నేతలు ఎందుకు ఎక్కువ ?

Share

రాజకీయాల్లో నేరచరితుల గురించి, వారి పాత్రను అరికట్టాల్సిన అవసరం గురించీ జరుగుతున్న చర్చ ఇప్పటిది కాదు. ఎంతో కాలంగా ఎంతో చర్చ జరిగింది. నేర చరితులను రాజకీయాల  నుంచి దూరంగా ఉంచాలన్న మాటను వ్యతిరేకించే వారు ఒక్కరూ ఉండరు. రాజకీయ నాయకులతో సహా అందరూ ఒప్పుకుంటారు. కానీ ఏళ్లు గడుస్తున్నాయి గానీ  ఆ దిశగా జరిగింది శూన్యం. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే నేరచరితులకు రాజకీయాల్లో చోటు ఉండరాదని బలంగా విశ్వసించే కొందరు ఈ విషయంలో కోర్టును కూడా ఆశ్రయించారు.  అయితే సుప్రీంకోర్టు కూడా ఇందుకు సహకరించలేదు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు నేరచరితులను పోటీ నుంచి నిషేధించే బాధ్యతను పార్లమెంటుకు వదిలిపెట్టింది. అయితే తమ ప్రయోజనాలకు విరుద్ధమైన పనికి పార్లమెంటేరియన్లు పూనుకుంటారా!

ఈ విషయంలో చట్టం చేయకుండా ఉండేందుకు రాజకీయ నాయకులు ముందుకు తెస్తున్న వాదనలో ప్రధానమైన అంశం ఏమిటి: న్యాయశాస్త్రం ప్రాధమిక సూత్రాల ప్రకారం ఎవరైనా గానీ నేరం రుజువయ్యే వరకూ నిర్దోషే గదా. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఎస్. వై. ఖురేషీ మొన్న ‘ద హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావించారు. రాజకీయ నాయకుల వాదనను ఎదుర్కొనేందుకు ఆయన ఆయన చేసిన వాదనను చదివిన తర్వాత ఈ వ్యాసం రాయాలనిపించింది.

నిరూపితమయ్యే వరకూ అందరూ నిర్దోషులే అన్న సూత్రం అమలును పరిశీలిస్తే, దేశంలో ప్రస్తుతం దాదాపు నాలుగు లక్షల మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 71 శాతం విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు. అంటే ఇంకా వారి నేరం రుజువు కాలేదు. అయినా గానీ వారిని జైలులో ఉంచడం ద్వారా రాజ్యం వారి ప్రాధమిక హక్కులు నాలుగింటిని హరించింది: స్వేచ్ఛ హక్కు, స్వేచ్ఛగా తిరిగే హక్కు, ఇష్టం వచ్చిన పని చేసుకునే హక్కు, గౌరవంగా జీవించే హక్కు. వీటికి తోడు వోటు వేసే చట్టబద్ధమైన హక్కును కూడా ఖైదీలు కోలుపోతారు. మరి రాజకీయ నాయకులు ఎన్నికలలో పోటీ చేసే హక్కును కోల్పోవడం ఏమంత పెద్ద విషయం అంటారు ఖురేషీ. ఆ హక్కు ఆఖరికి ప్రాధమిక హక్కు కూడా కాదు కదా! విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలకు ఒక న్యాయం, నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ  నాయకులకు ఒక న్యాయమా?

నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులను ఎన్నికలకు దూరంగా ఉంచడం పట్ల వారు వ్యక్తం చేసే మరో అభ్యంతరం ఏమంటే రాజకీయాల్లో ఉన్న వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి తప్పుడు అభియోగాలు మోపే అవకాశం ఉందన్నది. దీనికి సంబంధించి కూడా ఖురేషీ కొన్ని కొత్త విషయాలు చెప్పారు. అన్ని కేసుల్లో కాకుండా అయిదేళ్లు ఆపైన శిక్ష పడే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న కేసుల్లోనే ఎన్నికలలో పాల్గొనకుండా నిషేధం విధిస్తామని ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. అది కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎఫ్ఐఆర్ నమోదయి ఉండాలి. కోర్టు అభియోగాలు నమోదు చేసి ఉండాలి.

ఖురేషీ కొత్తగా చెప్పిన విషయం ఏమంటే, ఆయన పదవిలో ఉండగా, అప్పటి న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కొన్ని ప్రతిపాదనలు చేశారట. ఆరు నెలల బదులు సంవత్సరం గడువు ఉండాలనీ, అది కూడా ఎఫ్ఐఆర్ నమోదయిన నాటి నుంచీ కాకుండా, ఛార్జి షీటు నమోదయిన నాటినుంచీ లెక్క లోకి తీసుకోవాలనీ ఖుర్షీద్ ప్రతిపాదించారు. ఖురేషీ నేతృత్వంలోని ఎన్నికల సంఘం అందుకు సరేనన్నది. కానీ చివరకు ఏమీ జరగలేదు.

మరింత మంచి వ్యక్తుల పాలన కోరుకునే అర్హత సమాజానికి ఉందని సుప్రీం కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. నేర చరితులను ఎన్నికల ప్రక్రియ నుంచి దూరంగా ఉంచేందుకు అవసరమైన చట్టాన్ని వెంటనే చేయాల్సిన అవసరం ఉందనీ, ఎంత తొందరగా అయితే అంత మంచిదనీ అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. లేకపోతే ఈ బెడద ప్రజాస్వామ్యాన్నే కబళించే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం నేరం చేసినట్లు కోర్టు నిర్ధారించిన తర్వాత ఆ వ్యక్తి ఆరేళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేసే అర్హత కోల్పోతాడు. అయితే అలాంటి వ్యక్తి కూడా ఒక రాజకీయపార్టీకి నాయకత్వం వహించవచ్చు. దానిని నిషేధించే చట్టం ఏదీ ఇండియాలో లేదు. పార్లమెంటు సభ్యులు గానీ, శాసనసభ్యులు గానీ సుమారు 1,700 మందిపై ప్రస్తుతం క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే మొత్తం చట్ట సభల సభ్యులలో మూడింట ఒక వంతు కన్నా కాస్త ఎక్కువ మందే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్లు రాజకీయాలలో నేరచరితుల నిషేధం కోసం చట్టం చేస్తారా? తమకు తామే హాని చేసుకుంటారా? ప్రజాస్వామ్యానికి హాని, నేరచరితులైన రాజకీయ నాయకులకు హాని, ఈ రెంటిలో దేనిని ఇష్టపడతారంటే మన నేతలు ఏం చెబుతారో ఉహించండి!

– సురయ్యా


Share

Related posts

ఆలోచించండి! 

Siva Prasad

‘కవిత’మ్మ పండగకి కాస్త విరామం!

Siva Prasad

ప్రచారం కాని మోదీ ప్రచారం!

Siva Prasad

Leave a Comment