లోకేష్ బుక్ అయినట్లేనా..!?

 

 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపు గ్రామాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అకివీడు మండలం సిద్దాపురంలో లోకేష్ ట్రాక్టర్ నడిపారు. అయితే ఈ ట్రాక్టర్ అదుపుతప్పి ఉప్పటేరు కాల్వలోకి దూసుకువెళ్లింది. పక్కన ఉన్న నేతలు సమయస్పూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదమే తప్పింది. అయితే ఈ వ్యవహారాన్ని పోలీసులు మాత్రం వదిలిపెట్టలేదు. సుమోటోగా నారా లోకేష్‌పై ఆకివీడు పోలీస్ స్టేషన్ రెండు కేసులు నమోదు చేశారు.

పది మందికి హానీ కల్గించే విధంగా ట్రాక్టర్ నడిపారని ఒక కేసు, కోవిడ్ 19 నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించారనీ మరో కేసు ఇలా రెండు కేసులను ఆకివీడు పోలీసులు సుమోటోగా  లోకేష్‌పై నమోదు చేశారు. సెక్షన్ 279 ఐపీసీ, 184,51/ ఎ, ఐపీసీ 3 పాండమిక్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇప్పటికే పలువురు టీడీపీ నేతలపై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పైనే కేసు నమోదు అయ్యింది. అయితే కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి  అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకరరెడ్డిపై రెండు సార్లు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. తొలుత నకిలీ పత్రాలతో వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో బెయిల్ మంజూరు అయిన తరువాత ఊరేగింపుగా ఇంటికి వెళుతున్న సమయంలో కోవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారన్న అభియోగంపై అరెస్టు చేశారు. ఆ తరువాత కరోనా నుండి బయటపడి ఆసుపత్రి డిశ్చార్జ్ అయిన ఇంటికి వెళుతున్న సమయంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనడంతో మళ్లీ కోవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘించారంటూ మళ్లీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇలా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డి రెండు సార్లు జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు నారా లోకేష్‌పై అటువంటి సెక్షన్ల కిందే కేసు నమోదు చేసినందున లోకేష్‌ను పోలీసులు అరెస్టు చేస్తారా లేదా అన్న విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతోంది.