NewsOrbit
వ్యాఖ్య

ఆస్కారొచ్చే ఆస్కారం లేదా?

సీవీ సుబ్బారావు అనే తెలుగు మేధావి ఒకాయన ఉండేవాడు. మిత్రులు ఆయన్ని -ముద్దుగా – “సురా” అనేవారు.  ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు “సురా”. తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో చక్కగా మాట్లాడే వాడు- అరుదుగా రాసేవాడు. అతనొకసారి -సృజనలో అనుకుంటా- ఓ చిత్రమైన కాలమ్ రాశాడు. కేంద్ర సాహిత్య అకాడెమీ కథారచనలో ఉత్తమ బహుమతిని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకే ఇవ్వాలని ఆ కాలమ్ లో “సురా” బల్లగుద్ది వాదించాడు. బూటకపు ఎన్కౌంటర్లు, లాకప్ హత్యలూ, స్త్రీల పై పోలీసుల అత్యాచారాలూ, జైళ్లలో జరిగే కిరాయి హత్యల గురించి పోలీసులు చెప్పే కథనాలు అత్యంత సృజనాత్మకంగా ఉంటాయనీ, అంచేత వారిలోని ప్రతిభను గుర్తించి గౌరవించాలనీ “సురా” డిమాండు చేశాడు. నిజానికి ఒక్క కథా రచనలోనే కాదు సకల లలితకళల్లోనూ పోలీస్ శాఖకే ఉత్తమ బహుమతి ఇవ్వాలని ఒక్కోసారి అనిపిస్తుంది. ముఖ్యంగా నటనలో! ఇంత గొప్ప జాతి అయిన మనకి నటనలో ఒక్క ఆస్కార్ అవార్డయినా దక్కలేదని బాధపడే నాలాంటి దేశభక్తులకు ఆశాకిరణంలా తోచిన దవీందర్ సింగ్ లాంటి వాళ్ళ గురించి విన్నప్పుడు ఇలా అనిపించి తీరుతుంది మరి!
ఎవరా దవీందర్? ఏమా కథ?? అని మీరు (విక్రమార్కుడిలా) అడగక ముందే చెప్తున్నా- దవీందర్ సింగ్ జమ్మూ-కాశ్మీర్ పోలీస్ శాఖ ఉన్నతాధికారి; డీఎస్పీ. అంచెలంచెలుగా పైకొచ్చిన కృషీవలుడు! అత్యుత్తమ సేవలు అందించిన సుశిక్షితుడైన రక్షక భటుడిగా, పతకాలు కూడా పొందిన ప్రతిభా శీలి. 370 ప్రకరణం రద్దు తర్వాత కాశ్మీర్ పరిస్థితులు ఎలావున్నాయో పరిశీలించడానికి వచ్చిన విదేశీ ప్రముఖుల బృందం భద్రతా బాధ్యత ఇదే దవీందర్‌కి అప్పగించారు అధికారులు! ఈ ప్రతిభావంతుణ్ణి త్వరలోనే జమ్మూకాశ్మీర్ పోలీస్ శాఖ పర్యవేక్షక పదవికి ప్రమోట్ చేయబోతున్నారని కూడా అన్నారు! అంతటి ప్రతిభాశీలి, కిందటి శనివారం ముగ్గురు ఉగ్రవాదులను “స్మగుల్” చేస్తూ దొరికిపోయాడు.
గత్యంతరంలేని పరిస్థితిలో ఈ నిప్పులాంటి ఎన్కౌంటర్ స్పెషలిస్టును -తాత్కాలికంగా- బాధ్యతలనుంచి తప్పించారు. అది చాలదని మీడియా కాకిగోల చెయ్యడంతో, ప్రస్తుతం,  సస్పెండ్ అయివున్న దవీందర్‌పై జాతీయ విచారణ సంస్థ అనే ఎన్.ఐ.ఏ. ఈ శనివారం నాడు కేసు పెట్టింది. దవీందర్ పై “చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధ) చట్టం” కింద కేసు పెట్టినట్లు సమాచారం. అంతవరకూ బాగానే వుంది కానీ, ఈ కేసుతో కందిరీగల పుట్టను కెలికినట్లయింది!
జాతీయ విచారణ సంస్థకి ఇప్పుడు తెల్లారింది కానీ, తాను మూడేళ్ళ నుంచీ  హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టులకు ఇతోధికంగా దోహదం చేస్తున్నానని దవీందర్ వెల్లడించడం గమనార్హం. అంతకు మించి ఈ వ్యవహారంలో అనేకమంది సీనియర్ పోలీస్ అధికారుల ప్రమేయం కూడా ఉందని దవీందర్ వెల్లడించడం విచారణాధికారులను మాత్రమే కాదు- మొత్తం జాతినంతటినీ దిగ్భ్రమకు గురిచేసింది! అనగా ఇంతకాలమూ దవీందర్ తనపై అధికారులను మెప్పించే రీతిలో గొప్ప అభినయ కళ ప్రదర్శించాడన్నమాట! సదరు నటనకు పతకాలు, పదోన్నతులూ కూడా దక్కడం విశేషం!! పాపం దవీందర్- పొరబాటున డ్యూటీ చేస్తున్న అధికారులకి దొరికిపోయాడు కానీ, ఎదో రోజున అతగాడి అభినయ కౌశలానికి ఆస్కార్ అవార్డు బహూకరించి ఉండేవారు!

ఏమాటకి ఆమాట- పోలీస్ అధికారులు టెర్రరిస్టులకు సాయం చెయ్యడం ఇదే మొదటిసారి కాదు! ఇండియన్ జేమ్సబాండ్‌గా ప్రశస్తి పొందిన ఒకానొక అత్యున్నత భద్రతాధికారి గతంలో ఇలాంటి వివాదంలో చిక్కుకున్న సంగతి చాలామందికి తెలిసిందే. ఆ తిమింగలంతో పోలిస్తే, దవీందర్ పిత్తపరిగ లాంటివాడు మాత్రమే!
“ప్రతి వ్యవస్థలోనూ ద్రోహులు ఉంటారు. పోలీస్ వ్యవస్థలోనూ ఉన్నారు. వాళ్లలో ఒకడు దవీందర్. అతన్ని ఒక్కణ్ణి చూసి మొత్తం పోలీస్ వ్యవస్థ అంతటినీ శంకించడం న్యాయం కాదు” అంటున్నారు ఫారూఖ్ ఖాన్. జమ్మూ-కాశ్మీర్ గవర్నర్‌కి సలహాదారు- ఆ రాష్ట్ర శాంతిభద్రతల విభాగం అధిపతి అయిన ఖాన్ సాబ్ అలా అనక మరేమంటారు? జమ్మూ-కాశ్మీర్ పోలీస్ శాఖలో మరెందరో ద్రోహులు ఉండేవుంటారని నిజాయితీగా ఒప్పుకున్నందుకు ఖాన్‌ను అభినందించాల్సిందే.
ఇదే ఇతివృత్తంతో గతంలో గోవింద్ నిహలానీ ఓ సినిమా తీశారు. (దాన్ని తెలుగులోనూ తమిళంలోనూ రీమేక్ చేశారు కూడా.) పోలీస్ వ్యవస్థలో ఉన్నట్లే, ఉగ్రవాదుల్లో కూడా “ద్రోహులు” ఉంటారు. వ్యవస్థలకు ద్రోహంచేయడమే టెర్రరిస్టుల పని- అంచేత అలాంటి ఉగ్రవాద వ్యవస్థలోని ద్రోహులు చెయ్యగల హాని తక్కువ. కానీ బలహీనుల్ని కాపాడేందుకే ఉద్దేశించినవని చెప్పుకునే రాజ్యాంగ బద్ధ వ్యవస్థలోని ద్రోహులు చెయ్యగల హాని ఊహాతీతం! ముఖ్యంగా ఏ వ్యవస్థ మీదా ఎవరికీ నమ్మకం లేకుండా చెయ్యగల ప్రమాదం తెచ్చిపెడతారు ఈ బాపతు “ద్రోహులు.”  ఉదాహరణకి, అఫ్జల్ గురు తన న్యాయవాదికి రాసిన ఒక ఉత్తరంలో దవీందర్ సింగ్ పేరు ప్రస్తావనకు రావడం కేవలం కాకతాళీయమేనా? శ్రీనగర్ లోని ఇందిరానగర్ ప్రాంతంలో -ఒకానొక పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని ఆనుకుని- దవీందర్ సింగ్ కట్టుకుంటున్న మూడంతస్తుల మేడ కేవలం కష్టార్జితమేనా? “ఆదాయాలకు మించిన ఆస్తులు సంపాదించడం” గురించి తరచూ ప్రవచనాలు వెలువరించే పత్తిత్తుల్ని -ముఖ్యంగా పోలీసు అధికారుల్ని- ఇక మీదట ఎవడైనా నమ్ముతాడా? ఇలాంటి అనుమానాలను నివారించడం ఇకపై సాధ్యమేనా??
మా చిన్నప్పుడు తెలుగు లిపి కుదురుగా రాయడం నేర్పించేందుకు కాపీ పుస్తకాలు ఉండేవి. వాటిల్లో నీతివాక్యాలు చక్కగా అచ్చయి ఉండేవి. అవి దిద్దితే విద్యార్థుల తలరాతలు బాగుపడతాయని ఆ కాలపు -బతకలేని- బడిపంతుళ్ళ  నమ్మకం. అలా దిద్దిన నీతి వాక్యాల్లో కొన్ని నాకిప్పటికీ గుర్తున్నాయి- “కంచే చేను మేస్తే పంటకెవరు దిక్కు?” అనేది అలాంటి ఓ నీతివాక్యం. దవీందర్ సింగ్ లాంటి పోలీస్ అధికార్ల గురించి తలుచుకున్నప్పుడెల్లా ఆ వాక్యమే గుర్తుకొస్తుంది! అంతకుమించి- మనదేశం పంటచేలో పైర్ల కన్నా ఇలాంటి తిండిపోతు కంచెలే ఎక్కువవుతున్నాయనే వాస్తవం గుర్తుకొస్తే చేదు మింగినట్లు అనిపిస్తుంది!!

-మందలపర్తి కిషోర్

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment