ఆంధ్రాలో తెలంగాణ మాజీ ఎమ్మెల్యే పోటీ

అమరావతి, మార్చి 21 : తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం నేడు అందరినీ ఆకర్షిస్తుంది.

దానికి ప్రధాన కారణంగా తెలంగాణ అసెంబ్లీలో ఐదేళ్ల పాటు సిపిఎం  ఎమ్మెల్యేగా గళం వినిపించిన సున్నం రాజయ్య ఈ ఎన్నికల్లో ఇక్కడ నుండి పోటీ చేయడం.

2014 ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థిగా సున్నం రాజయ్య విజయం సాధించి గడచిన తెలంగాణ అసెంబ్లీలో సభ్యుడుగా కొనసాగారు.

ఎన్నికల అనంతరం పోలవరం ప్రాజెక్టు కోసం భద్రాచలం నియోజకవర్గం నుండి ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి. రాజయ్య స్వగ్రామం విఆర్ పురం మండలంలోని సున్నంవారిగూడెం గ్రామం రంపచోడవరం నియోజకవర్గంలో కలిసింది. దీంతో రాజయ్య ఆంధ్రప్రదేశ్ వాసి అయ్యాడు.

జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని సిపిఎంకు కేటాయించింది. ఇది సున్నం రాజయ్యకు కలిసి వచ్చినట్లు అయ్యింది.

సిపిఎం సున్నం రాజయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.

బరిలో నలుగురు..

ఈ నియోజకవర్గం నుండి  టిడిపి, వైసిపి, జనసేన బలపర్చిన సిపిఎం, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి నుండి విజయం సాధించిన వంతల రాజేశ్వరి నేడు టిడిపి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. వైసిపి అభ్యర్థిగా గులపల్లి ధనలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గొండి బాలయ్యలు పోటీ చేస్తున్నారు.

ఒక వేళ జనసేన బలపర్చిన సిపిఎం అభ్యర్థి సున్నం రాజయ్య విజయం సాధిస్తే అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీల్లో అడుగు పెట్టిన ఏకైన ఎమ్మెల్యేగా రికార్డు సొంతం చేసుకునే అవకాశం ఉంది.