NewsOrbit
వ్యాఖ్య

చూడు చూడు నీడలు!

దిబ్బ-దిరుగుండాల ఉమ్మడి అధినేత పోతురాజు ఉత్తమ సంస్కారి!
సొంత రాజ్యంలో, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతికే విధేయ పౌరులనే అనుమానించే లక్షణం అతని సొంతం.
పౌరులందరి మాటా అలా ఉంచండి- తన ప్రతి మాటకూ తానా తందానా అనే సొంత మనుషుల్ని కూడా అనుమానించడం పోతురాజు విశిష్టత.
అంతేకాదు; స్వ-పర భేదం లేకుండా మనుషులనే కాకుండా వాళ్ళ నీడల్ని కూడా అనుమానించ గల ధీశాలి పోతు.
అదే అనుమానంతో అతగాడు దిబ్బరాజ్యంలో అసలు నీడలనే లేకుండా చెయ్యాలని సంకల్పించాడు. అందుకు ఏంచేస్తే బాగుంటుందో చెప్పమని తన ఆస్థాన విద్వాంసుల్ని సంప్రతించాడు.
వాళ్ళు పోతును మించిన సంస్కారులు. నీడలు అనేవి   పడకూడదంటే వెలుతురు లేకుండా చెయ్యడం ఒక్కటే మార్గమనే విషయంలో వాళ్ళందరూ ఏకీభవించారు.
రాత్రిపూట దీపాలు వెలిగించడానికి వీల్లేదని శాసించడం ద్వారా సగం సమస్యను పరిష్కరించ వచ్చని ఒక విద్వాంసుడు సూచించాడు.
అదేవిధంగా ఎవరూ వెన్నెల్లో తిరగడానికి వీలే లేదని కూడా నిర్బంధిస్తే మూడో వంతు సమస్య పరిష్కారం అయిపోతుందన్నాడు మరో విద్వాంసుడు.
ఆ ఆలోచన తనకే తట్టనందుకు సిగ్గుపడిన మరో విద్వాంసుడు అంతకు మించిన తీవ్రమైన సూచన చేశాడు.
అణ్వస్త్రాలు ప్రయోగించి సూర్యుణ్ణి పేల్చిపారేస్తే పగటిపూట కూడా నీడల పీడ  లేకుండా చెయ్యొచ్చని అతగాడు హుషారుగా సూచించాడు.
***
విద్వాంసుల మాటలు విని, రెచ్చిపోయిన పోతురాజు వెంటనే తన ఆస్థాన శాస్త్రవేత్తల్ని పిలిపించాడు. నిండు పేరోలగంలో నిలబెట్టి వాళ్ళని ఇలా నిలదీశాడు-
“రాత్రిపూట నీడలు ఏర్పడ్డానికి కారణం ఎవరు?”
“ఇంట్లో అయితే దీపమూ, బయట చందమామ ప్రతాపమూను- తమకు తెలియదు కనకనా?” అన్నాడు లౌక్యం తెలిసిన ఓ ముసలి శాస్త్రజ్ఞుడు.
“శెభాష్- మరి పగటిపూట?”
“ఇంకెవరు ప్రభూ, తేజస్సులో తమకు తీసికట్టయిన ఆ సూరీడే!!” అన్నాడు అదే ముసలి శాస్త్రవేత్త. అతని తండ్రి చిన్నపాటి కవి కూడానట. అంచేత అప్పుడప్పుడు కవిత్వపైత్యం ఒలకబోయడం ముసలి వేత్తకు అలవాటు.
“శెభాష్, శెభాష్!! మరి, సూర్యుడికీ భూమికీ దూరమెంత?”
పోతురాజు విద్వత్తు ఎంత ఘనమైందో బాగా తెలిసిన ఆ శాస్త్రజ్ఞుడు ఠపీమని జవాబు చెప్పాడు- “అబ్బే! ఎంతండీ, మన కొత్వాలుకోటకీ రాజధానీ నగరానికి ఉండే దూరానికి అక్షరాలా రెట్టింపు!” అనేశాడు ఆ ముసలి శాస్త్రవేత్త.
“శెభాష్!! కొలిచినట్లు చెప్పారు! అంచేత మన సరికొత్త వైజ్ఞానిక ప్రణాళికకు మిమ్మల్నే నాయకుడిగా నియమిస్తున్నాం!!” గంభీరంగా అన్నాడు పోతు.
“ప్రభువులు అనుమతిస్తే ఒకమాట మనవి చేసుకుంటాను….”  అన్నాడు  ఓ యువశాస్త్రవేత్త. అతగాడికి పోతురాజుకు శాస్త్రీయంగా చెక్కభజన చెయ్యడం తప్ప మరేమీ రాదు. పైపెచ్చు, యువవేత్తకు ముసలి శాస్త్రవేత్త అంటే పడదు. దానికీ చిన్న (!) కారణం లేకపోలేదు. ముసలాడి ముగ్గురు కూతుళ్లలో ఒకరిని -వీలయితే ముగ్గుర్నీ- తనకిచ్చి పెళ్లి చెయ్యమని యువ శాస్త్రవేత్త తన తండ్రిని పంపి అడిగించాడు. ముసలి శాస్త్రవేత్త ముగ్గురు కూతుళ్ళూ, సదరు యువకుడి తండ్రి శరీరంలో ఉన్న ఎముకలు ఎన్నో లెక్కతీసి, జాబితా రాసి అతని చేతికే ఇచ్చి పంపించారు. అప్పట్నుంచీ ముసలివేత్త ఎడ్డెమంటే యువవేత్త తెడ్డెమనడం ఆనవాయితీగా మారిపోయింది.
యువవేత్త కీర్తనలంటే పడి చస్తాడు పోతురాజు. అందుకే, “అవశ్యం సెలవియ్యండి విద్వాన్ శిరోమణీ!”  అన్నాడు పోతు మరింత గంభీరంగా.
“చిత్తం, చిత్తం! మీరుండగా వైజ్ఞానిక ప్రణాళికలకు ఇతరులు నేతృత్వం వహించడమంటే, శాస్త్రాన్ని అవమానించడమే కాదా ప్రభూ? ప్లాస్టిక్ సర్జెరీ మొదలుకుని స్టెమ్‌సెల్స్ ట్రాన్స్‌ప్లాంట్ వరకూ అన్నింటి రహస్యాలనూ మన పురాణాల్లోంచి కెలికి తీసిన- క్షమించాలి, వెలికి తీసిన- మేధావులు మీరు! మీరే సదరు వైజ్ఞానిక ప్రణాళిక చేజేతులా రూపొందించడం భావ్యమని నా చిన్న బుర్రకి అనిపిస్తోంది.” అన్నాడు యువవేత్త.
“నా నాలిక కొసను ఉన్న ముక్క మన యువవేత్త చెప్పేశాడు! ఇప్పుడు నా భుజాలమీంచి ఓ మదగజాన్ని దింపుకున్నంత హాయిగా ఉంది! కాగా, సదరు ప్రణాళిక తయారీ లోనూ, ప్రయోగంలోనూ కూడా మీకు మన యువవేత్తే సహకరించడం భావ్యంగా ఉంటుందని అనుభవ పరిపాకంతో పండిపోయిన నా మెదడుకు అనిపిస్తోంది ప్రభూ!” అన్నాడు ముసలి వేత్త.
“అలాగే కానివ్వండి మహోదయా!!” అన్నాడు పోతురాజు.
పోతురాజు ప్రకటన వినగానే యువవేత్త గుండె గుభేలు మంది. అయితే, ‘పోతురాజుకి కూడా ఏమీ తెలియదుకదా, ఆ మాత్రం మాయ చెయ్యలేకపోతామా?’ అనే ధీమాతో “సవినయంగా” ఆ బాధ్యత స్వీకరించాడు యువవేత్త.
***
పోతురాజుకు ఏమీ తెలియదనేది యువ వేత్త ధీమా కాగా, యువవేత్తకు అన్నీ తెలుసనేది పోతురాజు ధీమా! వాస్తవం ఏమిటంటే, అటు పోతురాజుకూ, ఇటు అతగాడికి చెక్కభజన చెయ్యడం తప్ప మరేమీ తెలియని యువవేత్తకూ కూడా అన్న వస్త్రాల గురించే తప్ప, అణ్వస్త్రాలు అంటే ఏమిటో తెలీదు. ఆ విషయం ఒక్క రోజులోనే ఇద్దరూ గ్రహించారు. సదరు అవగాహన ఇద్దర్లోని ధీమాను ఇబ్బడిముబ్బడి చెయ్యడం విశేషం!!
ఆ మరుసటి రోజు అమావాస్య! ఆ రోజంటే పోతుకు మహా ఇష్టం!! ఎందుకంటే, ఆ రాత్రి ఆకాశంలో చంద్రుడే కనబడడు! అంతకు మించి ఎక్కడా నీడలు కనబడవు! అంచేత ఆ రోజే సూర్యుణ్ణి లేపేసే వైజ్ఞానిక ప్రణాళిక అమలు చెయ్యాలని పోతురాజు నిర్ణయించాడు.
“యువవేత్తా, తారాజువ్వ అంటే తెలుసునా?” అని పోతురాజు గంభీరంగా అడిగాడు.
“చిత్తం, చిత్తం! నక్షత్ర లోకానికి వెళ్లి, మన క్షేమసమాచారాలు చెప్పిరావడానికి, వాళ్ళ కుశలం కనుక్కోడానికీ మన పూర్వులు ప్రయోగించిన నమస్కార బాణాలు అవే ప్రభూ!” అన్నాడు యువవేత్త – కాస్త గొంతు తగ్గించి.
అలా గొంతు తగ్గించడం పోతుకు బాగా నచ్చింది! ఎంతచెడ్డా పౌరాణిక రహస్యం రహస్యంగానే ఉండాలి మరి!
“శెభాష్! సూర్యుడు కూడా ఒక నక్షత్రమేగా శిరోమణీ?” అని మరింత గంభీరంగా అడిగాడు పోతు.
“చిత్తం, చిత్తం! సందేహమే లేదు!!” అన్నాడు యువవేత్త.
“మనం అత్యాధునిక తారాజువ్వ తయారీ ద్వారా నేడు చరిత్ర సృష్టించ బోతున్నాం శిరోమణీ!!నేటితో సూర్యుడు, అతగాడి వెలుతురూ అంతరించిపోతాయి” అన్నాడు పోతు- గొంతు కాస్త తగ్గించి.
అతను చదువుకోని రోజుల్నించీ, తారాజువ్వల తయారీలో దిట్ట. కొత్వాలు కోట సరిహద్దుల్లో చేరి అటు దిబ్బ గ్రామాలపైనా, ఇటు దిరుగుండం ఊళ్లపైనా హుషారుగా తారాజువ్వలు ప్రయోగించే పోకిరి మూకకి పోతురాజే నాయకుడు. ఆనాటి తారాజువ్వల “పాళ్ళు” ప్రయోగించి అత్యంత భారీ “అణ్వస్త్రం” తయారు చేశాడు. స్థూపాకారంలో వుండే దాని మందు పాతరలో సూరేకారం, గంధకం, బొగ్గుపొడి కూరికూరి నింపాడు. తయారీ పూర్తైన క్షణాల్లోనే దాన్ని ప్రయోగించాడు కూడా!
మరుక్షణంలో అక్కడ ఒక భారీ పేలుడు సంభవించింది!
సూర్యుడే పేలిపోయి ఉంటాడని అటు పోతు రాజు, ఇటు యువ వేత్త ఇద్దరూ ప్రగాఢంగా నమ్మారు!!
ఎందుకంటే, అప్పటిదాకా మసకమసకగా కనిపిస్తూ వచ్చిన నీడల జాడలు కూడా కనిపించకుండా పోయాయి వాళ్లకు. ఇద్దరూ “అణ్వస్త్ర తారాజువ్వ”  తయారుచేసి ప్రయోగించిన సంతోషంలో స్పృహకోల్పోయి కొన్నిగంటలసేపు  పడివున్నారు.
***
ఆ తర్వాత వాళ్ళు నీడల్ని చూసిన పాపాన్ని పోలేదు.
ఆ మాటకొస్తే, వెలుతురుని కూడా వాళ్ళు ఆ తర్వాత చూసి ఎరుగరు.
మొదటి విషయం పోతురాజుకూ, యువవేత్తకూ ఎంతో తృప్తినిచ్చింది!
రెండో విషయం దిబ్బ-దిరుగుండాల పౌరులకు మరెంతో తృప్తిని ప్రసాదించింది!!
లోకో భిన్న రుచి:

-మందలపర్తి కిషోర్
               
          

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment