నందమూరి అల్లుడి ‘గీతం’ ఆగినట్టే..! విశాఖలో మొదలైన రాజకీయం..

రాష్ట్ర రాజకీయం మొత్తం విశాఖ చుట్టూ తిరుగుతోంది. కాబోయే రాజధాని విశాఖపట్నం అంటూ.. ఇక్కడ పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో ఎంతోకొంత ఫలితాలు సాధించిన టీడీపీ ఇక్కడ పట్టు సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలో విశాఖ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పే ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. ఇందులో భాగంగా టీడీపీ హయాంలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చే పనిలో ఉంది. ప్రస్తుతం టీడీపీ ఎంపీగా పోటీ చేసిన హీరో బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ కు చెందిన గీతం యూనివర్శిటీ ఆక్రమణలు తొలగించే పనిలో పడింది.

big jolt to nandamuri son in law in visakhapatnam
big jolt to nandamuri son in law in visakhapatnam

నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారు..

గీతం యూనివర్శిటీ కొన్ని అక్రమ నిర్మాణాలకు పాల్పడిందని గుర్తించిన రెవన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. యూనివర్శిటీ గోడల్ని, సెక్యూరిటీ విభాగం గదుల్ని కూల్చివేశారు. రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో గీతం యూనివర్శిటీ ఉంది. కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసుల్ని మోహరించారు. బీచ్ రోడ్డు వైపు రాకపోకల్ని నిషేధించారు. శ్రీ భరత్ హీరో బాలకృష్ణ అల్లుడు కావడంతో ఈ వార్త మరింత చర్చనీయాంశమైంది. అయితే.. అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారని యూనివర్శిటీ యాజమాన్యం ఆరోపిస్తోంది. కోర్టు పరిధిలో ఉన్న విషయాలను ఉన్నతాధికారులకు విన్నవించినా కూల్చివేతకు పాల్పడుతున్నారని అంటున్నారు. కూల్చివేత విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

రెవెన్యూ అధికారులు ఏమంటున్నారంటే..

దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు.. గీతం యూనివర్శిటీలో కొంతమేర ఆక్రమణలో ఉందని అంటున్నారు. దీనిపై గతంలోనే యాజమాన్యంతో సంప్రదింపులు జరిపామన్నారు. విశాఖలో ఉన్న ఆక్రమణలపై అయిదు నెలల క్రితం నుంచే సర్వే చేపట్టామని ఆర్డీఓ కిశోర్ అంటున్నారు. ఆక్రమణలో ఉన్న భవనాలు అన్నింటినీ కూల్చేస్తామని అంటున్నారు. కూల్చివేతపై యాజమాన్యానికి సమాచారం ఉందని.. వారికి ముందే తెలుసని అంటున్నారు. గత టీడీపీ హయాంలో అధికారం అండతో ఈ ఆక్రమణలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం గీతం యూనివర్శిటీ పరిధిలో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు రెవన్యూ అధికారులు గుర్తించినట్టు.. వాటిని స్వాధీనం చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. యూనివర్శిటీ పరిధికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి ఇవ్వనున్నారు అధికారులు.