పొన్నాలకు జనగామ.. కోదండ బరి ఎక్కడో మరి?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ టిక్కెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే.. ఇదే స్థానంలో బరిలో దిగాలనుకున్న టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఇంకా సందిగ్ధత నెలకొన్నది. బీసీ స్థానాన్ని తీసుకున్నారనే అపవాదు తనకు వద్దని తొలి నుంచీ భావిస్తున్న కోదండరామ్ జనగామను వదులుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

నిజానికి జనగామ నుంచి కోదండరామ్ బరిలో దిగుతారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో పొన్నాల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ను కలిసి, తన ఇబ్బందుల్ని చెప్పుకున్నారు. దశాబ్దాలుగా తాను జనగామ నుంచి పోటీ చేస్తున్నానని, తనలాంటి సీనియర్ నేత స్థానాన్ని ఇతరులకు కేటాయిస్తే కాంగ్రెస్ కేడర్‌‌లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వివరించారు. అయితే.. ముందుగా పొన్నాలకు నచ్చజెప్పేందుకు రాహుల్ ప్రయత్నాలు చేశారని, చివరికి శుక్రవారం వరకూ పొన్నాల ఢిల్లీలోనే ఉండి లాబీయింగ్ చేసి జనగామ సీటును సాధించారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రికి కోదండరామ్‌తో పొన్నాల భేటీ అయి చర్చిస్తారని తెలుస్తోంది.

కాగా.. పొన్నాల లక్ష్మయ్య జనగామ నుంచి పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అవడంతో కోదండరాం ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. కోదండరామ్ ఈసారికి అసలు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారా.. లేక పోటీలో లేకుండా మహాకూటమి విజయం కోసం తెలంగాణ అంతా తిరిగి ప్రచారం చేస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

మొత్తానికి పొన్నాల లక్ష్మయ్య ప్రయత్నాలైతే ఫలించాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఖమ్మం టిక్కెట్ ఆశించిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా కోదండరామ్‌కు ఫోన్ చేసి, ఇప్పటికే బీసీల్లో వ్యతిరేకత ఉందని, పొన్నాల పరిస్థితిని అర్థం చేసుకోవాలని, మీరు మరోస్థానం చూసుకోవాలని సూచించారని సమాచారం. అందుకు కోదండరాం స్పందిస్తూ.. జనగామను తాను కోరుకోలేదని, పొత్తులో భాగంగా తనకు వచ్చిందని చెప్పారట.

 

మరో పక్కన పొత్తులో భాగంగా సనత్‌నగర్ నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయిస్తారనే ప్రచారం సాగింది. దీంతో ఆ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళి, శుక్రవారం రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సనత్‌నగర్ టిక్కెట్‌ చివరికి శశిధర్‌రెడ్డికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీకి సనత్‌నగర్ బదులు మరో స్థానం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితికి కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు కేటాయించింది. వాటిలో మెదక్‌, దుబ్బాక, సిద్దిపేట, మల్కాజిగిరి, వర్ధన్నపేట, అంబర్‌‌పేట స్థానాలపై స్పష్టత వచ్చింది. మరో రెండు స్థానాలకు గానూ కోదండరామ్ వరంగల్ తూర్పు సెగ్మెంట్‌ను కోరుతున్నారు. అయితే మిర్యాలగూడను ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఇక జనగామను పొన్నాలకు క్లియర్ చేయడంతో తెలంగాణ జన సమితికి మరో నియోజకవర్గం ఏదైనా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.