NewsOrbit
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

బార్ అసోసియేషన్లు దారి తప్పితే ఎలా!?

చట్టం అనేది ఒక విచిత్రమైన విషయం. సమాజంలో చట్టం ప్రమేయం లేకుండా ఏదీ జరగదు. మనిషి ఏ పని చెయ్యాలన్నా, అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా అందులో ఏదో విధంగా చట్టం పాత్ర ఉంటుంది. చట్టం మనలను పాలిస్తున్నది. అయితే ఈ విధంగా చట్టాలకు లోబడి మనం వ్యవహరిస్తున్న విషయం మనలో చాలామందికి గుర్తుండదు. సమాజం అంతరాత్మను కుదిపేసే ఘోరం ఏదైనా జరిగినపుడు చట్టం అందరికీ గుర్తుకువస్తుంది. చట్టాలు సక్రమంగా ఎందుకు అమలు కావడం లేదన్న ధర్మాగ్రహం పెల్లుబుకుతుంది.

హైదరాబాద్ శివార్లలో మొన్న జరిగిన దారుణం అలాంటిదే. దిశపై అత్యాచారం, ఆపై దుండగులు ఆమెను దహనం చేసిన ఉదంతం ఒక్క తెలంగాణలోనే కాక యావత్ దేశంలో తీవ్ర ప్రకంపనలకు దారి తీసింది. 2012లో దేశ రాజధానిలో జరిగిన నిర్భయ ఉదంతం తర్వాత భారతీయ ఆత్మ ఇంతగా క్షోభించిన సంఘటన మరోటి లేదు.

దిశ హత్యాచారం ఘటనపై సాధారణ ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆవేదన, ఆగ్రహం అర్ధం చేసుకోదగినవే. అత్యాచార నేరానికి మరణశిక్ష ఉండాల్సిందేనని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అప్పీళ్లు ఉండరాదని కూడా కొందరు అంటున్నారు. క్షమాభిక్ష పిటిషన్ల పేరుతో కాలయాపన తగదని మరికొందరు అంటున్నారు. ఉన్న చట్టాలు సక్రమంగా అమలయితే చాలని అనేవారూ లేకపోలేదు. ఈ స్పందనలు సహజంగా వచ్చేవే. అందులో ఆశ్చర్యం కలిగించేదేమీ లేదు.

అయితే చట్ట ప్రకారం జరగాల్సిన ప్రక్రియ(డ్యూ ప్రాసెస్)ను కుదించాలన్న డిమాండ్ కాస్త ఆందోళన కలిగించే విషయం. అది సాధ్యం కాదన్న సంగతి అలా ఉంచితే విద్యాధికుల నుంచి, చట్ట సభల సభ్యుల నుంచీ కూడా ఈ డిమాండ్ రావడం చాలా ఆందోళనకరం.

ఈ డ్యూ ప్రాసెస్ మొదలు కావడానికి సంబంధించిన ఒక ప్రాధమిక అంశం ఇక్కడ చర్చించాలి. దిశ ఉదంతం బయటకువచ్చిన తర్వాత పాలమూరు బార్ అసోసియేషన్ సమావేశమై నిందితుల కేసు ఎవరూ చేపట్టరాదని తీర్మానించింది. చట్టాల ద్వారా న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషించే న్యాయవాదులు ఇలా తీర్మానం చెయ్యడం నిజంగా ఆశ్చర్యమే.

గతంలో కూడా ఇలాంటి తీర్మానాలు వచ్చాయి. చిలకలూరిపేట బస్సు దహనం కేసులో, చాలా సంవత్సరాల క్రితం విజయవాడలో ఒక కళాశాల విద్యార్ధినిని క్లాసులోనే నరికి చంపిన కేసులో బార్ అసోసియేషన్లు నిందితుల తరపున వాదించరాదన్న తీర్మానాలు  చేశాయి. ఇలాంటి తీర్మానాలు దేశంలో చాలాచోట్ల చాలా సందర్భాలలో వచ్చాయి.

ఇండియా ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ చట్టబద్ధ పాలన అమలులో ఉంది. విచారణ లేకుండా ఇక్కడ శిక్షలు విధించరు. విచారణ లేకుండా శిక్ష విధించడం సహజ న్యాయసూత్రాలకు కూడా విరుద్ధం. విచారణలో నిందితుడికి తన వాదన వినిపించుకునేందుకు అవకాశం ఉండాలి. న్యాయశాస్త్రం అభ్యసించిన ఒక న్యాయవాది నిందితుడి తరపున డిఫెన్స్ వాదన వినిపించాలి. ఇందుకు భిన్నంగా జరగడానికి వీలు లేదు. నిందితుడి తరపున వాదించేందుకు ఎవరూ ముందుకు రానపుడు కోర్టు స్వయంగా అతడి తరపు న్యాయవాదిని నియమిస్తుంది. ఆ న్యాయవాది కూడా హాజరు కాకపోతే మరో న్యాయవాదిని నియమిస్తారు తప్ప డిఫెన్స్ లేకుండా విచారణ జరగదు. చట్టం నిర్దేశిస్తున్న ఈ ప్రక్రియ వెలుపల ఏ వ్యక్తి స్వేచ్ఛనూ, ప్రాణాలనూ హరించేందుకు వీలు లేదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 స్పష్టం చేస్తున్నది.

నిందితుల తరపు వాదించరాదంటూ బార్ అసోసియేషన్లు తీర్మానాలు చేయడం రాజ్యాంగ సూత్రాలకూ, చట్టాలకూ, వృత్తిపరమైన నియమాలకూ విరుద్ధమని సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టం చేసింది. కొందరు పోలీసులు నిందితులుగా ఉన్న ఒక కేసులో వారి తరపు ఎవరూ వాదించరాదంటూ కోయంబత్తూరు బార్ అసోసియేషన్ తీర్మానించింది.

ఈ కేసు (మొహమ్మద్ రఫీ వర్సెయిస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2011) సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వెళ్లినపుడు, జస్టిస్ మార్కండేయ కట్జూ తీర్పు చెప్పారు. నిందితుడు పోలీసయినా, హంతకుడైనా, రేపిస్టయినా, టెరరిస్టుయినా ఇలాటి తీర్మానాలు చెల్లుబాటు కావని జస్టిస్ కట్జూ పేర్కొన్నారు. ఇలా తీర్మానాలు చేయడం న్యాయవాద వృత్తి యొక్క ఘనమైన సంప్రదాయాన్ని ఉల్లంఘించడమేననీ, ఈ తీర్మానాలు న్యాయవాద వృత్తికే సిగ్గుచేటనీ ఆయన తీర్పులో వ్యాఖ్యానించారు. ఇలాంటి తీర్మానాలు చెల్లుబాటు కావనీ, వృత్తిధర్మానికి కట్టుబడే న్యాయవాదులు వాటిని పట్టించుకోవాల్సిన పని లేదనీ జస్టిస్ కట్జూ పేర్కొన్నారు.

విచారణలో డిఫెన్స్ ఆవశ్యకతను నొక్కిచెప్పే మరో తీర్పు (విజయలక్ష్మి వర్సెయిస్ స్టేట్ ఆంధ్రప్రదేశ్) 2013లో వచ్చింది. జూనియర్ సివిల్ జడ్జి ఉద్యోగానికి ఎంపికయిన విజయలక్ష్మి అనే మహిళ భర్త న్యాయవాది. అతను గతంలో నిషేధిత మావోయిస్టు సంస్థ సభ్యుడొకరి తరపు డిఫెన్స్ న్యాయవాదిగా వ్యవహరించారన్న కారణంగా ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఆమెకు అప్పాయింట్‌మెంట్ నిరాకరించింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఆమెకు ఉద్యోగం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, ఆ సందర్భంగా న్యాయవాది ద్వారా తన వాదన వినిపించుకునేందుకు నిందితుడికి ఉన్న హక్కును ప్రస్తావించింది. నిందితుల తరపు వాదించాల్సిన విధి, బాధ్యత న్యాయవాదిపై ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.

బని సింగ్ వర్సెయిస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్‌లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధార్మాసనం తరపు తీర్పు రాసిన ప్రధాన న్యాయమూర్తి అహ్మదీ క్రిమినల్ అప్పీళ్ల పరిష్కారానికి అవలంబించలసిన ప్రక్రియను నిర్దేశించారు. నిందితుడి తరపు న్యాయవాది ఎవరూ లేనట్లయితే లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌ను నియమించాలని స్పష్టం చేశారు. అలా నియమించిన న్యాయవాది కూడా హాజరు కానట్లయితే మరో న్యాయవాదిని నియమించాలని పేర్కొన్నారు.

బార్ అసోసియేషన్లు చేసే  ఇలాంటి తీర్మానాలు చెల్లవని తాజాగా కూడా ఒక తీర్పు వచ్చింది. ఒక హత్య కేసులో నిందితుడి తరపు ఎవరూ హాజరు కారాదనీ, ఎవరైనా హాజరయితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయనీ కొత్వార్ బార్ అసోసియేషన్ చేసిన తీర్మానం ఉత్తరాఖండ్ హైకోర్టు ముందుకు వచ్చింది. ఆ తీర్మానం చెల్లదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ తీర్పు ఇచ్చారు.

ప్రజాస్వామ్య విలువలు వికసించాలంటే, శాంతి సామరస్యాలతో సమాజం విలసిల్లాలంటే ప్రభావంతమైన, నిష్పాక్షికమైన  న్యాయవ్యవస్థ ఎంతైనా అవసరం. న్యాయవాదుల క్రియాశీల పాత్ర లేకుండా  అలాంటి న్యాయవ్యవస్థ నిర్మాణం సాధ్యపడదు. న్యాయవాద వృత్తి ధీరోదాత్తమైనది, ఉదాత్తమైనదీ కూడా. అలా అని న్యాయవాదులు మనుషులు కాకుండా పోరు. మానవ నైజంలో భాగమయిన అన్ని లక్షణాలూ వారిలోనూ ఉంటాయి. దిశ లాంటి సంఘటనలు జరిగినపుడు అందరితోపాటూ న్యాయవాదులూ చలించిపోతారు. ఉద్వేగాలతో ఊగిపోతారు. బాధితులకు బాసటగా నిలవాలనీ, సంఘీభావం ప్రకటించాలనీ వారు భావిస్తే అందులో ఏమాత్రం తప్పు లేదు. కానీ ఎంచుకునే దారి సహజ న్యాయసూత్రాలకూ, చట్టబద్ధ పాలన అన్న మూల సూత్రానికీ విరుద్ధంగా ఉండకూడదు.

పోసాని వెంకటేశ్వర్లు

న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

Leave a Comment