NewsOrbit
వ్యాఖ్య

వన్దే మాతరమ్!

నాకో అమ్మమ్మా, బామ్మా ఉండేవారు- వాళ్ళ చేతుల్లోనే నేను పెరిగాను.
నాకో అమ్మ ఉండేది- ఆమె దయవల్లే నేను పుట్టి పెరిగి ఇక్కడున్నాను.
నాకు “సొంత”అక్కల్లేరు.
కానీ, మమ్మల్ని పెంచిపెద్దచెయ్యడంలో మా అమ్మకు కుడిచెయ్యిగా నిలబడిన “అక్కయ్యగారు” ఉన్నారు.
మా ఇంట్లోనే పెరిగి పెద్దదైన మా పిన్ని కూడా నాకో అక్కయ్య లాంటిదే-
నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు- వాళ్లంటే నాకు చాలా ఇష్టం.
ముఖ్యంగా మా చిన్న చెల్లెలు ఓ డాక్టరు.
ఇవాళ నన్నిలా నిలబెడుతున్నది ఆమె వైద్యమే!
ఇక, 36 ఏళ్లుగా నాతో కలిసి బతుకుతున్నదీ, నన్ను బతికిస్తున్నదీ మా ఆవిడే!
నాకో కూతురుంది- తనంటే నాకు ఎంతో మమకారం!
తనకడుపున పుట్టిన ఓ మనవరాలూ ఉంది- అది నా ప్రాణం!
ఇలా నా జీవితం, గత అయిదు తరాలుగా, ఆరు దశాబ్దాలుగా ఆడవాళ్లతోనే ముడిపడివుంది. వాళ్ళే , నా జీవితాన్ని ఆలించి, లాలించి, పాలించి, శాసించి, ఊగించి,  ఊపిరులు ఊదిన వాళ్ళు! అందుకే రేపటి నుంచీ మొదలయ్యే కొత్త సంవత్సరాన్ని నేను నాకు బతుకునిచ్చిన స్త్రీలకు- తల్లులూ, అక్కలూ, చెల్లులూ, కూతుళ్ళూ, మనవరాళ్లకు- అభినందనలు చెప్పడంతోనే మొదలు పెట్టాలనుకుంటున్నాను. (ఆవిడ గురించి మర్చిపోలేదు; మాటలలో చెప్పే వందనమూ కాదు – బంధనమూ కాదు మాది!).
ఎదో ఇది నా ఒక్కడి కథే అన్నట్టు చెప్పానే గానీ, మనందరి -ముఖ్యంగా మీసాలు మెలేసే మగానుభావులందరి- కథా ఇదే! అంచేతనే, ఈ కథను సొంత కథగానో, సొంత సొద గానో పొరబడరాదని మనవి!
మన కౌటుంబిక సాంసారిక జీవితాలను “ఆలించి, లాలించి, పాలించి, శాసించి, ఊగించి,  ఊపిరులు ఊదే” స్త్రీలకు మన నిజజీవితాల్లో ఉండే “ప్రాముఖ్యం” మీకు తెలియనిదేం కాదు! దేవగణంలో గ్రామ దేవతలకు ఉండే స్థానం లాంటిదే ఇది కూడా. అందులో భక్తి కన్నా భయమే ఎక్కువ. అమ్మోరికి కొలుపులు చెయ్యకపోతే ఊరిమీద “విరుచుకుపడి” తుడిచి పెట్టేస్తుందన్నదే ఆ భయం. “ఆడ దాయి” వీధిన పడితే ఏయే చీకటికోణాలు వెలుగులోకి వస్తాయో అనే భయంతోనే ప్రతి పనికీ “లేడీస్ ఫస్ట్!” అంటూ తొలి మొక్కు తీర్చుకోవడం. ఆ భయంతోనే, సంసారంలో చదరంగానికి  “ఆడదే ఆధారం!” అని చెప్పి సూపర్ హిట్లు కొట్టి, డబ్బుమూటలు మాత్రం మగానుభావుల జేబుల్లోనే నింపుకోవడంలోని వాణిజ్య సూత్రం మనకి అర్థం కానంత గహనమైందా?
అయితే, ఈ భయం మన మగానుభావులు క్రౌర్యానికి  ఒడిగట్టకుండా ఆపగలుగుతోందా? లేదని చెప్పి నిర్భయ, దిశా, ఉన్నావ్ తదితర దురంతాలు చాటిచెప్తూనే ఉన్నాయి. ఎప్పుడో పౌరాణిక కాలంలో ద్రౌపదికి జరిగిందని చెప్పే వస్త్రాపహరణం మన పొరుగునున్న తమిళనాట -సాక్షాత్తూ చట్టసభలో, అదియున్నూ ఒకానొక మంత్రిమహోదయుల చేతుల మీదుగా-  జరగడం మనకి తెలిసిందే కదా! అంతకన్నా ఒక దశాబ్దం ముందే ఫూలన్ దేవి అనే బందిపోటు ముఠా సభ్యురాలిని ఓ బందిపోటు ముఠా నాయకుడు నడివీధిలో ఇదే పద్ధతిలో అవమానించిన సంగతి ఏ శేఖర్ కపూరో సినిమా తీస్తే తప్ప సామాన్య జనానికి తెలియని పరిస్థితి ఇక్కడ ఏర్పడి వుంది. అదే, ఫూలన్ దేవి పార్లమెంటు సభ్యురాలు అయిన తర్వాత సైతం ఆమెని నడివీధిలో కాల్చి చంపేసిన విషయం మనకు తెలుసు.
ఈ మధ్యనే ఓ పెళ్ళిలో పాత మిత్రుడు ఒకతను -దశాబ్దాల తర్వాత- కనిపించాడు. అతను నల్లకోటు వేసుకుని కోర్టులలో వాదించలేదు కానీ న్యాయ శాస్త్రం చదువుకున్నాడు. మన చట్టాల్లో పురుషాధిక్యత ఎంత నగ్నంగానూ, భయోద్విగ్నంగానూ   నర్తిస్తూ దర్శనమిస్తుందో సోదాహరణంగా వివరించాడు నా మిత్రుడు. ఉదాహరణకి, అతను పని చేసే ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఒకానొక ఉద్యోగిని మరణిస్తే ఆ ఉద్యోగం కూతురికి రాదట- సదరు ఉద్యోగం మృతురాలి అల్లుడికి మాత్రమే వచ్చును! సదరు దశమగ్రహం ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత, తన జీవికకు వనరుగా ఉపయోగపడిన స్త్రీకి (అనగా సదరు మృతురాలి కుమార్తెకి) విడాకులిచ్చినా ఉద్యోగానికేం ఢోకా ఉండదట కూడా! ఇలాంటివే మరికొన్ని విషయాలు చెప్పిన నా మిత్రుణ్ణి ఆ వివరాలన్నీ పత్రికల్లో రాయమని నేను కోరాను- అంచేత ఈ విషయం ఇక్కడితో ముగిస్తున్నా!
శుభమా అని కొత్తసంవత్సర శుభ అభినందనలు చెప్పుకుంటూ ఈ గొడవలన్నీ ఎందుకని ముక్కువిరిచే వాళ్ళు కొందరుంటారని నాకు తెలుసు! “అద్దం చెప్పదు అబద్ధం- అది నిజానికెపుడూ నిబద్ధం” అని నేనే ఓ సందర్భంలో  రాసిన మాటలు గుర్తు చేస్తున్నాను వారికి. కాలాన్ని మించిన అడ్డం మరొకటి ఏముంది? ఆ కాలానికి గుండెకాయ గడియారం- దాని “జినోమ్” పత్రిక క్యాలండర్.

మన మగానుభావుల మొహం ఎంత అందంగా ఉందో చెప్పే వాక్-స్వాతంత్య్రం కూడా లేని మన మహిళలు ఎక్కడ పూజలు అందుకుంటున్నారో, అక్కడే దేవతలు నివసిస్తారట. (“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః”) మన సమాజాలు దేవతలకు నెలవులుగానూ, కొలువులు గానూ ఉండాలని కోరుకోవడంలో అభ్యంతర కరమైన విషయం ఏమీ లేదు. అయితే, అంత కన్నా ముందు, ఈ సమాజం ముందు మానవ మాత్రులు -ముఖ్యంగా మన అమ్మలూ, అక్కలూ, చెల్లెళ్ళూ, కూతుళ్ళూ- నిర్భయంగా నివసించడానికి అనువుగా ఉండాలని కోరుకోక పోవడం మాత్రం క్షంతవ్యం కాదు!

 ఈ కాలమ్ చదివిన తర్వాత, ఒక్కసారి చాసో గారు రాసిన “బొమ్మల పెళ్లి” కథానిక చదవాల్సిందిగా పాఠక మహాశయులకు నా విన్నపం!

మందలపర్తి కిషోర్

 

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment