విజయవాడలో బిజెపి నేతల అరెస్టు: కార్యాలయం వద్ద ఉద్రిక్తత

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

విజయవాడ బీజెపి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజెపీ ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో బీజెపీ నేతలు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పార్టీ కార్యాలయం నుండి నేతలు, కార్యకర్తలు ర్యాలీగా సబ్ కలెక్టర్ ఆఫీసుకు బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. బీజెపి రాష్ట్ర నాయకులు విష్ణువర్థన్ రెడ్డి, పాతూరి నాగభూషణం, ఆ పార్టీ నాయకులు నూతలపాటి బాల, సురేష్, శ్రీరాం, రవీంద్రరెడ్డి, వంగవీటి నరేంద్ర తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా విష్ణువర్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని, వైసీపీ ఎమ్మెల్యే రోజా వంటి వారు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పిఎం మోడి, యుపి సీఎం యోగి వంటి నేతల గురింతి మాట్లాడే అర్హత నానికి ఉందా అని ప్రశ్నించారు విష్ణువర్థన్ రెడ్డి, సీఎం జగన్ ఎంత కాలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. కొడాలి నాని వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు ప్రభుత్వానికి అయ్యా ఎస్ అనడం మానుకోవాలని సూచించారు విష్ణువర్థన్ రెడ్డి. చర్చిపై రాళ్లు వేస్తే 41మందిని అరెస్టు చేసిన పోలీసులు హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా, మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి నానిపై కేసు పెట్టి అరెస్టు చేయాలి, ఆయనను మంత్రి వర్గం నుండి తొలగించాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. దీనిపై  సిఎం జగన్ చర్యలు తీసుకోకపోతే నానితో జగనే ఇలా మాట్లాడిస్తున్నారు అనుకోవాల్సి వస్తుందన్నారు విష్ణువర్థన్ రెడ్డి.

 

మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో బిజెపి నేతల నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలలో బిజెపి నేతలు నిరసన కార్యక్రమాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.