రభుత్వం  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ వర్మ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక అత్యాచారానికి యావజ్జీవ కారాగారవాసం శిక్ష మాత్రమే ఉండాలని చెప్పిన విషయం గమనార్హం. మహిళల పట్ల నేరాలు పెరగడానికి ప్రభుత్వ వైఫల్యాలు, పోలీసు వ్యవస్థ వైఫల్యాలు ప్రధాన కారణమని జస్టిస్ వర్మ కమిటీ నిష్కర్షగా చెప్పింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకులకు ఈ సిఫారసులు కనబడవు. కనబడినా పట్టించుకోరు. ఎందుకంటే జనంతో ‘ఆహా ఓహో’ అనిపించుకునేందుకు ఇవి పనికిరావుగా!

ఇదంతా అలా ఉంచితే జగన్ ప్రభుత్వం చేయబోయే చట్ట సవరణ  అసలు నిలబడుతుందా? మీడియా రిపోర్టుల ప్రకారం మానభంగం నేరానికి యావజ్జీవ ఖైదు, లేక మరణశిక్ష అనకుండా కేవలం మరణశిక్ష నిర్దేశిస్తూ సవరణ ప్రతిపాదించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. సిఆర్‌పిసికి రాష్ట్రాలు ఏ సవరణ చేసినా దానిని రాష్ట్రపతి (అంటే కేంద్రప్రభుత్వం) ఆమోదించాలి. ఈ సవరణ కేంద్రం ఆమోదం పొందదని ఘంటాపధంగా చెప్పవచ్చు. కారణం రాజ్యాంగం ప్రకారం ఈ సవరణ చెల్లదు. ఏ నేరానికయినా కేవలం ఉరిశిక్ష నిర్దేశించడం రాజ్యాంగబద్ధం కాదని 1983లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ‘మితి’ కేసు తీర్పులో స్పష్టం చేసింది. ఇలాంటి విషయాలలో స్పందించే ముందు ప్రభుత్వ నేతలు నిపుణులతో కాస్త అధ్యయనం చేయిస్తే అభాసుపాలు కాకుండా ఉంటారని ఈ సంగతి మనకు సూచిస్తున్నది.

విచారణ 21 రోజుల్లో పూర్తి చేయాలన్న ప్రతిపాదన కూడా ఆలోచన లోపించిన చర్య మాత్రమే. ఏ క్రిమినల్ నేరానికి శిక్ష విధించాలన్నా దానికి ముందు జరిగే ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. మొదటిది దర్యాప్తు. నేరం ఎవరు చేశారో శోధించి తెలుసుకుని ఆ సంగతి కోర్టులో నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు సంపాదించి ఛార్జ్‌షీటు దాఖలు చేయడంతో ఈ దశ ముగుస్తుంది. తర్వాతి దశ ఇంక్వైరీ. ఇందులో న్యాయస్థానం పాత్ర మొదలవుతుంది. నిందితులపై అభియోగాలు నమోదు చేయడం ఇందులో ప్రధానం. నిందితులకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఉపయోగించబోయే సాక్ష్యాధారాలను ఈ దశలోనే డిఫెన్స్‌కు అందించాల్సి ఉంటుంది. అవి చూసి డిఫెన్స్ వారు తమ వాదనలు రూపొందించుకుంటారు. నిందితుడు ఎవరైనా నేరనిరూపణ కానంత వరకూ నిర్దోషేనన్న సూత్రంపై భారతీయ శిక్షాస్మృతి నిర్మాణమయింది. తమకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఉపయోగించే సాక్ష్యాల మంచీచెడూ శోధించి తెలుసుకునే హక్కు డిఫెన్స్ సొంతం. ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఒక వ్యక్తి స్వేచ్ఛను అరికట్టడం, లేక ప్రాణం తీయడం  గురించి అన్న విషయం మరచిపోకూడదు. ఆ పని చేసేముందు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు  నిందితుడికి చట్ట ప్రకారం ఉన్న అన్ని అవకాశాలూ కల్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా చాలా ప్రధానం. వంద మంది దోషులు తప్పించుకున్నా ఫరవాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదన్నది కూడా మన వ్యవస్థ ఆమోదించిన న్యాయసూత్రమే.

ఈ రెండు దశలూ పూర్తయిన తర్వాత విచారణ అనే తుది దశ ప్రారంభమవుతుంది. ఇంత పెద్ద ప్రక్రియను 21 రోజులకు కుదించడం అన్నది సరైన పని కాదు. జరిగే పనీ కాదు. నేరాన్ని నిర్ధారించేందుకు తగిన ఆధారాలు ఉన్నపుడు ఈ 21 రోజుల గడువులో విచారణ పూర్తి చెయ్యాలట. వారం రోజుల్లో నేరం దర్యాప్తు పూర్తి కావాలని నిర్దేశిస్తే మన పోలీసులు ఏం చేస్తారో ఊహించుకోవడం కష్టం కాదు. ఆవేశంలో, ఉద్వేగంలో చట్టాలు తయారు చేయకూడదు. ఒక చట్టం రూపొందించాలంటే దానికి ముందు చాలా అధ్యయనం జరగాలి. ఒక నేరానికి కేవలం మరణశిక్ష నిర్దేశించాలని ప్రతిపాదించేంత గంభీరమైన విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పిల్లలాట మాదిరి వ్యవహరిస్తున్నది. ఇది చట్టం అయినా కాకపోయినా ఈ ప్రయత్నమే చట్టాల పట్ల ప్రజల్లో గౌరవాన్ని తగ్గిస్తుంది. ఇది మంచికి కాదు.

ఆలపాటి సురేశ్ కుమార్

author avatar
Siva Prasad

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Leave a Comment