సంజయ్ దీక్ష..! టిఆర్ఎస్ VS బీజెపీ..వేడెక్కిన దుబ్బాక..!!

 

(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు నిన్న సిద్దిపేటలో బీజెపీ అభ్యర్థి రఘునందనరావు మామ ఇంట్లో సోదాలు జరపడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. బీజెపీ అభ్యర్థి రఘునందనరావును పరామర్శించేందుకు వెళ్లి రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకుని కరీంనగర్‌కు తరలించారు. సిద్దిపేట సీపీ తన పట్ల అమానుషంగా వ్యవహించారనీ, అధికార పార్టీకి కొమ్ముకాసే విధంగా సీపీ వ్యవహరిస్తున్నారంటూ బండి సంజయ్ ఆరోపించారు.

సీపీ చర్యలను నిరసిస్తూ కరీంనగర్‌లోని ఆయన కార్యాలయం వద్ద నిన్నరాత్రి నుండి బండి సంజయ్ దీక్ష చేపట్టారు. బండి సంజయ్ దీక్షకు మద్దతుగా మంగళవారం పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు అక్కడకు చేరుకుని సంఘీభావం తెలుపుతున్నారు. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. బీజెపీ అభ్యర్థి రఘునందనరావు, ఆయన బంధువుల నివాసాల్లో అక్రమంగా సోదాలు నిర్వహించారని బండి సంజయ్ అన్నారు. సీపీ జోయల్ డేవిస్ టీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కెసిఆర్ భార్యను, పిల్లలను తనిఖీ చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం లేదు, ఓటమి భయంతోనే పిచ్చి పనులు చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకునే వరకు తన దీక్షకు కొనసాగిస్తానని బండి పేర్కొన్నారు.

కాగా బీజెపీ అభ్యర్థి రఘునందనరావు బంధువుల ఇళ్లలో సోదాలు, సిద్దిపేటలో పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. ఆయన ఎంపి బండి సంజయ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి పరిస్థితులను అమిత్‌షాకు బండి సంజయ్ వివరించారు.

ప్రగతి భవన్ వద్ద విస్తృత బందోబస్తు..ఎక్కడికక్కడ బీజేపీ నేతల అరెస్టు

మరో పక్క బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌పై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ నేడు చలో ప్రగతి భవన్‌కు ఏబీవీపీ, బీజేవైఎం పిలుపుఇచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బీజెపీ, ఏబీవీపీ, బీజేవైఎం నేతలను ఎక్కడిక్కడ గృహ నిర్బంధం (హౌస్ అరెస్టు) చేస్తున్నారు.