హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడ దీక్షకు దిగారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలను రద్దు చేయాలని, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేపర్ ల లీకేజీలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరారు. గన్ పార్క్ దగ్గరకు రాగానే బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బండి సంజయ్ సడెన్ గా దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు.

బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్, కార్యకర్తలు దీక్షకు కూర్చున్నారు. ఇక్కడ దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అయినా తాను దీక్ష చేయడం ఖాయమనీ, అరెస్టు చేస్తే చేసుకోవచ్చని హెచ్చరించారు. బీజేపీ నేతలు ఎవ్వరూ అరెస్టులకు భయపడరని రాజేందర్ అన్నారు. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ సహ పలువురుని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను బీజేపీ నేతలు ప్రతిఘటించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్, ఈటల రాజేందర్ లను అరెస్టు చేసి తీసుకువెళుతున్న పోలీసు వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అసెంబ్లీ ముందు రోడుపై బీజేపీ మహిళా కార్యకర్తలు భైఠాయించారు.
మరో పక్క వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను హౌస్ అరెస్టు చేశారు. ఆందోళనల నేపథ్యంల టీఎస్పీఎస్సీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఎన్ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి బయలుదేరగా, గాంధీ భవన్ గేట్లు మూసి బయటకు రాకుండా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అయినా పలువురు కార్యకర్తలు గేట్లు దూకి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విపక్ష పార్టీలు ఈ వ్యవహారంపై టీఎస్పీఎస్సీ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి.య అలాగే ఆందోళనలు ఉధృతం చేశాయి. ఈ కేసులో ఇప్పటికే నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
మరో పక్క టీఎస్పీపీఎస్సీ గ్రుప్ 1 ప్రిలిమ్స్ ను కూడా రద్దు చేసింది. ఇప్పటికే ఏఈ పరీక్షతో పాటు టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్స్ పేపర్లు రద్దు చేసింది. తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు ఏఈఈ, డీఏవో పరీక్షను కూడా రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండగా, విపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి.