20.7 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీఆర్ఎస్ బిగ్ ప్లాన్ .. భారీ పోలీస్ ఆపరేషన్ .. బిగ్ ఫ్లాప్..!!

Share

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జాతీయ పార్టీ బీజేపీ బేరసారాలు చేసిందనీ, ఆ బీజేపీ వ్యూహాన్ని కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్ భగ్నం చేసిందనీ చెప్పుకున్న కేసులో నిందితుల రిమాండ్ కు తరలించడంలో విఫలమైయింది పోలీస్ యంత్రాంగం. దీంతో టీఆర్ఎస్ బిగ్ ప్లాన్, భారీ పోలీస్ ఆపరేషన్ కు బిగ్ ఫ్లాప్ ఎదురైనట్లు అయ్యింది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్దన్ రెడ్డిలను పార్టీ ఫిరాయింపునకు బేరసారాలు జరిపారన్న అభియోగంపై రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, నందకుమార్. సింహయాజీలను భారీ ఆపరేషన్ తో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు, నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ఇంత భారీ ఆపరేషన్ లో ఘటనా స్థలంలో ఎటువంటి నగదు లభించకపోవడం గమనార్హం.

 

పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను గురువారం రాత్రి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హజరుపర్చి, ముగ్గురికి రిమాండ్ విధించాలని కోరారు. అయితే రిమాండ్ కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తికి సరైన ఆధారాలు లేని కారణంగా న్యాయమూర్తి తిరస్కరించారు. ఎలాంటి ఆధారాలు, నగదు లభ్యం కాకపోవడంతో రిమాండ్ ను తిరస్కరించిన న్యాయమూర్తి.. నిందితులకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన తర్వాతే విచారించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యేల కొనుగోలునకు మధ్యవర్తిగా వ్యవహరించారని అభియోగం ఎదుర్కొంటున్న నందు .. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆరోపణలను కొట్టిపారేశారు. పూజల కోసమే తాము మొయినాబాద్ ఫామ్ హౌస్ కు వెళ్లామని చెబుతున్నారు.

మరో పక్క ఈ కేసు విషయంపై తెలంగాణ బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రత్యేక దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ చేయించాలని పిటిషన్ లో కోరింది బీజేపీ. ఈ పిటిషన్ పై ఇవేళ విచారణ జరిగే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవలేమని తెలియడంతో టీఆర్ఎస్ ఈ సరికొత్త డ్రామాకు తెరలేపిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఇంత వరకూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఘటన జరిగిన రోజు రాత్రే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ కు వెళ్లి సీఎం కేసిఆర్ తో భేటీ అయ్యారు.

 

గురువారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు అని భావించారు. కానీ మీడియా ముందు టీఆర్ఎస్ నేతలు మాట్లాడవద్దని ఆ పార్టీ నిర్ణయించింది. కేసు విచారణ ప్రాధమిక దశలో ఉన్నందున పార్టీ నేతలు ఎవరూ మాట్లాడవద్దని కేటిఆర్ ట్విట్టర్ వేదికగా వెళ్లడించారు. అయితే ఈ కేసులో నిందితుడుగా ఉన్న నందుకు ఓ పక్క టీఆర్ఎస్, మరో పక్క బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నట్లుగా ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నందు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ఎటువంటి విషయాలను వెల్లడిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.


Share

Related posts

Heat Waves: ఐఎండీ హెచ్చరికలు..వడగాల్పులు.. జర జాగ్రత

somaraju sharma

మందుబాబులకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చిన కరోనా

Siva Prasad

‘హవాలా డబ్బు కోసమే విదేశీ పర్యటన’

somaraju sharma