సరిగ్గా వారం రోజుల కిందట ఇదే వెబ్సైట్ లో మీడియా మాయ గురించి సంపాదక మిత్రులు చక్కని వ్యాఖ్య రాశారు. మోదీ పేరిట మీడియా చేసిన మోళీ గురించి తేటతెల్లం చేశారు. రాజదీప్ సర్దేశాయ్ లాంటి మానవమాత్రుడికి తప్పని దురవస్థ మీద జాలిపడ్డారు. డామేజ్ కంట్రోల్ చేసుకోడానికి అతగాడు పడ్డ పాట్లను సానుభూతితోనే పరామర్శించారు. అంతకుమించి, మీడియా ఒప్పుకోలేక పోయిన ఓ చేదునిజాన్ని మోదీ -పరోక్షంగానే అయినా- ఎకనాలెజ్ చేశారని కూడా చెప్పడం గమనార్హం.
అన్నీ చెప్పి, ఎవరో ఆషాఢ భూతి ప్రస్తావన చేశారు ఎడిటర్జీ!
“ఇంతకీ, సంపాదక మహాశయా, ఎవరీ ఆషాఢ భూతి? ఏమా కథ??” అని నేను అడిగేశాను. “విపులంగా చెప్తా వినుకోండి మిత్రమా!” అంటూ సంపాదకులు ఆషాఢభూతి కథ చెప్పుకొచ్చారు.
భక్తి బిజినెస్ అద్భుతంగా చేసి, కోట్లు గడించిన ఒకానొక గురువుకి పంగనామం పెట్టిన అతితెలివి శిష్యుడి కథే ఆయన చెప్పింది. ఆ కథలో నాకు తేడాగా అనిపించిన విషయం ఒకటుంది.
నిజానికి మన మీడియాకి ఆషాఢ భూతికి ఉన్నంత బుర్ర కూడా ఉందని నాకు అనిపించలేదు. మన మీడియా, ప్రధాన మంత్రి అంతటివాణ్ణి బోల్తా కొట్టించడమనే సవాలే లేదు! అయినా వందలసార్లు బోల్తా పడ్డానికి సిద్ధంగా మన ప్రేక్షక, వీక్షక దేవుళ్ళు ఉండగా మోదీని ఇబ్బందిపెట్టడం దేనికి?
మీడియా పెద్దలు మోదీని మధ్యలో పెట్టుకుని చేసే మోళీ గురించి సంపత్ సరళ్ అనే హిందీ వ్యంగ్య కవి జనరంజకంగా చెప్పుకొచ్చారు. ఇటీవల, రాజీవ్ నిగమ్ అనే స్టాండ్-అప్ కమెడియన్ అదే పని చేస్తున్నారు. నిగమ్ చెప్పినట్లు మన ఇంటర్వ్యూహ కర్తలు పసిపిల్లలకు సైతం నవ్వొచ్చే రీతిలో ప్రశ్నలు “సంధించారు.” వాటికి మోదీ -తన యాభయ్యారు అంగుళాల ఛాతీ చీల్చుకుని- మరీ నిజాయితీగా సమాధానాలు ఇచ్చారని రాజీవ్ నిగమ్ అన్న మాట విని హాల్లోని కుర్రకారు ప్రేక్షకులు పడీ పడీ నవ్వారు.
ఏముంది అందులో అంత హాస్యం?
మొదటిది- మీడియా వీరులు ప్రశ్నలు ‘సంధించడం’ కన్నా జోక్ వేరే ఏముంటుంది??
సంధి పేలాపనలు చెయ్యడం, చెక్కభజన చెయ్యడం తప్పితే, మన మీడియాకి ప్రశ్నలు సంధించడం కూడా వచ్చా అన్నది ప్రేక్షక దేవుళ్ళ నవ్వు లోని ఆంతర్యం! తానే సాక్షాత్తు ఓ ఆషాఢ భూతి అయివున్న వ్యక్తి, మీడియా ఆషాఢభూతి వేషం వేద్దామనుకున్నా ఒప్పుకుంటాడా? అయినా, మన “ఓపెన్-హార్ట్” మీడియా ఏపాటి ప్రశ్నలు సంధించగలదో మన ప్రేక్షకులకు తెలియనిదా?? “అంతేగా మరి!”
రెండో విషయం- మన రామభక్త హనుమాన్ ఛాతీ చీల్చుకుని మరీ సమాధానాలు సంధించడం గురించినది. తాను దశాబ్దాల కిందట వదిలిపెట్టిన “ఫ్యామిలీ” గురించిన రహస్యం ఎన్నికల సంఘం వత్తిడి చేస్తే తప్ప వెల్లడించని సత్యవాది, చెక్కభజన మీడియా ఇంటర్వ్యూహకర్తలతో ఛాతీ చీల్చుకుని నిజం మరీ చెప్పారనడం కన్నా హాస్యోక్తి వేరే ఏముంటుంది? ఒక్కొక్క విపరీత పరిస్థితుల్లో స్వభావోక్తులే హాస్యోక్తులుగా మారడం చూశాం. కానీ ఇలాంటి ఇంటర్వ్యూహాలను మాత్రం కనీవినీ ఎరగమని సవినయంగా ఒప్పుకోవాలి.
ఈ కారణాల చేతనే, మీడియా ఇంటర్వూహాలు హాస్య సంచికలు గానూ, స్టాండ్-అప్ కామెడీలు చేదు నిజాలు ప్రకటించే సందర్భాలు గానూ మారుతున్నాయి.
మరీ ముఖ్యంగా, ఈ మురుగైన మీడియా, సంఘ సంస్కర్తల గొంతుకలను మిమిక్రీ చెయ్యడం కడుపుబ్బ నవ్విస్తోంది. నిజానికి తెలుగోడికి ఈ విషాదకర వినోదం మరీ కొత్తేమి కాదు. ఎవరో పెద్దాయన, చెప్పినట్లు “చరిత్ర పునరావృత్తం అవుతుంది- మొదటిసారి విషాదంగానూ; రెండోసారి అపహాస్యంగానూ! ”
అయ్యా ఇప్పటికింతే!
– మందలపర్తి కిషోర్
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ