మాఅమ్మ సీరియస్గా టీవిలో సీరియల్ చూస్తోంది
ఒక అమ్మాయిని మొగుడు అత్త కలిసి వీధిలోకి గెంటేసేరు
ఎందుకూ.. పిల్లలు పుట్టలేదుట
ఆపిల్ల పనిమనిషిగానైనా ఉండనిమ్మని బతిమాలుతోంది. దీని తెలివి తెల్లార
పనిమనిషిగా వీడి దగ్గరే ఎందుకూ ఎక్కడైనా చేసుకోవచ్చు
నేను రిమోట్ లాక్కొని ఛానల్ మార్చెను
అక్కడ ఇంకా రసవత్తరంగా ఉంది
ఒకాయన పట్టు పంచ, పట్టు లాల్చీ, జరీ కండువా, మెడలో కుంకుడుకాయలంత రుద్రాక్షలు
చేతికి బంగారు కడియం. అచ్చు జల్సా రాయుడులా ఉన్నాడు
ఆధ్యాత్మికం చెప్తున్నాడు, ఏం గమ్మత్తు
ఏదో చెప్తున్నాడు విన్నీవే విసుక్కుంది
విను విను నీజన్మ తరిస్తుంది
పితా రక్షతి కౌమారే
భర్త రక్షతి యౌవనే
రక్షతి వార్ధతే పుత్రా
న స్త్రీ స్వతంత్ర మర్హతి
ఆహా ఏం ఇలవైన మాటలు వింటున్నాం
చిన్నతనంలో తండ్రి రక్షిస్తాడుఔను మరి, కన్న కడుపు కదా ఒప్పుకుందాం
కానీ వయసులో ఉన్నప్పుడు మొగుడు రక్షిస్తాడంటాడేవిటి
ఒక్క పావుగంట నోరు మూసుకోలేవా
లేను. కట్టుకున్న మొగుడు రక్షిస్తే భారతం ఉండేదికాదు
ద్రౌపది ఆలా జుత్తు విరబోసుకొని తిరిగేదికాదు
ఆవిడని ఆలా జుత్తు పట్టుకొని నిండు సభలోకి ఈడ్చుకొని వస్తే ఒక్కరూ ఇది తప్పు అని ఎందుకు చెప్పలేదు, భీష్ముడు ద్రోణుడు వగైరా కురు వృద్దులు ఉన్నారే ఒక్కరూ నోరు మెదపలేదు ఏం
ప్రాణభయం స్వార్థం అంతే
ఐనప్పటికీ ద్రౌపది తన్నోడి నన్నోడెనా నన్నోడి తన్నోడెనా అని లా పాయింట్ లాగింది
ఎవరు మాట్లాడరే
ఒకడు కాదు ఇద్దరు కాదు ఐదుగురు మొగుళ్లున్నారు
ఒక్కడైనా రక్షించేడా మాట్లాడవేం రొక్కించేను
ధర్మరాజు మాటకి కట్టుబడ్డాడు అంది
చెప్పొద్దూ నాకు పిచ్చి కోపం వచ్చింది
ఆఫ్ట్రాల్ ధర్మరాజు. ఐదో వంతు మొగుడు ఆవిడని జూదంలో ఒడ్డదానికి అతనికి ఏమధికారం ఉంది
అసలు జూదం వ్యసనం అని తెలీదా శకుని మాయాజూదం తెలీదా
రాజ్యం ఒడ్డేడు సరే తమ్ముళ్లని భార్యని ఒడ్డె హక్కు ఎక్కడిది
ఇదేనా ధర్మం ఇదేనా న్యాయం
ఆవిడకి వీళ్ళ సత్తువ తెలిసే కృషుణ్ణి ప్రార్ధించింది కృష్ణుడు ఆదుకున్నాడు
ఐనా ఆవిడ వాళ్లతో అడివికి వెళ్ళింది
మళ్ళీ అదే గండం
విరాటరాజు కొలువులో కీచకుడు ఆవిడని వెంబడిస్తే ఒక్కడు మాట్లాడలేదు
విరటుడు పరమ పిరికి కీచకుడంటే భయం
అక్కడా ఐదుగురు మొగుళ్ళు ఉన్నారు
పాపం ఆవిడ దుర్వారోద్యమా బాహు విక్రమ పరాక్రముల్ మత్పతుల్ అని పద్యం చదివి వాళ్ళని పొగిడింది ఐనా వాళ్ళు కదల్లేదుఆహా యెంత బాగా పాడింది అనుకున్నారు
ఎందుకో తెలుసా ఆవిడని రక్షిస్తే వాళ్ళ అసలు రంగు బైట పడుతుంది
మళ్లీ వనవాసం. స్వార్ధం అంతే
ఎందుకే ఆలా మాట్లాడుతావు అంది
మరే నా బుర్ర తిరగబడింది
ఈసారికి ఈ పాఠం చాలు
ఎందుకే నన్నిలా తింటావు నేనేంపాపం చేసానే
నన్ను కనడవే
బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ