సాంస్కృతిక విప్లవం వైపు సాగాలి!

మీడియాలో చాలా కాలంగా పనిచేస్తున్న ఒక మిత్రుడు మొన్న ఫోనులో మాట్లాడుతూ అసలు దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకింత అలజడి? అని అడిగాడు. తెలిసి అడిగాడా? తెలియక అడిగాడా? నా ఉద్దేశం తెలుసుకోవాలని అడిగాడా? నాకు అర్థం కాలేదు. అతనితో మాట్లాడి ఫోను పెట్టేశాక, తీరుబడిగా ఆలోచిస్తే చాలా కలవరం కలిగింది.  దేశంలో ఇప్పుడు జరుగుతున్న ఆందోళన అంతా ఏదో ముస్లింలకు సంబంధించిన గొడవగా చాలామంది భావిస్తున్నారు. కమ్యూనిస్టులు..సామాజిక కార్యకర్తలు వారితో కలిశారు తప్ప మరేమీ లేదని బాగా చదువుకున్న వాళ్ళు..మేధావులనుకున్న వాళ్ళు కూడా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మన మిత్రులే ఎందరో ఆ అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. మన ఇళ్ళల్లో మన బంధువుల్లో చాలా మంది ఈ విషయంలో అంతే నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

దేశ విభజన మరోసారి మరో రూపంలో జరుగుతోందా? ఈ ఘనకార్యంలో మన ఏలిన వారు విజయం సాధిస్తున్నారా? ఇలాంటి ఆలోచనలే మనసును తొలుస్తున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? దీనికి కారణాలేంటి? చాలా రోజులుగా గుండెను పట్టి పీడిస్తున్న ప్రశ్న ఇది. సమాజంలో ఒక వర్గం పట్ల మిగిలిన వర్గాలకు ఎందుకింత ఉదాసీనత? ఎందుకింత నిర్లక్ష్యం? ఎందుకింత ద్వేషపూరిత దృష్టి? మనమంతా కలిసి ఆలోచించుకోవాల్సిన విషయాలివి. ఇదంతా దేశాన్ని ఒక చిన్నభాగంగా, ఒక పెద్ద భాగంగా చీల్చి, చిన్ని భాగాన్ని బలిపశువుగా చేసి పెద్ద భాగం మద్దతుతో అధికారం చలాయించాలన్న స్వార్థపర శక్తులు చేస్తున్న ప్రయత్నాలుగా అర్థం చేసుకోవడానికి పెద్ద మేధస్సు ఏమీ అవసరం లేదు. దేశమంటే మనుషులని..మనుషులంటే అన్ని వర్గాల అన్ని మతాల అన్ని కులాల అన్ని భాషల అన్ని ప్రాంతాల వారని అర్థం చేసుకునే హృదయం వుంటే చాలు. మరి ఆ హృదయం ఇప్పుడు చాలా మందిలో ఎందుకు కొరవడింది?

ఈ దేశంలో కమ్యునిస్టు పార్టీలు ఏం సాధించాయంటే ఒక విషయం మాత్రం ఢంకా భజాయించి చెప్పొచ్చు. ఇప్పుడనేక  పార్టీల్లో.. సంస్థల్లో..మీడియాలో..కుల సంఘాల్లో..రకరకాల దారుల్లో చీలిపోయి ఉన్నా, ఎందరెందరి గుండెల్లోనో లౌకిక భావన నిప్పులా వెలుగుతూనే వుందంటే అదంతా కమ్యునిజం ఇచ్చిన ప్రాణవాయువు పుణ్యఫలమే. ఎన్నడూ ఎరగనంత విపత్కర పరిస్థితిని ఇప్పుడు దేశం ఎదుర్కొంటోంది. ఈ విషకాలపు ప్రళయాన్ని గుండె నెత్తురులు అర్పించి అయినా అడ్డుకోవాలని ముందుకొస్తున్న వారంతా ఆ ప్రాణవాయువును పీలుస్తున్న శక్తులే. అందుకే కమ్యునిజానికి..కమ్యునిస్టు పార్టీలకూ శిరసు వంచి నమస్సులు అర్పించాలి.

అదే సమయంలో కమ్యునిస్టులు అలక్ష్యం చేసిన సాంస్కృతిక విప్లవాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి. వర్గపోరాటమే సర్వస్వమనుకుంటూ అన్ని అంశాలూ అందులో అంతర్భాగమే అనుకుని, ఆచరణలో సాంస్కృతిక అంశాన్ని దూరం పెట్టిన  ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాము. చైనాలో ఒక సామెత ఉంది. ముప్పయేళ్ళ క్రితం మొక్క నాటితే ఇప్పుడు ఫలాలు తినేవాళ్ళం. అలాగని చింతిస్తూ  కూర్చుంటే లాభం లేదు. కనీసం ఇప్పుడైనా మొక్క నాటుదాం. ముందు తరాలైనా పళ్ళు తింటారు అన్నది  చైనా వారి ముందు చూపు. కనీసం ఇప్పుడైనా మనం మొదలు పెడదాం. మన కుటుంబాల నుంచి ప్రారంభించి స్నేహితుల నుంచి సమాజంలో సమూహాల వరకూ సాంస్కృతిక ప్రక్షాళన సాగించాలి. దారి చాలా కష్టమైనది. అందరినీ సమానంగా ప్రేమించాలన్న సూత్రం మాటలు చెప్పినంత సులభం కాదు. ముళ్ళ దారుల మీద నడవాలి. ఇనప కంచెలు దాటాలి. కత్తుల ప్రవాహాలు ఈదాలి. శతాబ్దాలుగా రక్తం ధారపోసి పెంచుకున్న సహజీవన వనాన్ని ధ్వంసం చేయడానికి కొన్ని గంటలు చాలు. ఎవరికి వారే ఈ బాధ్యత నెత్తిమీద వేసుకోవాలి. ఎవరిని ఎవరు ఎందుకు ద్వేషిస్తున్నారో తెలియని గందరగోళం నుండి మన వారిని మనమే రక్షించుకోవాలి. ఇప్పుడు విప్లవమంటే మనుషుల్ని మనుషుల వైపు మళ్ళించడమే. ప్రేమ..శాంతి..స్నేహం..సహజీవనం పునాదులై ఇళ్ళు లేచి జనావళికి మోదం కూర్చే స్వప్నమే నిజమైన విప్లవం. అకారణ ద్వేషాల నుంచి అనంత ప్రేమ లోకాల దిశగా మనల్ని..మన తోటివారినీ నడిపించడమే ఇక ఇప్పటి తక్షణ విప్లవ కర్తవ్యం. దీని కోసం అందరూ తమ స్వార్థాలు వీడాలి. పార్టీల సంఘాల సంస్థల వ్యక్తుల ప్రయోజనాలు పక్కన పెట్టి సామూహిక దేశ  ప్రయోజనాల మీదే దృష్టి సారించాలి. సొంత లాభం దేశ సమైక్యతలోనే ఉందన్న జ్ఞానోదయం కలగాలి. బింకాలు..పట్టింపులు..విభేదాలు..అన్నీ మరచి అందరూ ఒక్కటైతేనే తప్ప దేశాన్ని కాపాడుకోలేం. లేదంటే అమరుల కలలు మన కళ్ళ ముందే కాలిపోతాయి. వారి త్యాగాలు పేకమేడల్లా కూలిపోతాయి. తస్మాత్ జాగ్రత్త.

 

    డా.ప్రసాదమూర్తి