ఉద్యమించడమే నేరమా!?

 

ఉద్యమాల గడ్డమీద ఉద్యమించడమే పాపమైపోతున్నది. పోరుబాట పట్టడమే నేరమైపోతున్నది. నిరసన, ఆందోళన, సమ్మె వంటి పదాలు వినపడకూడదన్నరీతిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. 35 రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను అణచివేయడానికి కంకణం కట్టుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు సర్కారు అందుకు తొక్కని అడ్డదారి లేదు. తెలంగాణ హైకోర్టు అనేకమార్లు చివాట్లు పెట్టినా, కర్తవ్యబోధ చేసినా పాలకులకు కనువిప్పు కలగడం లేదు. దసరా పండగకు రెండు రోజుల ముందు మొదలైన అర్టీసీ ఉద్యోగుల సమ్మెలో అనేక పోరాట రూపాలు చూశాం. నెలజీతం అందితే గానీ బతుకుబండి సాగని పేద ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంపై వత్తిడి తేవడానికి శతధా సర్వదా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ నెల జీతం అందకపోయినా దసరా, దీపావళి పండగలు కళ తప్పినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న ఆర్టీసీ కార్మికుల వెతలు పాలకుల మనసులును కరిగించడం లేదు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు తండ్రి లాంటి వాడనీ, ప్రజల్లో భాగమైన వేలమంది ఆర్టీసీ ఉద్యోగుల కోర్కెల పట్ల సానుభూతితో వ్యవహరించాలనీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కెసిఆర్ ధోరణిని మార్చలేకపోతున్నాయి.

రణరంగమైన ట్యాంక్‌బండ్

నవంబర్ తొమ్మిదిన ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి తలపెట్టిన సకలజనుల సామూహిక దీక్షను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నించి విఫలమయింది. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టంగా నిలిచిన మిలియన్ మార్చ్ తరహాలో ట్యాంక్‌బండ్‌పై నిర్వహించ తలపెట్టిన ఈ దీక్షను విఫలం చేయడానికి ప్రభుత్వం చేయని ప్రయ్నత్నం లేదు. ట్యాంక్‌బండ్‌మీద ఆ పరిసర ప్రాతాలలో మొత్తం ట్రాఫిక్‌నే  నిషేధించారు. వేలాది మంది పోలీసులను మోహరించి ఆందోళనను భగ్నం చేయడానికి ప్రయత్నించారు. అయినా కాంగ్రెస్, బిజెపి, టిడిపి, సిపిఐ, సిపిఎం, న్యూడెమోక్రసీ  వంటి పార్టీలు, విద్యార్ధి సంఘాలు, పౌర సంఘాలు, వివిధ ఉద్యోగ సంఘాల మద్దతుతో చేపట్టిన ఆందోళన పాక్షికంగా విజయంతమైంది. పోలీసుల కళ్లు గప్పి ఆందోళనకారులు బస్తీల నుంచి, గల్లీల నుంచీ ట్యాంక్‌బండ్ పైకి చేరుకున్నారు. వేలాదిమందిని అరెస్టు చేసినా, దొరికినవారిని దొరికనట్లుగా చితకబాదినా వందలాదిమంది దఫదఫాలుగా ట్యాంక్‌బండ్ మీదికి చేరుకున్నారు. పోలీసులు నిర్దాక్షిణ్యంగా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. బాష్పవాయువు ప్రయోగించారు. పలువురు ఆందోళనకారులు తీవ్ర గాయాలపాలయ్యారు. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. లాఠీల దెబ్బలకు రక్తం కారుతున్నా ఆందోళనకారులు ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లకు మద్దతుగా, ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లాఠీ దెబ్బలకు తలలు పగిలి చేతులు విరిగి రక్తం కారుతున్నా వారు ఆందోళన సాగించారు. ఒక దశలో సహనం కోల్పోయి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. 266 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసు కమిషనర్ స్వయంగా ప్రకటించారంటే ఆందోళనను అణచివేయడానికి ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రయత్నించిందో అర్ధం అవుతుంది. ఆందోళనలో మావోయిస్టు సంఘాల నేతలు, కార్యకర్తలు చేరారంటూ పోలీసు యంత్రాంగం అధికం చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నాయకులు భట్టి విక్రమార్క, కొండా విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కి, పొన్నాల లక్ష్మయ్య, విజయశాంతి, బిజెపి నేతలు కె. లక్ష్మణ్, జితేందర్ రెడ్డి, డికె అరుణ, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వంటి నాయకులను ఆందోళనలో పాల్గొనకుండా ముందే గృహనిర్బంధం చేశారు.

ప్రభుత్వం ఎంత దమనకాండకు దిగినా తమ ఆందోళన విజయవంతమైందనీ, వేలాది మంది జిల్లాల నుంచి హైదరాబాద్ చేరుకున్నారనీ, ఎంతో సాహసంతో కొన్ని వందల మంది ట్యాంక్‌బండ్ పైకి చేరుకుని ఆందోళన చేశారనీ ఆర్టీసీ జెఎసి కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో చేపట్టిన మిలియన్ మార్చ్‌లో అనుసరించిన వ్యూహాన్నే ఈసారి కూడా అనుసరించిన ఆందోళనకారులు ముళ్లకంచెలు దాటి, బారికేడ్లు తోసేసి ట్యాంక్‌బండ్ మీదకు చేరుకున్నారు.

35 రోజుల ఆర్టీసీ సమ్మెను విఫలం చేసి, ఆ సంస్థను సగం ప్రయివేటు పరం చేయడానికి రకరకాల ఎత్తులు వేస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నా కెసిఆర్ వైఖరిలో మార్పు రావడం లేదు. ఆర్టీసీ కార్మికసంఘం నాయకులను గౌరవంగా చర్చలకు పిలిచి సమ్మె విరమింపజేసేందుకు ప్రయత్నించకుండా కాలయాపన చేస్తున్న కెసిఆర్‌కు కాలమే గుణపాఠం నేర్పుతుంది.

 

-వై నరేందర్ రెడ్డి

వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు