తూర్పు లో మార్పు వచ్చిందా? పిల్లి కి జగన్ క్లాస్ పనిచేసినట్లేనా!!

 

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)

అధికార పార్టీ వైకాపాలో తూర్పుగోదావరి రాజకీయాలు కాక పుట్టించాయి. కాకినాడ డి ఆర్ సి సమావేశం వేదికగా మాజీ ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ మధ్య జరిగిన మాటల యుద్ధం విస్తృతంగా ప్రచారం కావడంతో తూర్పు రాజకీయాలపై అందరి కళ్లు పడ్డాయి. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వేదికగా జరిపిన పంచాయతీలో సానుకూల ఫలితం వచ్చినట్లే కనిపిస్తోంది. డిఆర్సి సమావేశంలో ఉప్పు నిప్పుగా మాటలు విసురుకున్న బోస్ చంద్రశేఖర్ లను జగన్ గట్టిగా మందలించి నట్లు తెలిసింది. ఇలా బహిరంగ వేదికలపై కీచులాడుకుంటే ప్రజలకు చులకన అవడం తో పాటు కార్యకర్తలను ఎలా ముందుగా నడిపించగలగుతామని జగన్ ప్రశ్నించినట్లు తెలిసింది.

సీనియర్లు ఇదేమిటి?

సమావేశం లో బోస్ వైఖరి పట్ల జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు వైకాపా నేతలు చెబుతున్నారు. ఏదైనా ఉంటే పార్టీపరంగా లేదా వ్యక్తిగతంగా తన ద్రుష్టి కి తీసుకురావాలి కానీ బహిరంగ సమావేశాల్లో అధికార పార్టీలో ఉన్న మనమే మన లోపాల్ని బయటపెట్టాయి ఉంటే ఎలా అంటూ బోస్ మీద గట్టిగానే అరిచినట్లు సమాచారం. టిడిపి హయాంలో జరిగిన అవినీతిని మన పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసినట్లుగా మాట్లాడితే ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారని జగన్ గట్టిగా అని అరిచినట్లు నేతలు పేర్కొంటున్నారు. మరోసారి ఇదే రిపీట్ అయితే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంది అని జగన్ హెచ్చరించినట్లు తెలిసింది. *దీంతోపాటు రామచంద్రపురం నియోజకవర్గంలో ఇటీవల పార్టీలోకి వచ్చిన తోట త్రిమూర్తులు విషయాన్ని, ఆయన దళితులకు శిరోముండనం చేయించిన కేసుపై పిల్లి సుభాష్ చంద్ర బోస్ హోంమంత్రికి లేఖ రాసిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. ఆ విషయంపై గతంలోనే తాను లేఖ రాశానని, పార్టీలోకి వచ్చిన తర్వాత రాసింది కాదని బోస్ చెప్పబోతుండగా అన్ని తనకు తెలుసు అంటూ జగన్ వారించినట్లు తెలిసింది. మరోసారి జిల్లాలో ఇలాంటివి రిపీట్ అయితే సహించేది లేదంటూ గట్టిగా నేతలకు హెచ్చరికలు జారీ చేసి పంపారు. ప్రస్తుతానికి తూర్పుగోదావరి రాజకీయాలు సద్దుమణిగిన లోలోపల మాత్రం అగ్నిజ్వాలలు రగులుతూనే ఉన్నాయి.

ద్వారంపూడి ఇంటికి బోస్

శుక్రవారం సాయంత్రం పిల్లి సుభాష్ చంద్రబోస్ కాకినాడ లోని ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి స్వయంగా వెళ్లారు. పలువురు బీసీ నేతలను కాకినాడ ఎంపీ వంగా గీత వెంటబెట్టుకుని మరి ద్వారంపూడి ఇంటికి వెళ్లి జరిగిందేదో జరిగింది పార్టీ కోసం కష్టపడతాం అంటూ ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి టీ తాగి వచ్చారు. డిఆర్సి సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలపై బోస్ మాత్రమే ముందుగా మాట్లాడారు కాబట్టి ఆయనే ద్వారంపూడి ఇంటికి వెళ్లి బేషరతుగా కలిస్తే బాగుంటుందని జగన్ సూచించిన తర్వాతే ఈ భేటీకి జరిగినట్లు తెలుస్తోంది. సమావేశంలో గొడవ మొదలు పెట్టింది సుభాష్ చంద్రబోస్ కాబట్టి, ఆయన ద్వారంపూడి ఇంటికి వెళ్తే నే అది పార్టీకి మంచి సంకేతాలు వెళ్తాయని కోణంలో, దీంతోపాటు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారికి కనువిప్పు కలిగి ఉందనే కోణంలో బోస్ను జగనే ద్వారంపూడి ఇంటికి పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బోస్ ఇది టీ కప్పులో తుఫాను లాంటిదని చెబుతున్నా భవిష్యత్తులో తూర్పు రాజకీయాల్లో కొత్త మార్పులు కనిపించవచ్చు.