ఎవరు అసురులు?

విజేతలే చరిత్ర నిర్మాతలు. పరాజితులు చారిత్రక విస్మృతులు. విజేతలే కథానాయకులు. పరాజితులు ఎప్పటికీ ప్రతినాయకులే. విజేతలు దేవుళ్ళవుతారు. పరాజితులు దెయ్యాలవుతారు. రాక్షసులవుతారు. విజేతలు రాసిన చరిత్రలే చదువుకుంటూ అదే చరిత్రగా విశ్వసిస్తూ ఆ దేవుళ్ళనే దేవుళ్ళనుకుని..ఆ రాక్షసులనే రాక్షసులనుకుని పదేపదే అదే చరిత్రను వల్లెవేసే వాళ్ళంతా సాధారణ ప్రజలు. ఆ సాధారణ ప్రజలే అసాధారణ వ్యక్తులైనప్పుడు వాళ్ళొక కొత్త చరిత్రను నిర్మిస్తారు. పాతది పతనమవుతూ వుంటుంది. కొత్తది నిర్మితమవుతూ వుంటుంది. సైంటిస్టుల అంచనా ప్రకారం ఇప్పటి మన రూపంలో వున్న హోమోసెపియన్సు అనే తెలివైన జీవి అభివృద్ధి చెంది 20 లక్షల సంవత్సరాలు. కథలు అల్లగలిగే మెదడు వుండడమే ఈ జీవి ప్రత్యేకత. అంటే ఈ జీవి ఊహించగలడు. ఆ ఊహతో  రాజ్యాలు కూల్చాడు. రాజ్యాలు నిర్మించాడు. సామాన్యులను అసామాన్యులుగా కదను తొక్కించాడు. అసామాన్యులును చరిత్రహీనులుగా మార్చేశాడు. విప్లవాలు చేశాడు. విప్లవాలు అణచాడు. అంతరిక్షాన్ని అందుకున్నాడు. పాతాళానికి పడిపోయాడు. అందుకే అప్పుడప్పుడూ ఇదే నిజం అని ఎవరైనా అంటే అసత్యమైన అసలు సత్యమేదో వుందని అనుమానం వస్తుంది.

ఇటీవల అసురుడు అనే పుస్తకం చదివాక సినిమా భాషలో చెప్పాలంటే మైండ్ బ్లాస్టయింది. బుల్లెట్ నేరుగా ఎక్కడ దిగాలో అక్కడ దిగింది. వేల సంవత్సరాలుగా మనకు తెలిసిన ఒక గాథ తల్లకిందులుగా అర్థమై భూగోళానికి నేను కొంచెం ఎడంగా జరిగి దాని చుట్టూ నేను గిర్రున తిరిగినట్టయింది. ఆనంద్ నీలకంఠన్ అనే రచయిత ఇంగ్లీషులో ASURA-TALE OF THE VANQUISHED-The Story of Ravana and his people అన్న పేరుతో రాసిన గ్రంథాన్ని తెలుగులో శాంతసుందరి గారు అనువదించారు. రావణుడు,  అతని అనుచరుడు భద్రుడు కథ చెబుతారు. తమ కథ. తమ జాతి కథ. కొన్ని వేల సంవత్సరాల క్రితం మహాసామ్రాజ్యాలు నిర్మించిన అసుర జాతి కథ చెబుతారు. బలి చక్రవర్తి మొదలుకొని రావణుడి దాకా అసురుల ఉత్థానపతనాల ఉద్వేగభరిత గాథ ఇది. పరాజితుల వైపు నుండి కథ వినడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అప్పటి దాకా అమల్లో వున్న నమ్మకాలు తిరగబడతాయి. ఆ కల్లోలాన్ని తట్టుకొనే శక్తి కావాలి. వేల సంవత్సరాలుగా దేన్నయితే సత్యంగా నమ్ముతున్నామో అదే సత్యం, బోనులో  నిలబడినప్పుడు ఆ సత్యం వైపు కొంచెమైనా అపనమ్మకంగా చూసే సాహసం చేయాలి. అదిగో అలాంటి అల్లకల్లోల మీమాంస లోకి మనల్ని నెడుతుంది ఈ పుస్తకం.

పుస్తకం మొదట్లోనే డిస్‌క్లెయిమర్ వేశారు. ఇది పూర్తి కల్పిత గాథ అన్నది రచయిత, ప్రచురణకర్తల మాట. కాబట్టి ఇందులో  సాక్ష్యాధారాల ప్రసక్తి తలెత్తదు. కాని మనకు తెలిసిన రామాయణంలో పాత్రలు అవే పేర్లతో ఇందులో ప్రత్యక్షమవుతాయి. కనుక మనకు తెలిసిన రామాయణాన్ని దీనితో సరిపోల్చకుండా వుండలేం. ఇప్పుడు భారత దేశంగా చెప్పుకుంటున్న ప్రాంతంలో ఒకప్పుడు అసురుల రాజ్యం సువిశాలంగా విస్తరించి వుందని, అప్పుడు సామాజిక న్యాయం సంపూర్ణంగా విరాజిల్లేదని, స్త్రీలకు,  కింది తరగతులకు స్వేచ్ఛ వుండేదని, కులమతాల విభేదాలు మచ్చుకైనా లేవని, పాలకు  వర్గాలకు కింది తరగతులకు ఆర్థిక అంతరాలు ఉన్నప్పటికీ అవి ఇప్పటిలా వుండేవి కాదని అసురుల చరిత్ర చెప్తోంది. దీనికి పూర్తి విరుధ్ధమైన సమాజం దేవతల రాజ్యం అని, అసురులు నిర్మించిన నగరాలను, సంస్కృతిని, నాగరికతలను ధ్వంసం చేయడమే ఏకైక కర్తవ్యంగా దేవతల రాజు ఇంద్రుడు రక్త చరిత్రను లిఖించాడని ఈ పుస్తకం మనకు చెబుతుంది.

వాస్తవానికి రావణుడికి పది తలకాయలు లేవు. అతని శిరస్సు కాక మరో  తొమ్మిది తలలు తొమ్మిది రకాల భావోద్రేకాలకు సంబంధించినవని ఈ పుస్తకం వివరిస్తుంది. క్రోధం, అహంకారం,ఈర్ష్య, ఆనందం, దు:ఖం, భయం, స్వార్థం, ఉద్రేకం, అత్యాశ అనే తొమ్మిది భావోద్రేకాలను దరి చేరనీయ వద్దని బలి చక్రవర్తి రావణుడికి బోధిస్తాడు. ఈ తొమ్మిది వుంటేనే తాను పరిపూర్ణ వ్యక్తిని కాగలనని రావణుడు బలంగా వాదిస్తాడు. ఇవి లేకుండా ఎవరూ ఉండరు, ఉండబోరని అతని వాదన. చరిత్రలు నిర్మించినా చరిత్రలు ధ్వంసమైనా మానవ సహజమైన ఈ ఉద్రేకాలేనని,  వీటిని అణచివేయడం అసాధ్యమని రావణుడి తర్కం. మానవులకు అసాధ్యమైన వాటిని బోధించి అడవుల్లో ముక్కు మూసుకుని తపస్సు చేసే వారెవరూ ఏ నాగరికతలూ నిర్మంచలేదని, తమ భావాలను ఎన్నడూ అదుపు చెయ్యకుండా ప్రకృతి నిర్దేశించిన దిశగా వాటిని ప్రవహింపజేసిన అసాధారణ వ్యక్తులే వాటిని నిర్మించారని రావణుడి వాదన. అడవిలో నివసించే ఏ సన్యాసీ గొప్ప నగరాలను గురించి కల్పన  చెయ్యలేదని, గొప్ప దేవాలయాలను కట్టలేదని వాదిస్తాడు. అందుకే అతను దశకంఠుడయ్యాడు. ఈ పుస్తకం పొడవునా రావణుడు  చేసిన ఇలాంటి వాదనలు, తర్కాలూ చూస్తే మనకు తెలిసిన రామాయణం కథంతా గిర్రున తిరిగి మనల్ని కూడా గిర్రున తిప్పుతుంది. బలి చక్రవర్తిని ఎందుకు పాతాళానికి తొక్కేశారు? రావణా బ్రహ్మ అని ఎందుకు సంబోధించారు? అతనికి సీత నిజంగా కూతురేనా? అతను తల్చుకుంటే సీతను ఏమీ  చేయలేడా? మేఘనాధుడు, కుంభకర్ణుడు,  మొదలైన  అసురులు మహా పరాక్రమవంతులని చదువుకున్నాము కదా అదేంటి? శివుడే అసుర జాతి మొదటి చక్రవర్తా? అందుకే గరళ కంఠుడు రాక్షసులకు ఆరాధనీయుడయ్యాడా? ఇలాంటి కలగాపులగపు ఆలోచనలతో ఘర్షణలతో మనం సతమతమవుతాం.

ఎప్పుడో మహాత్మా ఫూలే దేవతలు ఆర్యులని, ఇక్కడి స్థానిక తెగలన్నీ వారి ఆక్రమణలకు అణచివేతలకు గురై సర్వం కోల్పోయి అసురులుగా చరిత్రలో నిలిచిపోయారని వాదిస్తూ పుస్తకాలు చాలా రాశాడు. అయితే డా. అంబేద్కర్  ఆర్య అనార్య సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. దానితో సురాసురుల చరిత్రలను అర్థం చేసుకునే క్రమాన్ని బహుజనులు కొంచెం దూరం పెట్టారు. రావణుడికి జీవితమంతా ప్రాణాలొడ్డి సేవ చేసిన భద్రుడు ఒకచోట అంటాడు. ‘’రావణుడు ఎప్పుడూ కూడా దేవుడు కాలేడు. ఆయనలోని మానవత్వమే ఆయన్ను దేవుడిని చెయ్యలేదు.’’ ఈ మాట సారాంశమే ఈ మొత్తం పుస్తకం. ఏది ఏమైనా ఈ పుస్తకంలో రావణుడే ఒకచోట అన్నట్లు ‘’యుద్ధంలో గెలిచిన వారికే సంపదలు, పేరుప్రతిష్టలు దక్కుతాయి. అతనే సత్యసంధుడని కీర్తి గానాలు వేల సంవత్సరాల పాటు కొనసాగుతాయి. విజేత మాత్రమే నాయకుడు. పరాజితుడు ప్రతినాయకుడిగానే చరిత్రలో మిగిలిపోతాడు.’’  రావణుడే అన్నట్టు రాముడో రావణుడో చనిపోతారు. ప్రపంచం ఇలాగే ముందుకు పోతుంది. దౌర్భాగ్యులు దౌర్భాగ్యులుగానే వుండిపోతారు. కొత్త రాజులు పుడతారు. కొత్త విప్లవాలు  పుడతాయి. కొత్త మతాలు వెలుస్తాయి. పరస్పరం సంఘర్షణ పడతాయి. కానీ పరిస్థితులు మాత్రం అన్నీ అలాగే వుంటాయి.

ఇలాంటి మాటలెన్నో ఈ పుస్తకం నిండా రావణుడి నోటి నుండి వింటాం. రామాయణమా? రావణాయణమా? ఏది సత్యం ఏదసత్యం..తల బద్దలు కొట్టుకుంటాం. కానీ రానున్న నవీన తరాల మరో చరిత్ర నిర్మాతలకు ఇలాంటి పుస్తకాలు పునాదులుగా పనిచేయవచ్చు.

డా.ప్రసాదమూర్తి