జగన్ కి ఇక పగటి చుక్కలు ఖాయం..! ఏపీ బీజేపీ సంచలన నిర్ణయం..!?

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

వై ఎస్ జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా ప్రత్యక్ష పోరుకు ఆంధ్రప్రదేశ్ బిజెపి నిర్ణయించుకుంది. జగన్ ఇస్తున్న అవకాశాలను, జగన్ వదులుతున్న ఆయుధాలను వాడుకొని వాటిని జగన్‌పైకే ప్రయోగించి రాజకీయ లబ్దిపొందాలనేది బిజెపి వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ టిడిపిని పెద్ద కర్రతో, వైసీపీని చిన్న కర్తతో కొట్టుకుంటూ వస్తున్న బిజెపి ఇక మీదట తన చేతిలో రెండు కర్రలను పెట్టుకుని రెండు పార్టీలను కొట్టాలనే వ్యూహంగా పెట్టుకుంది.

 

టీడీపి ఇప్పటికే ఎమ్మెల్యేలను కోల్పోయి కార్యకర్తలు నైరాశ్యంలో ఉండి నైతిక స్థైర్యం దెబ్బతిన్న పార్టీగా మిగిలి ఉన్న నేపథ్యంలో తమ ప్రత్యర్థి వైసీపీ అని భావిస్తున్న బిజెపి జగన్ పై కూడా కొన్ని ఆస్త్రాలను, ఆయుధాలను సంధించాలని నిర్ణయించుకున్నది. ముఖ్యంగా హిందూ దేవాలయాపై జరుగుతున్నదాడులు, తిరుమల డిక్లరేషన్ వంటి అంశాలతో బిజెపి అలవాటుగా మారిన మత రాజకీయాలను ఏపిలో రుద్దాలని, జగన్‌కు వ్యతిరేకంగా పావులు కదపాలని యోచిస్తున్నది. తాజాగా నిన్న జరిగిన బిజెపి పతాధికారుల సమావేశంలో సోము వ్యాఖ్యలు, బిజెపి ఏపి పెద్దల మాటలు చూస్తుంటే ఇదే అర్థం అవుతోంది.

తిరుపతిలో ఉప ఎన్నికలో పోటీకి నిర్ణయం

రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందే బిజెపి పందెం కోడిలా దూసుకువస్తున్నది. తిరుపతి వైసీపి ఎంపి మరణించి పది రోజులు కూడా కాక ముందే తిరుపతిలో ఉప ఎన్నిక గురించి బిజెపి అంతర్గత సమావేశంలో చర్చ జరిగింది. ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని నిలబెట్టాలని, వైసీపీకి ఏకగ్రీవంగా ఇవ్వకూడదని బిజెపి పదాధికారుల సమావేశంలో నిర్ణయించుకున్నది. తిరుపతి ఉప ఎన్నికలకు వేళ్లే లోగానే ఏపిలో హిందూ సెంటిమెంట్‌ను బాగా రగిలించి తిరుమల డిక్లరేషన్ అంశాన్ని తిరుపతి ఎన్నికల ఆయుధంగా వాడుకుని వైసీపీని దెబ్బతీయాలని పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు, గతంలో జగన్మోహన రెడ్డి సీఎం కాక ముందు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామి దర్శనం చేసుకున్న అంశాన్ని, వై వి సుబ్బా రెడ్డి తిరుమల పట్ల చేస్తున్న కొన్ని వివాద అంశాలను వీడియోల రూపంలో, ప్రకటనల రూపంలో రూపొందించి వాటిని తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఆస్త్రాలుగా ఉపయోగించుకోవాలనేది బి జె పి పెద్ద వ్యూహంగా కనిపిస్తోంది. మరి వీటీని వైసీపి ఎలా ఎదుర్కొంటుంది. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో టీ డీ పి ఆస్త్రాలు, ఆయుధాలు ఏమి కానున్నాయి అనేది కూడా కొద్ది రోజుల్లో స్పష్టం కానున్నది.