జనసేనానితో ఆలీ భేటీ

విజయవాడ, జనవరి 6; ప్రముఖ హస్యనటుడు ఆలీ ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విజయవాడలో కలుసుకున్నారు. వైసీపీలో ఆలీ చేరుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన పవన్ కల్యణ్‌ను ఏకాంతంగా కలవడం కొత్త చర్చకు దారి తీసింది. జనసేన నాయకుడు ముత్తంశెట్టి కృష్ణారావుతో కలిసి పవన్ నివాసానికి వచ్చిన ఆలీ దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

తన గురువు, మార్గదర్శకుడు పవన్ అని చెప్పుకునే ఆలీ వైఎస్‌ఆర్‌సిపిలో చేరుతున్నారన్న వార్తలు జనసేన కార్యకర్తలకు మింగుడు పడలేదు. ఇద్దరికీ ఎక్కడన్నా చెడిందా అన్న చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ నేపధ్యంలో ఆయన నేడు పవన్ కల్యాణ్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇద్దరి మధ్యా జరిగిన చర్చ సారాశం ఏమిటన్న విషయం బయటకు పొక్కక పోవడంతో సస్పెన్స కొనసాగుతోంది. పవన్‌తోనే ఆలీ ఉంటారని జనసేన కార్యకర్తలు పేర్కొంటున్నారు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నఆలీ నేడు పవన్ ఆశీస్సుల తీసుకునేందుకే వచ్చారని కొందరు భావిస్తున్నారు.