మన తరం తుగ్లక్ కథ మనమే రాసుకోవాలి

 

దాదాపు వారం రోజుల కిందట బెంగళూరులో కన్నుమూసిన బహుముఖ ప్రజ్ఞావంతుడు గిరీష్ కార్నాడ్ ను ముఖ్యంగా ఒకందుకు పదేపదే జ్ఞాపకం చేసుకోవాలి. “తుగ్లక్” నాటకం రాయడం ద్వారా తన తరానికి చెందిన ఒక సామాజిక సమస్యను, చారిత్రిక నేపథ్యంలో చూపించి, కళాకారుడిగా తన కర్తవ్యం నిర్వర్తించారు కార్నాడ్. ఆ పని చేసే నాటికి ఆయన వయసు కేవలం 27! జన సామాన్యంలో అత్యధికులకు అందుబాటులో ఉండే రచనా ప్రక్రియ, రూపకం. అదే ప్రక్రియలో కార్నాడ్ తన కర్తవ్యం నిర్వర్తించారు. 1965 లోనే, నెహ్రూ పోయిన ఏడాదికే, కార్నాడ్ “తుగ్లక్” లాంటి నాటకం రాయడాన్ని నేను వ్యక్తిగత విజయంగా చూడను- ఆ తరానికి  మొత్తానికి కాకపోయినా, అందులోని పాదరసం లాంటి మేధావి వర్గానికి చెందవలసిన విజయం అది! వాస్తవానికి అది ఒక చారిత్రిక పశ్చాత్తాప ప్రకటన పత్రం! ఆ నాటకంలో ఇతివృత్తం పద్నాలుగో శతాబ్దం నాటి ఢిల్లీ సుల్తాన్ కథ కాదు- పందొమ్మిది వందల అరవై దశకం నాటి భారత జాతీయ నాయకత్వం గురించిన కథ అది! ఆ విషయాన్ని కార్నాడ్ స్వయంగా చెప్పారు.

అయినా, కార్నాడ్ అనే సూర్యుడికి దివిటీ పట్టడం నా పని కాదు- కార్నాడ్ నుంచి, ఆయన సమకాలికులు ఎలాంటి ప్రభావం పొందారో చెప్పుకుంటే, అది కార్నాడ్ గురించి చెప్పుకున్నట్టే కదా! అలాంటి వాళ్లలో ముందుగా చెప్పుకోవలసింది “చో” రామసామి గురించి. చో ప్రముఖ నటుడు. పేరున్న రచయిత. సినిమాలూ, నాటకాలూ రెండింటిలోనూ ఎదురులేకుండా వెలిగిన ప్రయోక్త. తమిళ రాజకీయ రంగంలో చాణక్యుడిలాంటి వాడు. అన్నిటికీ మించి ప్రముఖ పత్రికా సంపాదకుడు. “తుగ్లక్” పేరుతోనే చో ఒక పత్రిక పెట్టి సమకాలీన రాజకీయ నాయకుల్ని తోలువొలిచేస్తూ రాసేవాడు. అలాంటి చో పైన కార్నాడ్ “తుగ్లక్” నాటకం ప్రభావం ప్రసరించడంలో వింతేముంది?

ప్రభావాలన్నీ ప్రతిఫలనాల మాదిరిగానే ఉండనక్కర్లేదు. సృజనాత్మకత ఉన్నవాళ్లు తలకిందులు ప్రపంచాన్ని, దాని కాళ్ళ మీద దాన్ని నిలబెట్టి, మనకు  చూపిస్తారు. అదీ ప్రభావమే!

కార్నాడ్ “తుగ్లక్” వెలువడిన మూడేళ్లకే, 1968 లో “చో” రామసామి తమిళంలో మరో “తుగ్లక్” నాటకం రూపొందించారు. ఈ నాటకం థియేటర్లలో నెలల తరబడి ఆడింది. మరో మూడేళ్ళకి, 1971 లో, ఇదే నాటకం చిన్నపాటి మార్పులతో తమిళ సినిమాగా వచ్చి దిగ్విజయం నమోదు చేసుకుంది. సహజంగానే, అది తెలుగులోకి దిగుమతి కానూ అయింది!

నిజమే- “చో” రామసామి తమిళంలో రాసింది, కార్నాడ్ నాటకం లాంటిది కాదు. అందులో   చారిత్రికతా- సమకాలీనతా- పెనవేసుకుపోవడం లాంటి అద్భుతాలు కనిపించవు. అయితే, నేరుగా ఆనాటి రాజకీయ నాయకుల మనస్తత్వాన్ని నడిబజారులో ఉతికి ఆరేశారు “చో”. అసలు, కార్నాడ్ నాటకానికి, “చో” రామసామి నాటకానికి పోల్చడం కన్నా అసంబద్ధం మరొకటి ఉండదని నా అభిప్రాయం. అయినప్పటికీ ఓ మాట చెప్పాలనుకుంటున్నా- నా దృష్టిలో ఇవాళ్టి రాజకీయ వైపరీత్యం ఇతివృత్తంగా ఇలాంటి నాటకం ఇంకొకటి రావలసి వుంది!

పిచ్చి తుగ్లక్ తోలు నాణేలు ప్రవేశపెట్టి నవ్వుల పాలయ్యాడని చరిత్రలో చదువుకున్నాం. మన “నోట్లరద్దు” ప్రహసనం అంతకన్నా తీసిపోయిందా?

పిచ్చి తుగ్లక్ తన రాజ్యంలోని ప్రతి వ్యవస్థనూ -సంస్కరిస్తున్నాను అనుకుని  -చిందరవందర చేశాడని చరిత్ర చెప్తోంది. మన దేశంలో ఇప్పుడు మాత్రం ఏం జరుగుతోంది? రిజర్వు బాంక్, ఎన్నికల సంఘం, కాగ్ తదితర వ్యవస్థలన్నీ ఛిద్రం అవుతున్నాయి మొర్రో అని కేజ్రీవాల్ మొదలుకుని మమతా బెనర్జీ దాకా మొత్తుకోవడం లేదా?

చో సినిమాగా తీసిన తుగ్లక్ కథలో ఓ గాంధీవాది, అతని కూతురు కనిపిస్తారు. ఆమె చిలక జోస్యం చెప్పుకుని బతుకుతున్నట్లు రాశారు చో. మన రాజకీయాల్లో నీతిగానూ, నిజాయితీగానూ బతికినవాళ్ల సంతానం స్థితి గతులు ఇవాళ అందుకు భిన్నంగా ఉన్నాయా?

ఏతావాతా నేను చెప్పేదేమిటంటే మనకాలపు తుగ్లక్ గురించి మనమే రాసుకోవాలి. కార్నాడ్, చో రామసామి లాంటి వాళ్ళనుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు అన్నింట్లోకీ ఇదే ముఖ్యమైంది! ఏ తరం అవసరాలను ఆ తరానికి చెందిన రచయితలూ కళాకారులే తీర్చుకోవాలి.

రచయితలూ, వింటున్నారా?

గాంధీ గారి బొమ్మని -బొమ్మతుపాకులతోనే అయినప్పటికీ- కాల్చి, “గోడ్సే అమర్ హై” అంటూ నినాదాలిచ్చే దేశభక్తులు మనల్ని కమ్ముకుని ఉన్న కాలమిది. భోపాల్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెల్చిన మాలేగాం మారణకాండ నిందితురాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గోడ్సే ని అమరవీరుడిగా అభివర్ణించిన పిదప కాలమిది. ఇలాంటి దశలో మన పని మనం చెయ్యకపోతే రేపు చరిత్ర ముందు చేతులుకట్టుకుని నిలబడవలసి వస్తుంది!

-మందలపర్తి కిషోర్