అత్యవసరంగా జగన్ ఢిల్లీకి ఎందుకంటే…!

అనితర సాధ్యుడు అమితుడికి నమస్కారాలు…! ఢిల్లీ పెద్దలకు ప్రణామాలు..! అయ్యాల్లారా…! నేను జగనుడిని.., ఆంధ్ర ప్రదేశ్ అనబడే (మీకు పట్టులేని.., నా గుప్పిట ఉన్న) రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. 320 లక్షల ఓట్లలో 156 లక్షల ఓట్లు తెచ్చుకున్న ఏకఛత్ర వీరుడిని. రాజకీయంగా ధీరుడిని. కోర్టుల బాధితుడిని. పేద రాష్ట్ర పాలకుడిని. దిక్కు లేని ఖజానాకు కాపలాదారుడిని. పెద్దల సభలో మీకు అవసరుడిని. ఇంతకు నేనిప్పుడొచ్చిన వచ్చిన విషయం ఏమిటయ్యా అంటే…!

ఖజానాలో చిల్లరే ఉంది…!

అయ్యా..! రాష్ట్ర ఖజానాలో చిల్లర మిగిలింది. లాక్ డౌను కారణంగా రెండు నెలల్లో రూ. 12 వేల కోట్లు ఆదాయం కోల్పోయాము. అసలే సంక్షేమ వరాలు విచ్చలవిడిగా ఇస్తున్న రాష్ట్రం మాది. చేతిలో డబ్బులు పెట్టె.., ఖాతాల్లో డబ్బులు పడేలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. అందుకే మాకు వేల కోట్లు ఉన్నా ఇట్టే కరిగిపోతున్నాయి. నెలకు రూ. 7 వేల కోట్లు ఆదాయం రూపంలో వస్తుంటే రూ. 7100 కోట్లు సంక్షేమానికి ఖర్చు చేసేస్తున్నామయ్యా. అటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో లాక్ డౌన్ అమలై, ఖజానాకు చిల్లులు పడి ఇప్పుడు నిండుకుంది. కేంద్రం నుండి రావాల్సినవి నా కుడి చేతిలోనూ…, అదనంగా కొన్ని ప్రయోజనాలు నా ఎడమ చేతిలోనూ పెట్టేస్తే పట్టుకుపోతాను. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూసి.., కనికరించి పెద్ద అమన్సుతో ఆదుకోవాలని కోరుకుంటున్నామయ్యా.

విభజన చట్టం ఒక్కసారి తిరగెయ్యండి…!

అయ్యా…! పెద్దలారా మా రాష్ట్రం విడిపోయి ఆరేళ్ళు కావస్తుంది. అప్పుడు విభజన చట్టం అని ఒకటి తయారు చేశారు. అది మీ ఆఫీసులోనే ఏ బీరువాలోనో.., ఏ బల్ల కిందో.., ఏ కంప్యూటర్ లోపలో మారుమూల ఉంటుంది. బహుశా తుప్పు పట్టేసి ఉంటుంది. ఆ తుప్పు దులిపి ఒక్కసారి తిరగేస్తే మాకు పైసా, పరక రావాల్సి ఉంటె ఇచ్చేయండి. ప్రత్యేక హోదా అనే ద్రాక్ష పండు మనకు అందదు, మీరు అందించారు. నాకు తెలుసు. కనీసం మిగిలినవైనా చుస్తే మాకు దయచూపిన వారవుతారు. పోలవరం నిధులు, వెనుకబడిన జిల్లాల నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధులు వెంటనే అందిస్తే నా నెత్తిన పెట్టుకుని పోతానయ్యా…!!

కోర్టులు కొడుతున్నాయి…!

అయ్యా..! ఇది కొంచెం రహస్యం. ఎవరూ లేనప్పుడు చుడండి. ఆ కోర్టు నన్ను ఎడాపెడా కొడుతుంది. చిన్న చిన్న కారణాలకు మా అధికారులను పిలుస్తుంది. మా నాయకులను విసిగిస్తుంది. ప్రతీ కేసులోనూ మాకు వ్యతిరేకంగా ఎలా తీర్పివ్వాలా అనే ఆలోచిస్తున్నట్టుంది…! ఇది మీరే చూసుకోవాలి. శాసన వ్యవస్థ లో బలంగా ఉన్న మాపై న్యాయ వ్యవస్థ ఇలా ఉండడం బాధిస్తుంది. మొన్నామధ్య రెండు రోజులు నిద్ర పట్టలేదు. మీరు చూసుకుంటే.., కొంత అదుపు చేయగలిగితే బాగుంటుంది. లేకుంటే మా ప్రత్యామ్నాయ మార్గాలు మాకున్నాయి. “రాజకీయాల్లో ఓడిన వారు కోర్టుల ద్వారా రాజకీయాలు చేయకూడదు” అనే న్యాయ నిపుణుల వ్యాఖ్యలు తమరు గుర్తెరిగి మాకు దారి చూపించాలి. లేకుంటే మేము రాజ్యాంగంలో కొన్ని పేజీలు తిరగేస్తామయ్యా…!!

మండలిని మదిలో పెట్టుకోండి…!

అయ్యల్లారా…! మండలిని మాకు అవసరం లేదు. అక్కడ జీతాలు కూడా వృధా అని మేము నాలుగు నెలల కిందట ఒక తీర్మానం చేసి మీకు పంపించాము. అది బహుశా మీ టేబుల్ పైనో.., బీరువాల్లోనో.., పడి ఉంటుంది. దాన్ని ఒక్కసారి చుడండి. వచ్చే నెలలో (కరోనా లేకపోతే) పార్లమెంటులో మీరు నిర్వహించనున్న వర్షాకాల సమావేశాలలో ఆ బిల్లుని కాస్త పెట్టండి. అదేదో మాకు వదిలేస్తే మేము రాజధానిని మారుస్తాము, ఇంకా అనేక పనులున్నాయి. మండలిలో బలముందని వీగుతున్న చంద్రబాబు కొమ్ములు కత్తిరిస్తాము. మీకు, మాకు ఉమ్మడి శత్రువుగా ఉన్న ఆ బాబు ఇంకా పైకి లేవకుండా ఉండాలంటే మాత్రం మీరు అత్యవసరంగా కోర్టులను చూసుకోవాలి.., మండలి పని పట్టాలి. లేకపోతే నెత్తిమీద నిప్పు రవ్వ పెట్టుకున్నట్టే ఉంటుందయ్యా…!

(ఇవన్నీ మా కోరికలు. ఇంకా ఉన్నాయి.., అవి కూడా జత చేసాను. మీరు మొత్తం చూసి కొన్నిటికైనా ఆమోదం ఇస్తారని ఆశిస్తున్నాను. ఇస్తారు, నాకు తెలుసు లేకుంటే పెద్దల సభలో మేమేగా పైనున్నాం.. ఇవ్వరని తెలుసు. నాకు సిబిఐ లంకెలున్నాయని…! అందుకే రెండోది మర్చిపోయి.., మొదటిది పట్టించుకుని ఇచ్చేస్తే బాగుంటుందని మనవి)

ఇదే నా టూర్ షెడ్యూల్…!

మంగళవారం ఉదయం 10.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని.., మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీ చేరుకుంటాను. అక్కడి నుంచి జనపథ్‌ – 1కు, అనంతరం పెద్దల నివాసాలకు ఒక్కొక్కరి చుట్టూ తిరగనున్నాను.