(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
లెజండరీ సింగర్ ఎస్ పి బాల సుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి. ఈ మేరకు సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి వైఎస్ జగన్ లేఖ రాశారు. బాలసుబ్రమణ్యంకు భారత రత్న ఇవ్వాలని ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపి సీఎం వైఎస్ జగన్ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఎస్ పి బాలు ఏంతో మంది వర్థమాన గాయకులను పరిచయం చేయడంతో పాటు 50ఏళ్ల పాటు సంగీత ప్రియులను అలరించారని జగన్ లేఖలో పేర్కొన్నారు. మాతృభాషలో 40వేలకు పైగా పాటలు పాడటమే కాక తమిళ, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో కూడా ఎన్నో గీతాలు ఆలపించారనిీ గుర్తు చేశారు. ఆరు జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు బెస్ట్ మేల్ బ్యాక్ సింగర్ గా గుర్తింపు పొందారని అన్నారు. ఏపి ప్రభుత్వం నుండి 25 నంది అవార్డులతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా అనేక అవార్డులు పొందారని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను ప్రధానం చేసిన విషయాన్ని లేఖలో జగన్ ప్రస్తావించారు. ఇప్పటికే ప్రముఖ నేపథ్య గాయకులు లతా మంగేేష్కర్, భుపెన్ హజారిక, ఎంఎస్ సుబ్బలక్ష్మి, బిస్మీల్లా ఖాన్, భీమ్ సేన్ జోషిలకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాలు అందజేసిన విషయాన్ని గుర్తు చేస్తూ అయిదు దశాబ్దాల పాటు గాయకుడిగా సంగీతాభిమానులను అలరింపజేసిన బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వాలని కోరారు వైఎస్ జగన్.