Categories: వ్యాఖ్య

మీకేం కావాలి?

Share

‘చచ్చిన చేపలు, నీటిలో తేలి, వాలుకు కొట్టుకుపోతాయి- కానీ, బతికున్న చేపలు మాత్రమే ఏటికి ఎదురీదగల’వన్నాడో అమెరికన్ హాస్యగాడు. తెలుగునాట- రెండు రాష్ట్రాల్లోనూ- జమిలిగా వ్యక్తమవుతున్న ‘ఎలక్షణాలు’ చూస్తుంటే, ఈ వ్యాఖ్య చటుక్కున స్ఫురించడం సహజం. పసివాడు చెప్పినా, మంచిమాట వినిపించుకోవాలన్నారు పెద్దలు. ఎంత హాస్యగాడయినా, అతను చెప్పిన మాటల్లో చేవుంటే గ్రహించి తీరాల్సిందే మరి!
తెలుగు రాష్ట్రాలు రెండింటి మధ్యనా పోలికల కన్నా తేడాలే ఎక్కువని చెప్పడానికి ఓ వర్గం ఓవర్‌టైమ్ పనిచేస్తోంది. కానీ, ఎలక్షణాల విషయానికి వచ్చేసరికి మాత్రం తెలుగు రాష్ట్రాల మధ్య తేడాలకన్నా పోలికలే ఎక్కువనిపిస్తుంది! కాగా, ‘మనిషి మనిషికీ తేడా వుంది- ఆ తేడాలో ఓ పోలిక వుంది.- తేడా చూస్తే మనుషులమూ- పోలిక చూస్తే కోతులమూ’ అనే పాత సినిమా పాట గుర్తుకొస్తోంది తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఎలక్షణాలు చూస్తుంటే. అంతేకాదు- దేశమంతా పోతున్న దారిలోనే మన తెలుగు రాష్ట్రాలు సైతం ‘ఆ విధంగా ముందుకు పోతావున్నా’యనే విషయం కూడా అర్థమయిపోతుంది తాజా ఎలక్షణాలను చూస్తుంటే.
ఒక్క ఉదాహరణ సాయంతో నేను చెప్పిన విషయాన్ని రుజువు చేసేందుకు ప్రయత్నిస్తా-
దాదాపు, అర్ధ శతాబ్దం కింద- కచ్చితంగా చెప్పుకుంటే 55 ఏళ్ళ కిందట- మన దేశంలో వారసత్వ రాజకీయాలు ఏదో మోతాదులో మొదలయ్యాయి. మరో పదేళ్ళు గడవనిచ్చి, ఇందిరమ్మ ఇదే వారసత్వ రాజకీయాలను మోతాదు పెంచి ప్రయోగించింది. అది కాస్తా వికటించింది! తన చిన్న కొడుక్కి దేశాధికారాన్ని ధారపోయాలనుకున్న ఆ తల్లిమనసు ఎంతకైనా తెగించడంలో విడ్డూరం ఏముంది? ఎవరో అన్నట్టుగా ప్రేమే గుడ్డిది కదా- తల్లిప్రేమ చెవిటిది కూడాను. మంచి సలహాలు చెప్తే అవి ‘అమ్మ’ చెవిన పడకపోవడంలో వింతేముంది? అందుకే, సదరు ‘అమ్మ’, మన రాజ్యాంగ చట్టాన్ని చింపి పోగులుపెట్టి పడవలూ, కత్తిపడవలూ, రాకెట్లూ, విమానాలూ చేసుకోమని తన చిన్నారిపట్టి చేతికిచ్చింది. ఫలితంగా ఏం జరగాలో అదే జరిగింది! దేశం నియంతృత్వం ఊబిగుంటకి బెత్తెడు దూరంలో ఆగి, తిరిగి సొంత బ్రాండ్ ప్రజాస్వామ్యానికి తిరుగుప్రయాణం కట్టగలిగింది. అత్యంత విశాల హృదయులయిన మనవాళ్ళు ‘అమ్మ’ను ఉదారంగా మన్నించి, మూడేళ్ళలోనే తిరిగి గద్దెనెక్కించారు. సరే, సొంత గార్డులే ఆమెని పొట్టనపెట్టుకుని ఆ కథకి అనూహ్యమయిన ముగింపునిచ్చారు! కాగా, ఆ నేపథ్యంలో అమ్మ స్థానాన్ని కొడుక్కి కట్టబెట్టలనుకోవడంలోతప్పేముంది? అదే పని చేశారు మనవాళ్ళు. అతనోసారి గెలిచాడు- మరోసారి ఓడాడు; గెల్చినప్పుడు, తాతగారు కట్టించిన ఇంటిని తనకి నచ్చినట్టుగా మార్చిపారేశాడు. ఓడినప్పుడు ఆ మార్పుల వల్లనే ఇంట్లోకి గాలీవెల్తురూ రావడంలేదని విమర్శించాడు. పిల్లలన్నాకా ఆ మాత్రం పిల్లిమొగ్గలు వెయ్యకుండా ఉంటారా చెప్పండి? పిల్లలు మాత్రమే పల్టీలు కొడితే భరించేవాళ్ళు జనం. కానీ, దేశం హోల్ మొత్తంగా పిల్లిమొగ్గలు వేస్తూనే వుంది అప్పట్నుంచీ. పాపం, అతని మాటల్లోని ద్వైతం, సామాన్యజనం పాలిట అద్వైతంగా మారింది. అందులోని అంతస్సారం వివరించే లోపే, ముష్కరులు అతగాణ్ని దిగమింగేశారు. గత్యంతరం లేక, మనవాళ్ళు అతగాడి సతీమణికి అతని స్థానం కట్టబెట్టారు. ఆమె ఓ లెక్కల మేస్టార్ని కుర్చీలో కూర్చోపెట్టి ‘దేశమనియెడి దొడ్డ గృహమును’ ఒంటిచేత్తో చక్కబెట్టుకొచ్చింది. సరే, ఏదో గృహిణీ ధర్మం పాటించిందనుకుంటే, కొడుకునూ కూతుర్నీ కూడా వాయిదా పద్ధతుల్లో వారసత్వం కుర్చీ ఎక్కించే పన్లో బిజీ అయిపోయిందావిడ! ఆ కుటుంబం నుంచి దేశం నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోలేదు. పైపెచ్చు, అక్కర్లేని తప్పుడు పద్ధతులు మాత్రం ఒంటబట్టించుకుంది.
ఈ మూడు దశాబ్దాల కాలంలో దేశంలో వచ్చిన అతిపెద్ద మార్పు ఒక్కటే- అదేమిటో చిత్తగించండి!
‘లుట్యేన్స్ దిల్లీ’ అనే రాచవాడలో పుట్టిన రాజవంశీకులే కాక, నాలుగు బర్రెలూ- అరడజను కర్రలూ- రెండెకరాల నేలా వున్న ప్రతి ఒక్కడూ తన వారసుణ్ణి రాజకీయ రంగంలోకి దింపడం మొదలెట్టాడు. అవును మరి, వారసత్వ రాజకీయ వ్యాధి ఎవర్ని మాత్రం వదిలిపెడుతుంది కనక? అంటువ్యాధా మజాకా? దిల్లీలో మొదలయి, పల్లెదాకా పాకిపోయింది ఈ వ్యాధి! వాడవాడనా, వీధివీధినా ఇదే వ్యాధి! మన రాజకీయ వ్యవస్థను గుర్తుపట్టడానికి ఇప్పుడు ప్రపంచమంతా ఈ గీటురాయినే ఉపయోగిస్తోందంటే, చాలదూ! ఈ అంతర్జాతీయ గీటురాయిని కాదని ఎవరు మాత్రం బతికి బట్టకట్టగలరు? మరీ ముఖ్యంగా, పైవాణ్ణి యథాతథంగా అనుకరించడంలో దిట్టలయిన మన తెలుగు వీరులు మేం నాలుగాకులు ఎక్కువే చదివామంటున్నారు. ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంట్ లాంటి స్థానాలకే కాదు- గ్రామ పంచాయతీ సభ్యత్వం వరకూ సకల పదవులకూ మొట్టమొదటి అర్హత వారసత్వమే!
మరొక్కసారి మొదటికొద్దాం!
అమెరికన్ హాస్యగాడు డబ్ల్యూ.సీ.ఫీల్డ్స్ చెప్పి మాటల్లోని ‘చచ్చిన చేపలు’ ఈ వారసత్వ వ్యాధి పీడితులే! అవి వారసత్వం నీటివాలులో హ్యాపీగా కొట్టుకుపోతాయి! ఏటినీటికి ఎదురీదడమనేది వాటి ఊహకి అందని విషయం! పైపెచ్చు, అలా ఎదురీదేవాళ్ళు బుర్రతక్కువ బుద్ధిమాంద్యులని ఈ చచ్చిన చేపల దృఢ విశ్వాసం. మా తాతలూ తండ్రులూ నేతులు తాగారు- మా మూతులు వాసన చూడమంటున్నాయి చచ్చిన చేపలు కొన్ని! మా ‘హెరిటేజ్’ గురించి మీకు బాగా తెలుసు- తెలియదన్నారంటే, మా మావ చేత ఏడాదికి రెండు ‘భయోప్రిక్స్’ తీయించి, మీ తుప్పు వదిలిస్తామని బెదిరిస్తున్నాయి మరికొన్ని చచ్చిన చేపలు! నా కటౌట్ కన్నా పెద్ద కటౌట్ నా వెనకాల నక్కివుంది- కావాలంటే, చూసుకోమని గుసగుసలాడుతున్నాయి కొన్ని చచ్చిన చేపలు! ఈ వసుధలో ఉన్న అన్ని పదవులూ మా కుటుంబంలోనే పందేరం చేసుకుంటూ, ‘వసుధైవ కుటుంబకం’ అనే భావననే బకధ్యానం చేస్తున్న కుటుంబం మాది అని శంఖారావం చేస్తున్నాయి ఇంకొన్ని చచ్చిన చేపలు! ఇక, దేశంలోని అత్యంత పురాతన రాజకీయపక్షానికి చెందిన విధేయులు పుడుతూనే చచ్చిన చేపలు! వాటికి బతకడమంటేనే తెలీదు- ఏటికి ఎదురీదడమంటే ఏమిటో, అందులోని మజా ఏమిటో తెలియకపోవడంలో వింతేముంది?
ఇంతకీ, మనకేం కావాలి?
మనల్ని ఎవరు పాలించాలి?
నీటివాలుకు కొట్టుకుపోయే చచ్చిన చేపలా? ఏటికి ఎదురీదే చేవున్న చేపలా??
ఈ విషయం తేల్చుకోవాల్సింది మాత్రం మనమే!

– మందలపర్తి కిషోర్


Share

Recent Posts

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

10 mins ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

2 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

3 hours ago

ఆ కమెడియన్ లక్ మామూలుగా లేదు.. ఒకేసారి డబుల్ జాక్‌పాట్!

  ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…

3 hours ago

కరణ్ జోహార్‌లోని మరో చెడు గుణం బట్టబయలు.. ఇలాంటి వారు ఉంటే సినీ ఇండస్ట్రీ ఏమైపోవాలి?

  బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్‌ అంతటా పెంచేందుకు కరణ్…

3 hours ago

రాజమౌళి బాటలో డైరెక్టర్ పూరి జగన్నాథ్..??

ప్రస్తుతం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమొగుతున్న సంగతి తెలిసిందే. "బాహుబలి 2", "RRR" సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా ₹1000 కోట్లకు…

3 hours ago