NewsOrbit
వ్యాఖ్య

యుగపురుషులకూ సెగ తప్పదా..?

ఎవరు ఏమనుకున్నా కొన్ని మాటలు చెప్పాలి తప్పదు. మొన్నామధ్య ఒక మిత్రుడు ఫోన్ చేసి హెచ్చరించాడు. కొంచెం దూకుడు తగ్గించు అన్నాడు. రాజ్యంతో సఖ్యంగా ఉంటే పదవులు..పీఠాలూ..అవార్డులూ వగైరా వగైరా..అని ఏదో సలహా ఇవ్వబోయాడు. అవేవీ అవసరం లేదన్నాను. వాటి మాట అలా వుంచి కొంచెం జాగ్రత్త అన్నాడు. మొన్న ఎన్నికల అనంతరం నేను రాసిన ఒక వ్యంగ్య కవితాత్మక రైటప్ చదివి అతనలా చెప్పాడు. నా మేలు కోరే చెప్పాడు కాబట్టి అతని మీద నాకే కోపం లేదు. రైట్ వింగ్ శక్తులు మరింత విజృంభించే ప్రమాదం ఉంది అని అతని హెచ్చరిక. నిజమే . అయితే అలాంటి ప్రమాదం పట్ల భయం కంటె, ఆ ప్రమాదాన్ని ఉమ్మడిగా ఎదర్కోవలసిన శక్తులే చీలికలు పేలికలుగా చెల్లాచెదురై పోతున్న పరిణామాలను చూస్తుంటే కలిగే బాధే ఎక్కువగా వుంటోంది. మన అక్షరాల మీద..మన ఆలోచనల మీద..మన మనోవాక్కాయ కర్మల మీద ఎలాంటి నిషేధాల ఇనప వలలు ఎవరు పన్నుతున్నారో తెలుసు. ఇలాంటి సమయంలో ప్రగతి కాముకులు, ప్రజాస్వామ్య వాదులు, కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, దళితబహుజన వాదులు, విప్లవ వాదులు అందరూ కులాతీత మతాతీత భాషా ప్రాంతాతీతంగా కలిసి భుజం భుజం కలిపి అడుగులు ముందుకు వేయాల్సిన తరుణం ఆసన్నమైందని గమనించాలి. కానీ మనం మాట్లాడే మాటలకు ఏలిన వారి నుండి ఎదురయ్యే దాడి కన్నా మనవారనుకున్న వారికి మనం  చెప్పే సూచనల పట్ల మనవారి నుంచి విరుచుకుపడే ప్రతిస్పందన గురించే ఎక్కువ భయం కలుగుతోంది. భౌతికంగా జరిగే దాడుల కంటే వీరి భాషా ఫాసిజం మనల్ని అత్యంత ఆందోళనకు గురిచేస్తుంది. ఎర్రతోలు కప్పుకున్న కాషాయమనో..అంబేడ్కరిస్టు ముసుగులో మనువు అనో..నిమ్నవర్ణంలో పుట్టిన అగ్రవర్ణ అహంభావి అనో..గొప్ప లౌక్యమనో..గొప్ప సౌకర్యవాది అనో..ఇలా ఏవేవే ముద్రలు మన మీద టపటపా గుద్ది పారేస్తారు. అంతే, దెబ్బకి భయపడి అన్నీ మూసుకుని కూర్చోవాలి. పోనీ మనకెందుకులే అని మౌనం వహిస్తే ఇక అంతకు మించిన కుట్ర లేదని ఒక్క ప్రకటనతో నిన్ను నిలువునా పాతరేసేస్తారు. ఇలాంటి వారికి భయపడితే చరిత్రలో కందుకూరిలాంటి వారు పుట్టేవారా? ఫూలే అంబేడ్కర్ లాంటి వారు చరిత్రపుటల్లో అడుగు పెట్టావారా? అలాంటి ఉద్యమకారుల్ని స్ఫూర్తిగా తీసుకుని సమయం వచ్చినప్పుడు మన మాట మనం చెప్పాల్సిందే.  తప్పదు కొన్ని సందర్భాలలో నోరు విప్పాల్సిందే.

కందుకూరి, గురజాడ, శ్రీశ్రీ వంటి వారి గురించి ఈ మధ్య వస్తున్న వ్యాఖ్యానాలు..విమర్శలు..దూషణలు చూస్తున్నాం. శాశ్వత సత్యాలంటూ ఏమీ ఉండనట్టే శాశ్వత మహాపురుషులు అంటూ ఎవరూ ఉండరు. శ్రీశ్రీ వంటి వారు నిర్ద్వంద్వంగా ఈ  యుగం నాదే అని ప్రకటించి మాట  నెగ్గించుకున్నా, అన్నికాలాల్లోనూ ఆయనే యుగపురుషుడుగా నిలవలేడు. ఆ విషయం ఆయనకీ తెలుసు. కానీ యుగపురుషుల స్థానాలను యథాతథంగా   శాశ్వత పరచాలని చూసే వారికే తెలియదు. ఒకనాడు వీధి వీధికీ విగ్రహమై వెలసిన వీరుడు ప్రజల చేతుల్లోనే మట్టిలో కలిసిపోతున్న వాస్తవాలు చూస్తున్నాం. దేవుళ్ళే దెయ్యాలవుతున్నారు..అసురులే అసలు సిసలు వీరులుగా పొద్దుపొడుపులవుతున్న కాలాన్ని కంటున్నాం. సర్వకాల సర్వావస్థల్లోనూ వ్యవస్థ ఒకే దిక్కుకు పయనించదన్న సత్యాన్ని గమనిస్తున్నాం. తిరగబడుతున్న చరిత్రలను తల్లకిందులుగా తంటాలుపడి చదువుకుంటున్నాం. కానీ మనల్ని ఏ శక్తులు చుట్టుముడుతున్నాయి. ఏ శక్తులతో జట్టు కట్టాల్సిన అవసరం వుంది అనే అంచనాలు వేసుకుని మాట్లాడాల్సిన స్పృహను కోల్పోకూడదు.

కందుకూరి వంటి వారి మీద మన అంచనాలను మన అభిప్రాయాలనూ బయటపెట్టేటప్పుడు వారి కాలమాన పరిస్థితులను గుర్తెరిగి, వారి పరిమితులు..పరిధులు..ఆ కాలపు నీతులు..ధర్మాలూ అన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. సర్వ మానవాళికీ సమానంగా నాయకత్వం వహించి సమస్త మానవకోటికీ మేలు చేయాలనే కాంక్షతో ఉద్యమాలు..విప్లవాలూ నడిపిన వారు చరిత్రలో లేరు. ఏదో ఒక వర్గ ప్రయోజనమే అక్కడుంటుంది. బుద్ధుడు వంటి ధర్మప్రబోధకులు..న్యాయ నైతిక జీవన  ప్రచారకులూ సత్యశోధకులూ వేరు.  సో ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక ఉద్యమానికో..సంస్కరణకో పూనుకున్నాడంటే అతని లక్ష్యం ఒకటే అయి వుంటుంది. ఆ లక్ష్యాన్ని వ్యతిరేకించే వర్గాలూ వుంటాయి. టోటల్ గా అతను ఎవరి పక్షాన వున్నాడన్నదే ముఖ్యం. అతని వల్ల ముందు తరాల ఆలోచనలు కొంచెమైనా చైతన్యవంతమైన దిశగా పయనించడంలో మేలు జరిగిందా కీడు జరిగిందా అన్నదే కీలకం.

మహాపురుషుల్లోనూ మచ్చలుంటాయని, ముద్దుపళని రాధికా సాంత్వనం విషయంలో, స్త్రీల విషయంలో, దళితుల సమస్యల విషయంలో కందుకూరిది ప్రశ్నించరాని అఖండ వ్యక్తిత్వం ఏమీ కాదని ఈ మధ్య దళిత బహుజన మేధావులు,రచయితలు,విమర్శకులు కందుకూరిని నిలదీస్తున్న వైనాన్ని చూస్తున్నాం. మారిన కాలమాన  పరిస్థితులలో నిజాయితీగా నిర్భయంగా సాగే ఇలాంటి అంచనాలను తప్పు పట్టాల్సిన పనేం లేదు. అయితే ఇప్పటికిప్పుడు ఏదో పెద్ద చర్చ జరిపి అటో ఇటో తేల్చేయగలిగేంత చిన్న విషయమేం కాదు ఇది.  అసహాయులైన ఆడపిల్లల పట్ల ఆనాటి బ్రాహ్మణ పురుష సమాజం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో కందుకూరి అనేక ప్రహసనాలు, కావ్యాలు, రచనల ద్వారా ప్రపంచానికి తెలియజెప్పిన తీరు, ఆ దారుణాలకు వ్యతిరేకంగా పోరాడిన తీరు ఎవరూ కాదనలేని విషయం. ఆ ఒక్క  కారణంగా మొత్తం స్త్రీ జాతి కందుకూరిని గుండెలకు హత్తుకుంటుందని చెప్పొచ్చు.  కందుకూరి ఏ కులం ఆడపిల్లల గురించి పోరాడాడు అన్నది కాదు, ఆయన సాగించిన సంస్కరణోద్యమం యావత్ స్త్రీజాతికే చైతన్యస్ఫోరకంగా నిలుస్తుందన్నది నిర్వివాదాంశంగా కొలకలూరి ఆశాజ్యోతి వంటి దళిత స్త్రీ మేధావులే వేదికల మీద చెప్తున్నారు.  అందరూ కుల వ్యవస్థ ఉన్న సమాజంలో ఏదో ఒక కులంలోనే పుడతారు. చైతన్యవంతులైన వారు, వారి చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న దారుణాల మీదే దండయాత్ర చేస్తారు. కందుకూరి పరిధి అది. మన పరిమితమైన అవగాహనలను, అంచనాలను, ఆలోచనలను దాటి విస్తరించి చూడాల్సింది ఉంది. ఆ వెలుగులో కందుకూరిని   అర్థం చేసుకోవాలి. ముద్దుపళని విషయానికి వస్తే ఆమె కావ్యాన్ని ఇప్పుడు ఆధునిక కవిత్వ రూపంలో రాసినా దాన్ని నీలి సాహిత్యం కోవలోకి చేర్చి పక్కన పెట్టే పరిస్థతి వుంది.  కందుకూరి కళావంతుల కులానికి వ్యతిరేకి కాదు. ఆనాడు వేశ్యావృత్తి ఒక జాడ్యంలా వ్యాపించి వుంది. దానికి వ్యతిరేకంగా ఆయన సాగించిన ఉద్యమంలో భాగంగానే అతని వ్యతిరేకతను చూడాలన్నది కొందరి పాయింట్. కళావంతుల పోషకులు రాజాస్థానాలు, సంస్థానాధీశులు, భూస్వాములూ. వారిని ఆకట్టుకుని తమ కొంగుకు కట్టుకోడానికే ఆనాడు కళావంతులు సంగీత సాహిత్యాలను అభ్యసించేవారు. కులాంగనలు తమ మగవారిని ఇంటి పట్టునే ఉంచుకోవాలంటే వారికి కూడా ఈ విద్యలు అందుబాటులో రావాలన్నది ఆనాటి సంస్కర్త అవగాహన. ఆ అవగాహన నేపథ్యం నుంచే ఆయన నిరసన, దూషణ అసభ్య పదజాలంతో బయటకు వచ్చాయి. ఒక స్త్రీ పట్ల, అందునా ఒక కవయిత్రి పట్లా ఈకాలంలోనే కాదు ఏ కాలంలోనైనా ఏ నేపథ్యంలోనైనా ఒక స్త్రీజనోద్ధారుకుడు అలా మాట్లాడ్డం సమర్ధనీయం కాదు. ఆ విషయంలో అతని పట్ల వ్యక్తమవుతున్న ఇప్పటి అప్పటి నిరసనలు సమంజసమే. ఇంకా దళితుల పట్ల ఆయన వాడిన భాష వగైరాలున్నాయి.  ఇవన్నీ ఒకెత్తు. అంత మాత్రాన చరిత్ర క్రమంలో కందుకూరి పాత్రను హేళనతో కూడిన నీచమైన స్థాయికి దిగజార్చలేం.

ఆదివాసీల కోసం పోరాడిన వీరుడు మరో జాతిలో హక్కుల కోసం పోరాడే ప్రతివారికీ ఆదర్శప్రాయుడు కాగలడు. దళితుల కోసం పోరాడిన యోధుడు ఇతర కులాల అస్తిత్వ ఉద్యమాలలో ఉన్న వారికి మార్గదర్శి కాగలడు. అలాగే అగ్ర కులాల్లో పుట్టిన వారు తమ కులాల్లోని అణచివేత ధోరణులకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడితే వారి ఉద్యమ స్ఫూర్తి ఆ కులాలకే పరిమితం కాదు.తన సొంత కులం వారి నుంచే ఎన్నో హత్యా ప్రయత్నాలను ఎదుర్కొన్నాడు కందుకూరి. అవహేళనలకు..అవమానాలకు గురయ్యాడు. వితండవాద పండిత ప్రకాండులతో తలపడ్డాడు. కోర్టు కేసుల్లో ఇరుక్కుని నానా అగచాట్లూ పడ్డాడు. చిలకమర్తి అన్నట్టు తన గేహము..తన దేహము..తన విద్య..తన ధనమ్ము అందరి కోసం వినియోగించిన కందుకూరి అందరి వాడు కాదు, కొందరి వాడే అని ఇప్పటి అస్తిత్వ ఉద్యమాల గొంతులు చెప్తున్నాయి. తప్పదు. కాలానుసారం వచ్చే మార్పులకు పరిణామాలకు ఎంతటి యుగపురుషులైనా తలొగ్గవలసిందే. అయితే చారిత్రక విభాత సంధ్యలలో కొన్ని మూల మలుపుల వద్ద నిలిచి కాలాన్ని ఆ మలుపుల వైపు మళ్ళించిన వారిని పూర్తిగా నిరాకరించలేం. ఆ కాలం పరిమితులకు లోబడి వారెటు వైపు నిలబడ్డారన్నదే ముఖ్యం. స్త్రీలకు సంబంధించిన సమస్యల మీద తర్వాతి తరాలలో పెల్లుబికిన ఉద్యమాలలో కందుకూరి అంతర్లీనంగా ఉన్నాడు, ఉంటాడు. తెలుగునాట అంధ విశ్వాసాల మీద సాగిన సాగుతున్న హేతువాద పోరాటాల్లోనూ కందుకూరి మమేకమై ఉన్నాడు, ఉంటాడు.  ఆ మేరకు కందుకూరిని కాలం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది.

అస్తిత్వ ఉద్యమాల కాలం ఇది. సమూహాలుగా విస్తరించడం మంచి పరిణామమే కాని సమూహాలుగా విడిపోయి ప్రగతిశీల శక్తులు ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకునే కాలం మాత్రం కాదు. క్రమక్రమంగా మతతత్వ శక్తులు అతి భయంకర రూపధారణ చేస్తున్న కాలం ఇది. ఖాకీ నిక్కర్లు కర్రలు పట్టుకుని మన మెదళ్ళ మీద..మన కలల మీద..మన వ్యక్తిగత జీవితాల మీదా కదను తొక్కే రోజులొచ్చాయి. దేశం నియంతృత్వ సార్వభౌమాధికారం వైపు వడిగా అడుగులు వేస్తోంది.  ఉమ్మడిగా దాన్ని ఎదిరించాల్సిన సందర్భంలో ఆలోచనాపరులు ముక్కలు ముక్కలుగా విడిపోయి చెల్లాచెదురైపోతే ప్రమాదం ఏ రూపంలో ఎవరి మీద ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో తెలీదు. కొంచెం సంయమనం..కొంచెం బ్యాలెన్స్..కొంచెం వర్తమాన అవలోకన అవసరం. వాదనలు వినిపిస్తూనే కలహించుకుంటూనే కలిసి కదలాలి. మీద మీదకొస్తున్న భూతాన్ని ఎదుర్కొనాలి.

                 -డా.ప్రసాదమూర్తి  

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment