మన పోతులూరి..మన వెలుగు దారి!

మొన్నామధ్య కర్నూలులో జరిగిన పోతులూరి వీరబ్రహ్మం సభలో నేను మాట్లాడుతూ ఈ కాలంలో వీరబ్రహ్మం వుంటే గుడిలో కాదు, జైల్లో వుండేవాడని అన్నాను. చాలా మంది చప్పట్లు కొట్టారు. అంటే నా మాటల్లోని అంతరార్థాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. పోతులూరి వీరబ్రహ్మం ఎవరికి ఎంతటి ప్రమాదకరమైన విప్లవకారుడో వాళ్ళు గ్రహించారు. కాలం గడిచే కొద్దీ  కొందరి ప్రాసంగికత ఇంకా ఇంకా ఎక్కువవుతూ వుంటుంది. మతం దేశాన్ని కాల్చుకు తినే రోజుల్లో ఉన్నాం. నాలుగైదొందల ఏళ్ళ క్రితమే బ్రహ్మం,  ఆనాటి సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొడుతున్న మతాన్ని అత్యంత సాహసోపేతంగా ఎదుర్కొన్నాడు. హిందూ మతంలోనే శైవం..వైష్ణవం కుమ్ములాటలు కొమ్ములు తిప్పుతున్న కాలమది. మరోపక్క అప్పుడప్పుడే హిందూ ముస్లిం ఐక్యతకు పునాదులు వేయాల్సిన సందర్భం. ఆ చారిత్రక ఆవశ్యకతల సంధి యుగంలో వీరబ్రహ్మం విప్లవాత్మకమైన పాత్ర పోషించాడు.

సాంఘికంగా..ఆర్థికంగా..ఆధ్యాత్మికంగా పెత్తనం చెలాయిస్తున్న వర్గాలను అతుల్యమైన తన మేధస్సుతో, అనితరసాధ్యమైన సృజనాత్మక శక్తితో, వజ్రతుల్యమైన సంకల్పంతో ఎదిరించాడు. వాస్తవానికి పోతులూరి వీరబ్రహ్మం దళిత బహుజన కులాలకు ఐకాన్‌గా నిలవాల్సిన నిజమైన యుగపురుషుడు. వేమన ఒక్కడే నిజమైన కవి అంటూ పొగుడుతూ వేమన కంటె చాలా ముందుకు వెళ్ళి రానున్న  సంస్కరణోద్యమాలకు  హేతుబద్ధమైన పునాదులు తీశాడు. సంఘ సంస్కరణే ప్రధానంగా రచనలు చేసిన వారిని యుగపురుషులుగా మనం ఎవరిని కీర్తిస్తున్నామో వారి కంటె వందల ఏళ్ళ క్రితమే పోతులూరి చాలా ముందున్నాడు. సాహిత్య విలువల్లో కూడా ఏమాత్రం వారికి తీసిపోడని నిర్ద్వంద్వంగా చెప్పొచ్చు.  కులాన్నే కాదు..మతాన్నే కాదు..సకల ఆధిపత్యాలనూ ధిక్కరించిన వీరుడు వీరబ్రహ్మం. అందుకే అతణ్ణి తెలివిగా దేవుణ్ణి చేసి మఠంలో కూర్చోబెట్టారు. అతనొక మాంత్రికుడిగా, మార్మికుడిగా కాలజ్ఞానం తెలిసిన  దేవుడిగా చేసి మఠంలో ప్రతిష్టించారు. ఆయన చుట్టూ నాలుగు గోడలు కట్టి, పైన గోపురం పెట్టి గుడి కట్టేశారు. బుద్ధుడి విషయంలోనూ ఇదే జరిగింది. అంతే ఒకసారి దేవుడైపోయిన తర్వాత అతని ఆలోచనలతో..అతని బోధనలతో..అతను చూపిన మార్గాలతో జనానికి పని వుండదు. మూఢంగా మూర్ఖంగా అతనికి పూజలు చేయడమే వుంటుంది.

తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం అలా ఎంతమందినైనా దేవుళ్ళుగా మార్చేయగల మాంత్రికులు మనవాళ్ళు. వాస్తవానికి ఎవరైతే వీరబ్రహ్మాన్ని సొంతం చేసుకోవాలో ఆ బహుజనులు కూడా జరిగిన కుట్రలో భాగమైపోయారు. అలాంటి సాంఘిక మహావిప్లవకారుణ్ణి ఒక కులానికి కట్టి పారేయడం కూడా  కుట్రే. అతడిని  ఓన్ చేసుకున్నామని చెప్పుకుంటున్న కులం వారు తమకు తెలీకుండానే ఆ ట్రాప్ లో పడిపోయారు.  ఎవరెవరు ఏయే వివక్షలకు గురయ్యారో ఆయా వర్గాల సామూహిక శక్తికి తిరుగులేని నాయకుడు వీరబ్రహ్మం.  ఇంకా అదే ఉచ్చులో చిక్కుకుపోయి వీరబ్రహ్మం దేవుడని, అలాంటి దేవుడు పుట్టిన కులం మాదని వాదనలకు, దాడులకు దిగుతున్న వారు ఇకనైనా స్పృహలోకి రావాలి. సమస్త ఆధిపత్యాలపై పోరాడే సమూహాలకు ఉమ్మడి ప్రతినిధిగా వీరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవాలి. ఇకనైనా వీరబ్రహ్మం మీద సహేతుకమైన పరిశోధనలు జరగాలి. ఈ వెలుగులో దళిత రచయిత్రి, పరిశోధకురాలు వినోదిని చేసిన వ్యాఖ్యలు గుర్తించాలి. అర్థంపర్థం లేని దాడులకు వితండ వాదనలకు దిగితే అది అజ్ఞానమే కాని కాలజ్ఞానం కాదు, కానేరదు. ఆయనపై  పదకొండు పుస్తకాలను ప్రముఖ సాహిత్యవేత్తలు, పరిశోధకులతో రాయించి ప్రచురించిన ప్రజాశక్తి వారిని మనసారా అభినందిస్తున్నాను. అనేకానేక కారణాల రీత్యా పోతులూరి మనకిప్పుడు మరీ మరీ అవసరం. కర్నూలు సభలో పోతులూరి మీద నేను చదివిన కవిత ఇది.

||మన పోతులూరి..మన వెలుగు దారి||

కాలానికి మరకలంటవు/ కాలపురుషులకూ అంతే/ అందరూ గిట్టడానికే పుడతారు /కొందరు ఎప్పుడూ పుడుతూనే వుంటారు

జ్ఞానం కోసం కాలం అర్రులు చాచినప్పుడు/ ఆకాశం తాళపత్రం మీద సూర్యుడు అక్షరమై ఉదయిస్తాడు-

అతని స్మరణ కూడా కాంతి సంగీతమే/ మూఢత్వమో అంధత్వమో

కులమత ఛాందస బంధుత్వమో/ మనిషిని చీకటి లోయల్లోకి తోసేసినప్పుడు

వెలుగు వలలు భుజాన వేసుకుని ఒకడు వస్తాడు / తత్వాలతో  మన కళ్ళు తుడుస్తాడు-

యుగాలు గడుస్తాయి తరాలు మారతాయి/ రాజ్యాలు కూలతాయి రాబందులు రాలతాయి

మళ్ళీ మళ్ళీ మనిషి మళ్ళీ మళ్ళీ మనిషికి దగ్గరే వుంటూ దూరమవుతూ  వుంటాడు

అప్పుడు అతను మళ్ళీ పుడతాడు/ కాలం కలల గర్భంలో అతను నిత్యం కదులుతూనే వుంటాడు-

మన నడక తప్పంటాడు.. మన నడత తప్పంటాడు../అసలు మన దారే తప్పంటాడు

చీకటికే అలవాటుపడ్డవాళ్ళం కదా ఆ వెలుగును పోల్చుకోవడం కొంచెం కష్టమే మరి-

అందుకే అతను మనకు ముందూ వెనకా వుండి / మనల్ని కదిలిస్తుంటాడు..మనల్ని అదిలిస్తుంటాడు-

శతాబ్దాల మీదుగా కాలంతో పాటు నడుస్తూనే వున్నాడు

మనం అతన్ని అందుకునే దాకా /మనకంటే ముందు పరుగులు తీస్తూనే వుంటాడు-

ఏలికలే జనం మధ్య చీలికలు తెస్తున్న కాలం కదా/ ప్రభువులే విద్వేషాల విషం పంచుతున్న రోజులు కదా/నెత్తురు కురిసే దారుల్లో మానవత్వపు అత్తరు  జల్లే/ మహిమాన్వితుడు అతడు..అతడు కావాలి

ఇప్పుడతను మరీ మరీ కావాలి/ కాలమూ జ్ఞానమూ సంగమ స్థానము అతనే/ కాలజ్ఞాన ఖడ్గ చాలనమూ అతనే/  అతని స్మరణే  సంస్కరణ/ అతని జాతరే జ్ఞానం/  మన తెలుగు వేగుచుక్క..

మన పోతులూరి..మన వెలుగు దారి

డా.ప్రసాదమూర్తి